కర్నూలు సర్వజన ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ విభాగాన్ని పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి, అమరావతి/ కర్నూలు(హాస్పిటల్)/ ఉలవపాడు/ గుంటూరు మెడికల్: స్వైన్‌ఫ్లూ వైరస్ రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్ని జిల్లాలకే పరిమితమై ఉన్న ఈ వైరస్ ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు విస్తరించింది. స్వైన్‌ఫ్లూ తీవ్రతతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 2018 అక్టోబర్ 24 నాటికి అధికారిక లెక్కల ప్రకారం 93 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాగా, అనధికారికంగా ఇంతకంటే ఇంకా ఎక్కువ కేసులు నమోదై ఉంటాయని భావిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన కేసులు అధికారిక లెక్కల్లోకి తీసుకోవట్లేదని తెలుస్తోంది. స్వైన్‌ఫ్లూ వల్ల ఇప్పటివరకూ 7 మంది మాత్రమే మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూండగా, 13 మందికి పైనే మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. స్వైన్‌ఫ్లూ తీవ్రత ప్రస్తుతం చిత్తూరు, విశాఖ, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వేధిస్తున్న వసతుల కొరత
రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో మాత్రమే స్వైన్‌ఫ్లూ బాధితులకు ప్రత్యేక వైద్యం ఉంది. కానీ అక్కడ ఇన్‌పేషెంట్ల రద్దీ పెరగడంతో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం కనిపిస్తోంది. అలాగే జ్వర లక్షణాలున్న బాధితులకు సరైన వైద్యం అందించడంలో వసతుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో బాధితులు, ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువవుతోంది. బస్టాండ్లు, ఎయిర్‌పోర్ట్‌లు తదితర జనసమర్థ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామని ప్రజారోగ్య శాఖ అధికారులు చెబుతున్నా స్వైన్‌ఫ్లూ విస్తరణను నియంత్రించలేకపోతున్నారు. రాష్ట్రాన్ని ఇప్పటికే మలేరియా, డెంగీ, విషజ్వరాలు వణికిస్తుండగా ఇప్పుడు స్వైన్‌ఫ్లూ మరింత ఆందోళన కలిగిస్తోంది. రానున్న సీజన్ స్వైన్‌ఫ్లూ విస్తరణకు మరింత అవకాశం కల్పిస్తుందని, నియంత్రణా చర్యలు తీసుకోలేక పోతే మరింత ప్రమాదం జరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో మరో ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్వైన్‌ఫ్లూ వల్ల బుధవారం మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో నెల రోజుల వ్యవధిలోనే మృతుల సంఖ్య పదికి చేరింది. అలాగే నెల వ్యవధిలో కర్నూలు సర్వజన ఆస్పత్రిలో 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇంతకుముందు ఏడుగురు మృతిచెందగా బుధవారం కర్నూలు మండలం వెంగన్నబావి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు, ప్యాపిలికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి, ఆదోనికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి మృత్యువాతపడ్డారు. ఏడుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఇంకా 8 మంది చికిత్స పొందుతున్నారు.
గుంటూరులో స్వైన్ ఫ్లూ కేసు నమోదు
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడుకు చెందిన టి.రాజశేఖరరెడ్డికి స్వైన్ ఫ్లూ సోకినట్లు బుధవారం గుంటూరు జీజీహెచ్ వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ నెల 21న జ్వరం, దగ్గుతో బాధపడుతున్న రాజశేఖరరెడ్డిని కుటుంబ సభ్యులు జీజీహెచ్‌లో చేర్పించారు. జీజీహెచ్‌లో స్వైన్‌ఫ్లూ ఉందన్న అనుమానంతో పరీక్ష చేయగా బుధవారం నిర్ధారణ జరిగింది. దీంతో బాధితుడిని గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లాలో ఈనెలలో స్వైన్ ఫ్లూ కేసు నమోదవడం ఇది మూడోది.
ప్రకాశంలో యువకుడి మృతి
స్వైన్‌ఫ్లూ వ్యాధితో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నానికి చెందిన ఓ యువకుడు బుధవారం మృతి చెందాడు. రామాయపట్నంకు చెందిన పంతంగి చంద్రశేఖర్ (33) మూడేళ్లుగా ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 18న నెల్లూరు జిల్లా కావలి మండలం గుమ్మడిబండల గ్రామంలో బంధువుల ఇంట వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన చంద్రశేఖర్ అనారోగ్యానికి గురి కావడంతో కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. మర్నాడు ఒంగోలుకు తరలించగా పరిస్థితి విషమించడంతో ఈ నెల 20న విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 23న బాధితుడికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అక్కడ చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ బుధవారం ఉదయం మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment