మీడియా సమావేశంలో వైద్యాధికారి, జైళ్ల శాఖ డీఐజీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. ఆయన వైద్య పరీక్షలకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలపై జీజీహెచ్ వైద్య బృందం, జిల్లా ఎస్పీ పి.జగదీష్ లతో డీఐజీ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు 67 కిలోల బరువు ఉన్నారన్నారు.
ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. జీజీహెచ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్కండేయులు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతాదేవి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పాథాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.హిమజ బృందం చంద్రబాబు ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించిందని వెల్లడించారు.
స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు..
ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి అన్నీ బాగున్నాయని చెప్పారు. తమతో ఆయన బాగా మాట్లాడారన్నారు. అన్ని విషయాలు అడిగామన్నారు. షుగర్ కూడా అదుపులోనే ఉందని తెలిపారు. చంద్రబాబు వాడుతున్న మందులను కూడా పరిశీలించామన్నారు. శరీరంపై దద్దుర్లు ఉన్నాయని.. వాటికి ఆయన వాడుతున్న మందులతో పాటు తాము కొన్ని రకాల మందులు ఇచ్చామని వివరించారు.
స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్న మాట పూర్తిగా అసత్యమన్నారు. శరీరంపై ఉన్న దద్దుర్ల దృష్ట్యా చల్లని వాతావరణంలో ఆయన ఉండాలని చెప్పారు. జీజీహెచ్‌లో చంద్రబాబుకు వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక గది ఏర్పాటు చేయలేదన్నారు.
నిత్యం జీజీహెచ్‌లో ఒక ప్రత్యేక గది ఉంటుందని స్పష్టం చేశారు. కాగా చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు డీఐజీ రవికిరణ్ సమాధానం చెబుతూ ఇప్పటివరకు జైళ్ల శాఖలో ఖైదీలకు ఏసీ ఏర్పాటు చేయలేదన్నారు. కాబట్టి తాము ఏసీని ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు. వైద్య బృందం ఇచ్చిన నివేదికను కోర్టుకు అందజేస్తామన్నారు, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.
జైలు లోపల 85 ఏళ్ల వృద్ధ ఖైదీ కూడా ఉన్నారన్నారు. జైలు లోపల ఉన్న అందరినీ జాగ్రత్తగా చూస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రత్యేక ఖైదీ అయినందున మరింత శ్రద్ధ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. జైలులో జరుగుతున్న ప్రతి విషయాన్ని కోర్టుకు నివేదిస్తున్నామని వివరించారు.
రిపోర్టును బయట ఎవరికీ ఇవ్వలేదు..
చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టును జీజీహెచ్ వైద్య బృందం తమకు అందించిందని డీఐజీ రవికిరణ్ చెప్పారు. ఆ రిపోర్టును తాము బయట ఎవరికీ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు తరఫున వచ్చిన లాయర్లు ఇవ్వాలని అడిగితే ఆయన అనుమతి తీసుకుని, సంతకం చేయించుకుని రిపోర్టును లాయర్లకు అందజేశామని తెలిపారు.
అందులో ఒక లైనును జైలు అధికారులు బ్లాక్ మార్కర్‌తో కనిపించకుండా చేశారన్న వార్తలు పూర్తిగా అవాస్తమన్నారు. ఆ లెటర్‌పై బ్లాక్ మార్కు చేసి ఎవరు వైరల్ చేస్తున్నారో తమకు తెలియదని చెప్పారు. కాగా తమ పట్ల డీఐజీ దురుసుగా ప్రవర్తించారని లోకేశ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ములాఖత్ సమయం ముగిసిందని.. నిబంధనల ప్రకారం మీరు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని మాత్రమే చెప్పానన్నారు.
చంద్రబాబును కలిసిన లోకేశ్
చంద్రబాబును ఆయన తనయుడు నారా లోకేశ్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్‌లో కలిశారు. శనివారం మధ్యాహ్నం 40 నిమిషాల పాటు జరిగిన ములాఖత్ అనంతరం వారు జైలు నుంచి నేరుగా వారు ఉంటున్న క్యాంప్‌కు వెళ్లారు. కాగా ములాఖత్‌లో లోకేశ్ డీఐజీ రవికిరణ్‌తో వాగ్వాదానికి దిగారని సమాచారం. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును వైద్యులు సూచించిన మేరకు చల్లటి వాతావరణంలో ఎందుకు ఉంచడం లేదని నిలదీసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment