గుంటూరు (మెడికల్): గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్‌బాబు నటించిన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ.. రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటి పండు అనే వ్యక్తి జనవరి 2న అపస్మారక స్థితిలో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. కుడికాలు, కుడిచెయ్యి బలహీనపడటంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు
ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్‌కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ జనవరి 25న అవేక్ బ్రెయిన్ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వివరించారు. ఆపరేషన్ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో శనివారం డిశ్చార్జి చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment