సాక్షి, హైదరాబాద్: క్లిష్టమైన రోగమైనా ఇక్కడ ఇట్టే నయమవుతుందనే నమ్మకం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసినా దొరకని స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయనే భావన. అరుదైన చికిత్సలు..పరిశోధనలతో ఉత్తమ గుర్తింపు పొందిన నిమ్స్ నేడు కొంత మంది వైద్యుల తీరుతో అబాసు పాలవుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తోడు అక్రమార్జనకు అలవాటు పడిన కొంత మంది వైద్యులు రోగులను మభ్యపెట్టి ఆస్పత్రికి చెడ్డపేరు తీసు కొస్తున్నారు.
ఫలితంగా తక్కువ ధరకే నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది. తాజాగా ఓ వైద్యుడు రోగికి ఎలాంటి సర్జరీ చేయకుండానే చేసినట్లు డిశ్చార్జ్ సమ్మరీలో చూపించడమే కాకుండా ఆయన వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు 15 మంది రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆస్పత్రి యాజమాన్యం సీరియస్ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణ కోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
సర్జరీ చేయకుండానే...చేసినట్లు రికార్డులు..
ఎల్లారెడ్డిగూడకు చెందిన వెంకటేశ్వర్‌రావు(47) వాంతులు, కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం2 2021 ఏప్రిల్4న నిమ్స్‌కు చేరుకున్నాడు. న్యూరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సమస్య ఉంది..ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, అం దులోనే సర్జరీ చేయాలని సదరు బాధితుడు వైద్యులకు మొర పెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఈ చికిత్స లేదని, డబ్బులు కట్టి సర్జరీ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
వైద్య ఖర్చులకు డబ్బు లేకపోవడంతో వెంకటేశ్వరరావు శస్త్రచికిత్స చేసుకోకుండానే ఇంటి ముఖం పట్టారు. అయితే, డాక్టర్లు ఇక్కడే తప్పులో కాలేశారు. డిశ్చార్జీ సమ్మరీలో వెంకటేశ్వరరావుకు సర్జరీ చేసినట్లు నమోదు చేయడమేగాకుండా.. కుట్లు తీయించుకునేందుకు ఫలానా తేదీనాడు రావాలని సూచించారు. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టడం..లాక్‌డౌన్ కారణంగా ఆయన ఆస్పత్రికి రాలేకపోయారు. ఇటీవల ఆనారోగ్య సమస్య తీవ్రం కావడంతో గతేడాది డిసెంబర్ 28న ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు.
అక్కడి వైద్యుల సమాధానం విని బిత్తెరపోయారు. నిమ్స్ వైద్యులు రాసిన డిశ్చార్జీ సమ్మరీ చూసి వైద్యులు ఆశ్చర్య పోయారు. ఆపరేషన్ చేయక పోయినా...చేసినట్లు సమ్మరిలో పేర్కొనడంతో వారు చికిత్సకు నిరాకరించి.. మళ్లీ నిమ్స్‌కు వెళ్లమని తిప్పిపంపారు. దీంతో ఆయన గురువారం నిమ్స్ న్యూరాలజీ ఓపీకి వచ్చాడు. ఇంతకు ముందు నిన్నెవరు చూశారో వాళ్ల దగ్గరికి వెళ్లమని సలహా ఇచ్చారు. గతంలో చూసిన వైద్యుడెవరో తెలియని వెంకటేశ్వరరావు..ఏం చేయాలో అర్థంగాక తలపట్టుకున్నారు. ఇప్పటికే చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేసుకున్న తనకు సర్జరీ కోసం మళ్లీడబ్బులు సర్దుబాటు చేయడం తలకు మించిన భారమని వాపోయారు.
ఏసీబీకి ఫిర్యాదు చేసిన మరో బాధితుడు
అదే విధంగా బడంగ్‌పేటకు చెందిన అరుణ కుమార్ మెదడులో ఏర్పడిన కణితి సమస్యతో బాధపడుతూ నిమ్స్‌ను ఆశ్రయించాడు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.. డబ్బులు కట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రిలోని ఓ అధికారి సిఫార్సుతో వచి్చన ఆ రోగికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.50 వేలు కట్టించి పరీక్ష చేయించారు.
అంతే కాకుండా ఓ అధికారి కూడా అతని వద్ద నుంచి ఆపరేషన్ చేయించేందుకు గానూ రూ. 20వేలు వసూలు చేశాడు. చివరికి ఆపరేషన్ చేయకుండానే డిశ్చార్జి చేశారు. సదరు బాధితుడు ఇటీవల ఏసీబీకి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. సదరు అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ సాయిబాబాలతో విచారణ కమిటీ వేసింది.
(చదవండి: వడ్డీలేని రుణాల పేరిట కేసీఆర్ మోసం )
Comments
Please login to add a commentAdd a comment