ఎన్‌ఎంసీ బిల్లు రద్దు చేయాల్సిందే.. | GGH Doctors Protest In Guntur | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంసీ బిల్లు రద్దు చేయాల్సిందే..

Published Sat, Aug 3 2019 8:43 AM | Last Updated on Sat, Aug 3 2019 8:43 AM

GGH Doctors Protest In Guntur  - Sakshi

జీజీహెచ్‌లో నిరసన తెలుపుతున్న జూనియర్‌ డాక్టర్లు

 సాక్షి, గుంటూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్‌ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. వర్షంలో సైతం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట నిలబడి నినాదాలు చేస్తూ, బిల్లును రద్దు చేసే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) గుంటూరు నగర అధ్యక్షురాలు డాక్టర్‌ పమిడి ముక్కల విజయ, సెక్రటరీ డాక్టర్‌ ఆవుల శ్రీనివాస్, ఇతర ఐఎంఏ నేతలు జూడాల సమ్మెకు  మద్దతిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్‌ విజయ మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఇటీవల ఆమోదం పొందిన ఎన్‌ఎంసీ బిల్లు వల్ల ఎంతో కష్టపడి ఎంబీబీఎస్‌ వైద్య చదివే విద్యార్థులకు, వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ బిల్లు సామాజిక స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, పేద, మధ్యతరగతి వారికి తీరని లోటును మిగులుస్తుందని విచారం వ్యక్తం చేశారు.

బిల్లులోని కొన్ని అంశాలను వైద్య లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వైద్య విద్యలో అన్ని నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని, ఫలితంగా వైద్యులు, ఆస్పత్రుల స్వేచ్ఛను కేంద్రం హరిస్తుందోని ఆరోపించారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ), అన్ని స్వయం ప్రతిపత్తి సంస్థలు తమ ఉనికి కోల్పోతాయన్నారు. ప్రైవేటు, డీమ్డ్‌ కాలేజీలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండే 85 శాతం సీట్లను 50 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమైన విషయంగా అభిప్రాయపడ్డారు. దీని వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంబీబీఎస్‌ అర్హత లేనివారికి కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్స్‌ పేరుతో లైసెన్సు ఇచ్చి వైద్యం చేయమని కేంద్రం ప్రొత్సాహం ఇస్తుందని.. దీని ద్వారా దేశ ఆరోగ్య పరిస్థితి దిగజారుగుతుందన్నారు. వైద్య విద్యలో నాణ్యత పెంపొందించేందుకు ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడుతున్నామని చెబుతూ వాటి గురించి స్పష్టత ఇవ్వకపోవడం వైద్య విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుందన్నారు. వైద్యుల, వైద్య విద్యార్థుల అభ్యర్థలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి బిల్లును రాజ్యసభలో ఆమోదించడం పట్ల వ్యతిరేకతను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్‌స్పెషాలిటీ వైద్యులు, వైద్య విద్యార్థులు అత్యవసర వైద్య సేవలను సైతం బహిష్కరించినట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పవన్‌ తెలిపారు. ఐఎంఈ సెక్రటరీ డాక్టర్‌ ఆవుల శ్రీనివాస్, జూనియర్‌ డాక్టర్ల సంఘం నేతలు మోహన్, రాజేశ్వరి, శ్రీనివాస్, విరంచి శ్రావణి, లోకేష్‌శర్మ, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement