
జైలు లోపలికి వెళుతున్న ఎంపీ రఘురామ
సాక్షి, గుంటూరు, అమరావతి: నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు ఆదివారం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు 3468 నంబర్‌ను కేటాయించారు. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, ఓ మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడు అయిన ఎంపీకి గుంటూరు సీఐడీ కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను జైలుకు తరలించారు. జైలులోని పాత బ్యారక్‌లో గల ఓ సెల్‌లో ఆయన్ను ఉంచారు.
జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు
సీఐడీ పోలీసులు శనివారం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరు పరచగా తనపై పోలీసులు దాడి చేశారని జడ్జికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గుంటూరు జీజీహెచ్ వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి రఘురామకృష్ణరాజును పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ డాక్టర్ సుబ్బారావులు సభ్యులుగా ఏర్పాటైన మెడికల్ బోర్డు ఎంపీకి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ స్కానింగ్, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్, చర్మ వ్యాధులకు సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. అనంతరం నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్ భవనంలోని రెండో అంతస్తులోని గదిలోకి ఆయన్ను తరలించారు. ఆదివారం కూడా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్‌లో డాక్టర్ ప్రభావతి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మెసెంజర్ ద్వారా మెడికల్ బోర్డు నివేదికను హైకోర్టు ధర్మాసనానికి పంపించారు. అనంతరం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఎంపీని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
రఘురామ కాల్ డేటాపై సీఐడీ కన్ను
నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు చెందిన కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్‌లపై సీఐడీ దృష్టి పెట్టింది. ఎంపీకి టీడీపీ పెద్దలు, టీడీపీ అనుకూల మీడియా కీలక వ్యక్తులు ఫోన్‌ల ద్వారా టచ్‌లో ఉన్నట్టు సీఐడీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. వారు పలు కీలక విషయాలపై డైరెక్షన్ ఇచ్చినట్టు గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment