సాక్షి, గుంటూరు: ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న రిమాండ్ ఖైదీకి చికిత్స చేసేందుకు వైద్యులు ససేమిరా అంటున్నారు. అతనికి ఎలాగైనా వైద్యం చేయించేందుకు జైలు సిబ్బంది పడుతున్న అగచాట్లు అన్నీఇన్నీ కావు. జైలర్ జోక్యం చేసుకోవడంతో తాత్కాలికంగా చికిత్స చేసేందుకు జీజీహెచ్ వైద్యులు అంగీకరించారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన డొప్పా రామమోహన్‌రావు కూరగాయాల కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార లావాదేవీలలో భాగంగా ఓ వ్యక్తికి చెక్కు ఇచ్చాడు. అదికాస్తా బౌన్స్ కావడంతో కోర్టు అతనికి రిమాండ్ విధించింది. తొమ్మిది నెలలుగా ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. పది రోజుల క్రితం అతని ఆరోగ్యం క్షిణించింది. గతంనుంచే ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న అతను స్ధానిక వైద్యుల వద్ద చికిత్స పొందుతుండేవాడు. జైలుకు వచ్చాక సరిగా మందులు వాడకపోవడంతో కడుపులో నొప్పి మళ్లీ మొదలైంది. కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతుండడంతో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆరు రోజులైనా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడినుంచి శనివారం సాయంత్రం గుంటూరు సమగ్రాసుపత్రికి తరలించారు. తమవద్ద ఈ వ్యాధికి సంబంధించిన వైద్యులు లేరని అడ్మిట్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. రామమోహన్‌రావుకు కడుపులో నొప్పితోపాటు షుగర్ వ్యాధి కూడా ఉంది. అతని ఆరోగ్యం క్షీణిస్తోందని జైలు సిబ్బంది వైద్యులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వారు జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.
ప్రాణహాని జరిగితే మీదే బాధ్యత: వైద్యులకు చెప్పిన జైలర్
ఏలూరు జైలర్ వి.వి.సత్యనారాయణరెడ్డి ఆస్పత్రికి చేరుకుని డ్యూటీ డాక్టర్లను నిలదీశారు. ఓ రిమాండ్ ఖైదీకి చికిత్స లేదని, అడ్మిట్ చేసుకోమని ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్‌లో ఉన్న ఖైదీ బాధ్యత వైద్యులపై కూడా ఉంటుందని, ఖైదీకి ప్రాణహాని జరిగితే వైద్యులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఎమ్‌ఓ అక్కడికి రాగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళాలంటే కుదరదని, రెండు రోజులు సెలవల కారణంగా అడ్మిషన్ ఇవ్వాల్సిందేనని జైలర్ సూచించారు. దీంతో ఖైదీకి మంగళవారం సాయంత్రం వరకు చికిత్స అందించేందుకు వైద్యులు అంగీకరించారు. మంగళవారం సాయంత్రం విశాఖ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని జైలర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment