remand khaidi
-
ఈ ఖైదీకి చికిత్స చేయలేం.. తీసుకెళ్లండి
సాక్షి, గుంటూరు: ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న రిమాండ్ ఖైదీకి చికిత్స చేసేందుకు వైద్యులు ససేమిరా అంటున్నారు. అతనికి ఎలాగైనా వైద్యం చేయించేందుకు జైలు సిబ్బంది పడుతున్న అగచాట్లు అన్నీఇన్నీ కావు. జైలర్ జోక్యం చేసుకోవడంతో తాత్కాలికంగా చికిత్స చేసేందుకు జీజీహెచ్ వైద్యులు అంగీకరించారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన డొప్పా రామమోహన్‌రావు కూరగాయాల కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార లావాదేవీలలో భాగంగా ఓ వ్యక్తికి చెక్కు ఇచ్చాడు. అదికాస్తా బౌన్స్ కావడంతో కోర్టు అతనికి రిమాండ్ విధించింది. తొమ్మిది నెలలుగా ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. పది రోజుల క్రితం అతని ఆరోగ్యం క్షిణించింది. గతంనుంచే ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న అతను స్ధానిక వైద్యుల వద్ద చికిత్స పొందుతుండేవాడు. జైలుకు వచ్చాక సరిగా మందులు వాడకపోవడంతో కడుపులో నొప్పి మళ్లీ మొదలైంది. కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతుండడంతో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆరు రోజులైనా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడినుంచి శనివారం సాయంత్రం గుంటూరు సమగ్రాసుపత్రికి తరలించారు. తమవద్ద ఈ వ్యాధికి సంబంధించిన వైద్యులు లేరని అడ్మిట్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. రామమోహన్రావుకు కడుపులో నొప్పితోపాటు షుగర్ వ్యాధి కూడా ఉంది. అతని ఆరోగ్యం క్షీణిస్తోందని జైలు సిబ్బంది వైద్యులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వారు జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ప్రాణహాని జరిగితే మీదే బాధ్యత: వైద్యులకు చెప్పిన జైలర్ ఏలూరు జైలర్ వి.వి.సత్యనారాయణరెడ్డి ఆస్పత్రికి చేరుకుని డ్యూటీ డాక్టర్లను నిలదీశారు. ఓ రిమాండ్ ఖైదీకి చికిత్స లేదని, అడ్మిట్ చేసుకోమని ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్‌లో ఉన్న ఖైదీ బాధ్యత వైద్యులపై కూడా ఉంటుందని, ఖైదీకి ప్రాణహాని జరిగితే వైద్యులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. విషయం తెలుసుకున్న ఆర్ఎమ్ఓ అక్కడికి రాగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళాలంటే కుదరదని, రెండు రోజులు సెలవల కారణంగా అడ్మిషన్ ఇవ్వాల్సిందేనని జైలర్ సూచించారు. దీంతో ఖైదీకి మంగళవారం సాయంత్రం వరకు చికిత్స అందించేందుకు వైద్యులు అంగీకరించారు. మంగళవారం సాయంత్రం విశాఖ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని జైలర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. -
మార్చురీ ఎదుట ఆందోళన
రిమాండ్ ఖైదీ మృతిపై బంధువుల ఆగ్రహం తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపణ కాకినాడ క్రైం : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మార్చురీ వద్ద రిమాండ్ ఖైదీ రీమల చినబాబు (31) మృతిపై బంధువులు ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రీమల చినబాబును గంజాయి అక్రమ రవాణా కేసులో జనవరి 3న తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇతనితో పాటూ మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తొలుత తుని సబ్‌జైల్, అక్కడ నుంచి 25వ తేదీన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిందితుడ్ని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 27న చేర్చామని, మలేరియాతో బాధపడుతుండడం వల్ల మెరుగైన చికిత్స కోసం 29వ తేదీన కాకినాడ జీజీహెచ్‌కు తరలించినట్లు జైల్ సూపరింటెండెంట్ ఎస్.రాజారావు తెలిపారు. చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి అతడు మృతి చెందాడన్నారు. జైలు అధికారుల సమాచారంతో మంగళవారం కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకున్న మృతుని బంధువులు, భార్య మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్నామని, డ్రైవింగ్ నేర్చుకోవడంతో కిరాయికి వెళ్లిన తన భర్తను గంజాయి అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేశారని భార్య సత్యవతి తెలిపింది. తన భర్తను జైల్లో పెట్టినట్లు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కానీ అతడు మృతి చెందే వరకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించింది. తన భర్త మృతికి కారణమైన జైల్ అధికారులపై మెజిస్టీరియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జనవరి 3న అరెస్టు చేసిన పోలీసులు 9వ తేదీ దాకా కోర్టులో హాజరు పరచకుండా తీవ్రంగా కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడం వల్లే మృతి చెంది ఉంటాడని ఆరోపించింది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే తన ఇద్దరు చిన్నారులతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. బాధితులకు వ¯ŒS టౌ¯ŒS ఎస్సై ఈ.అప్పన్న సర్దిచెప్పడంతో శాంతించారు. మృతి చెందిన రెండు రోజులు గడుస్తున్నా మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా వంతాడ సర్పంచి సన్యాసిరావుతో పాటు 18 మంది మృతుని బంధువులు పాల్గొన్నారు.