మార్చురీ ఎదుట ఆందోళన
-
రిమాండ్ ఖైదీ మృతిపై బంధువుల ఆగ్రహం
-
తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపణ
కాకినాడ క్రైం :
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మార్చురీ వద్ద రిమాండ్ ఖైదీ రీమల చినబాబు (31) మృతిపై బంధువులు ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రీమల చినబాబును గంజాయి అక్రమ రవాణా కేసులో జనవరి 3న తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇతనితో పాటూ మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తొలుత తుని సబ్‌జైల్, అక్కడ నుంచి 25వ తేదీన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిందితుడ్ని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 27న చేర్చామని, మలేరియాతో బాధపడుతుండడం వల్ల మెరుగైన చికిత్స కోసం 29వ తేదీన కాకినాడ జీజీహెచ్‌కు తరలించినట్లు జైల్ సూపరింటెండెంట్ ఎస్.రాజారావు తెలిపారు. చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి అతడు మృతి చెందాడన్నారు. జైలు అధికారుల సమాచారంతో మంగళవారం కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకున్న మృతుని బంధువులు, భార్య మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్నామని, డ్రైవింగ్ నేర్చుకోవడంతో కిరాయికి వెళ్లిన తన భర్తను గంజాయి అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేశారని భార్య సత్యవతి తెలిపింది. తన భర్తను జైల్లో పెట్టినట్లు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కానీ అతడు మృతి చెందే వరకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించింది. తన భర్త మృతికి కారణమైన జైల్ అధికారులపై మెజిస్టీరియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జనవరి 3న అరెస్టు చేసిన పోలీసులు 9వ తేదీ దాకా కోర్టులో హాజరు పరచకుండా తీవ్రంగా కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడం వల్లే మృతి చెంది ఉంటాడని ఆరోపించింది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే తన ఇద్దరు చిన్నారులతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. బాధితులకు వ¯ŒS టౌ¯ŒS ఎస్సై ఈ.అప్పన్న సర్దిచెప్పడంతో శాంతించారు. మృతి చెందిన రెండు రోజులు గడుస్తున్నా మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా వంతాడ సర్పంచి సన్యాసిరావుతో పాటు 18 మంది మృతుని బంధువులు పాల్గొన్నారు.