పట్టింపులేని ప్రభుత్వ భూములు | Authorities Neglect On Government Lands In vizianagaram | Sakshi
Sakshi News home page

పట్టింపులేని ప్రభుత్వ భూములు

Published Mon, Jul 1 2019 8:54 AM | Last Updated on Mon, Jul 1 2019 8:54 AM

Authorities Neglect On Government Lands In vizianagaram - Sakshi

బెలగాం సాయినగర్‌ లే అవుట్లో ఖాళీగా ఉన్న రిజర్వు ప్రభుత్వ స్థలం

సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : నగరాలు... పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలుస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి రీత్యా పల్లెలనుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రియల్‌ఎస్టేట్లలో ప్లాట్లు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ఎక్కువైంది. ఇలా వెంచర్లు వేసేవారు నిబంధనల ప్రకారం పదిశాతం స్థలాన్ని రిజర్వుసైట్‌గా కేటాయించాలి. దానిని ప్లాట్లు కొనుగోలు చేసుకున్నవారి ప్రయోజనాల కోసం అంటే పార్కులుగానీ... కమ్యూనిటీ భవనాలుగానీ... ఇంకా ఏదైనా ప్రజోపయోగానికి గానీ వినియోగించుకో వాల్సి ఉంటుంది. అయితే ఆ స్థలాలను అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేయడంతో నిరుపయోగమవుతున్నాయి. కొన్ని చోట్ల కబ్జాలూ పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది.

జిల్లా వ్యాప్తంగా స్థలాలు నిరుపయోగమే...
జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు పురపాలి కలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో చిన్న, పెద్ద లేఅవుట్లు వెలుస్తూనే ఉన్నాయి. ఇందులో జిల్లా కేంద్రం విజయనగరం విశాఖ నగరాభివృద్ధి సంస్థ(ఉడా) పరిధిలోకి వస్తుంది. ఇటీవల బుడాను ఏర్పాటు చేయడంతో కొన్ని బుడా పరిధిలోకి వచ్చి చేరాయి. వీటిలో కేటాయించిన ప్రజోపయోగ స్థలాల్లో అభివృద్ధి పనులు కూడా ఉడా, బుడా పరిధిలోకి వస్తాయి. మిగిలిన  పురపాలక సంఘాల్లో నివాస స్థలాలకు డిమాండ్‌ ఉన్నందున స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడ  అనుమతులు ఉన్న లే అవుట్లు 100 వరకు ఉండగా   అనధికార లే అవుట్లు 200 వరకు ఉన్నాయి. వీటి అన్నింటిలో ప్రజోపయోగానికి  కేటాయించిన 10శాతం స్థలాలను స్వాధీనం చేసుకొని.. అవసరమైన పనులు చేపట్టాల్సి బాధ్యత ఆయా మునిసిపాలిటీలదే. కానీ ఎక్కడా ఆ దిశగా చర్యలు కానరావడం లేదు. ఫలితంగా లక్షలు విలువ చేసే స్థలాలు పనికిరాకుండా వృథాగా పడి ఉన్నాయి. 

వినియోగానికి నోచుకోని స్థలాలు
పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో అనుమతి పొందిన లే అవుట్లు ఏడు ఉండగా, మరో ఆరు అనధికార లే అవుట్లు ఉన్నాయి. ఇందులో ఎస్‌ఎన్‌ఎం నగర్‌లో అనుమతులు పొందిన లే అవుట్‌లో కేటాయించిన స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పటి వరకు దీని అభివృద్ధికి రూ. 5లక్షలు ఖర్చు చేసినప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో వృథాగా ఉంది. సౌందర్య  సినిమాహాలు వెనుక భాగంలోని శత్రుచర్ల రియ ల్‌ ఎస్టేట్‌లో ప్రజోపయోగానికి కేటాయించిన స్థలంలో రూ.30 లక్షలతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. ఈ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. బెలగాం విశ్వవిజ్ఞాన పాఠశా ల ఎదురుగా  శత్రుచర్ల నగర్‌ శివారులో వేసిన సాయినగర్‌ లేఅవుట్‌లో ప్రజోపయోగానికి కేటాయించిన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఖాళీగా ఉంది. పట్టణంలో అమరావతి నగర్, శత్రుచర్ల నగర్లో పురపాలక సంఘానికి అప్పగించిన స్థలాలు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందడం లేదు. 

కేటాయించినా నిరుపయోగమే...
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో అధికారంగా వెలిసిన లేఅవుటు ఒక్కటే ఉండగా అక్కడ ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన స్థలం ఖాళీగా ఉంది. ఎటువంటి  అభివృద్ధి పనులు చేపట్టలేదు. జిల్లాలోనే అత్యధికంగా అనధికార లే అవుట్లు ఇక్కడ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు  పట్టణంలో స్థలాలకు విపరీతమైన గిరాకీ ఉండడంతో ఎక్కడా లే అవుట్లకు అనుమతులు పొందిన దాఖలాలు లేవు. వీటిలో ప్రజోపయోగ స్థలాల కేటాయింపు అంతంత మాత్రమే. ఇక్కడ ఇళ్లస్థలాల క్రయ విక్రయాలన్నీ అనధికారంగానే నడుస్తున్నాయనే అభిప్రాయం ఉంది. 

అభివృద్ధిపై కానరాని చిత్తశుద్ధి
సాలూరు పురపాలక పరిధిలో అనుమతులు పొందిన మూడు లేఅవుట్లు ఉన్నాయి. వీటిలో ప్రజావసరాలకు కేటాయించిన స్థలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీనివల్ల ఇక్కడ స్థలాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. ఒక చోట ఖాళీ స్థలానికి కంచె ఏర్పాటు చేశారు తప్ప ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. నెల్లిమర్ల నగర పంచాయతీలో పట్టణాభివృద్ధి అంతంత మాత్రమే. ఈ ప్రాంతంలో అనుమతులు పొందిన లే అవుట్‌ ఒకటి ఉండగా అనధికారంగా అయిదు లే అవుట్లు వెలిశాయి. ఉన్న అధికార లే అవుట్‌లో కూడా ప్రజావసరాలకు కేటాయించిన స్థలం నిరుపయోగంగా ఉంది. ఇప్పుడిప్పుడే కొత్తగా ఎన్నో లేఅవుట్‌లు వెలుస్తున్నా వారు కేటాయించే పది శాతం స్థలాలు కూడా తమ పరిధిలోకి తీసుకునే తీరిక పురపాలిక సంఘ అధికారులకు ఉండడంలేదు.

అభివృద్ధికి ప్రణాళికలు
పార్వతీపురం పట్టణంలో వెలుస్తున్న లే అవుట్లలో ప్రజావసరాలకు పదిశా తం స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నాం. పురపాలక సంఘం పరంగా ఆ స్థలాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇతర లే అవుట్లలోను ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతీ స్థలాన్ని ప్రజలకు ఉపయోగ పడేవిధంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతాం.
– పి.నల్లనయ్య, పురపాలక కమిషనర్, పార్వతీపురం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement