government land occupies
-
భోగాపురంలో బట్టబయలైన అక్రమాలు.. ‘మిరాకిల్’ భూ కబ్జాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు కానున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భూముల ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. అలాంటి చోట నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు మాధవి భర్త లోకం ప్రసాద్ 14.22 ఎకరాల ప్రభుత్వ భూములను గత సర్కారు హయాంలో ఆక్రమించారు. అవన్నీ ఇటు చెన్నై–హౌరా జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 16), విమానాశ్రయ నిర్మాణం కోసం సేకరించిన భూమికి ఆనుకుని ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం అక్కడ ఎకరా విలువ రూ.2 కోట్లకు పైమాటే! ఆక్రమించి.. ప్రహరీ కట్టేసి భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలను లోకం ప్రసాద్ ఏర్పాటు చేశారు. కాలేజీ హాస్టళ్లు, కెఫేటేరియా, సాఫ్ట్వేర్ సంస్థ భవనాలు, ఉద్యోగుల వసతి కోసం సమీపంలోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేశారు. గెడ్డలు, కాలువలతో పాటు కాలి బాటలన్నీ కలిపేసి రోడ్డు నిర్మించారు. కొన్ని కల్వర్టులను సొంతంగా కట్టుకుని భూముల చుట్టూ ప్రహరీ కట్టేసి పెద్ద గేట్లను పెట్టేశారు. కన్నెత్తి చూడని టీడీపీ సర్కారు.. ముంజేరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 293/1లో ఎకరా, 293/5లో 60 సెంట్లు, 296లో అర ఎకరా, 337లో 0.61 సెంట్లు, 343లో 3.52 ఎకరాలు, 342లో 5.02 ఎకరాలు, 391లో 1.52 ఎకరాలు, 392లో 1.16 ఎకరాలు, సర్వే నంబరు 393లో 29 సెంట్ల మేర ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు తాజాగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ పక్కనే కొంగవానిపాలెం గ్రామ రెవెన్యూ పరిధి 98/2పీ సర్వే నంబరులో 40 సెంట్ల బంజరు భూమి కూడా ‘మిరాకిల్’ ఆక్రమణలోనే ఉంది. ఈ వ్యవహారం అంతా గత టీడీపీ పాలనలో దఫాదఫాలుగా జరిగింది. గత పాలకులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల ఆ భూముల చుట్టూ మిరాకిల్ యజమానులు ప్రహరీ నిర్మించి పెద్ద గేట్లు అమర్చడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. పక్కాగా సర్వే నిర్వహించడంతో మిరాకిల్ ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డీ పట్టా భూములనూ వదల్లేదు.. మిరాకిల్ యజమానుల గుప్పిట్లో డీ పట్టా భూములు కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కంచేరు, ముంజేరు, కొంగవానిపాలెం గ్రామాల పరిధిలో మొత్తం 8.52 ఎకరాల వరకు ఉన్నట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నిజమేనంటూనే.. ఆక్రమణలు నిజమేనని లోపాయికారీగా అంగీకరించిన మిరాకిల్ యాజమాన్యం ప్రభుత్వ భూమి చేజారిపోకుండా ఎత్తుగడలు వేస్తోంది. మిరాకిల్ ఉద్యోగులను, స్థానిక జనసేన కార్యకర్తలను ఆందోళనకు పురిగొల్పుతున్నారు. ప్రభుత్వ భూముల్లో తమ సంస్థ భవనాలేవీ నిర్మించనప్పుడు ఎలా స్వాధీనం చేసుకుంటారని అడ్డగోలుగా వాదిస్తున్నారు. గెడ్డలు కప్పేసి తయారు చేసిన మైదానం యువత క్రికెట్ ఆడుకోవడానికి ఉపయోగపడుతోందంటూ రెవెన్యూ అధికారులతో వాదనకు దిగుతున్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాం.. ముంజేరు, కొంగవానిపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయి సర్వేతో పాటు డ్రోన్ సర్వే చేశాం. పక్కాగా ఆక్రమణలను గుర్తించాం. ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. స్వాధీనం చేసుకోవడానికి పోలీసు శాఖ సాయం కోరాం. అవన్నీ కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. – కోరాడ శ్రీనివాసరావు, తహసీల్దారు, భోగాపురం, విజయనగరం జిల్లా -
పట్టింపులేని ప్రభుత్వ భూములు
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : నగరాలు... పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి రీత్యా పల్లెలనుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రియల్ఎస్టేట్లలో ప్లాట్లు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ఎక్కువైంది. ఇలా వెంచర్లు వేసేవారు నిబంధనల ప్రకారం పదిశాతం స్థలాన్ని రిజర్వుసైట్‌గా కేటాయించాలి. దానిని ప్లాట్లు కొనుగోలు చేసుకున్నవారి ప్రయోజనాల కోసం అంటే పార్కులుగానీ... కమ్యూనిటీ భవనాలుగానీ... ఇంకా ఏదైనా ప్రజోపయోగానికి గానీ వినియోగించుకో వాల్సి ఉంటుంది. అయితే ఆ స్థలాలను అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేయడంతో నిరుపయోగమవుతున్నాయి. కొన్ని చోట్ల కబ్జాలూ పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. జిల్లా వ్యాప్తంగా స్థలాలు నిరుపయోగమే... జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు పురపాలి కలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో చిన్న, పెద్ద లేఅవుట్లు వెలుస్తూనే ఉన్నాయి. ఇందులో జిల్లా కేంద్రం విజయనగరం విశాఖ నగరాభివృద్ధి సంస్థ(ఉడా) పరిధిలోకి వస్తుంది. ఇటీవల బుడాను ఏర్పాటు చేయడంతో కొన్ని బుడా పరిధిలోకి వచ్చి చేరాయి. వీటిలో కేటాయించిన ప్రజోపయోగ స్థలాల్లో అభివృద్ధి పనులు కూడా ఉడా, బుడా పరిధిలోకి వస్తాయి. మిగిలిన పురపాలక సంఘాల్లో నివాస స్థలాలకు డిమాండ్ ఉన్నందున స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడ అనుమతులు ఉన్న లే అవుట్లు 100 వరకు ఉండగా అనధికార లే అవుట్లు 200 వరకు ఉన్నాయి. వీటి అన్నింటిలో ప్రజోపయోగానికి కేటాయించిన 10శాతం స్థలాలను స్వాధీనం చేసుకొని.. అవసరమైన పనులు చేపట్టాల్సి బాధ్యత ఆయా మునిసిపాలిటీలదే. కానీ ఎక్కడా ఆ దిశగా చర్యలు కానరావడం లేదు. ఫలితంగా లక్షలు విలువ చేసే స్థలాలు పనికిరాకుండా వృథాగా పడి ఉన్నాయి. వినియోగానికి నోచుకోని స్థలాలు పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో అనుమతి పొందిన లే అవుట్లు ఏడు ఉండగా, మరో ఆరు అనధికార లే అవుట్లు ఉన్నాయి. ఇందులో ఎస్ఎన్ఎం నగర్లో అనుమతులు పొందిన లే అవుట్లో కేటాయించిన స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పటి వరకు దీని అభివృద్ధికి రూ. 5లక్షలు ఖర్చు చేసినప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో వృథాగా ఉంది. సౌందర్య సినిమాహాలు వెనుక భాగంలోని శత్రుచర్ల రియ ల్ ఎస్టేట్‌లో ప్రజోపయోగానికి కేటాయించిన స్థలంలో రూ.30 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. ఈ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. బెలగాం విశ్వవిజ్ఞాన పాఠశా ల ఎదురుగా శత్రుచర్ల నగర్ శివారులో వేసిన సాయినగర్ లేఅవుట్లో ప్రజోపయోగానికి కేటాయించిన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఖాళీగా ఉంది. పట్టణంలో అమరావతి నగర్, శత్రుచర్ల నగర్లో పురపాలక సంఘానికి అప్పగించిన స్థలాలు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందడం లేదు. కేటాయించినా నిరుపయోగమే... బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో అధికారంగా వెలిసిన లేఅవుటు ఒక్కటే ఉండగా అక్కడ ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన స్థలం ఖాళీగా ఉంది. ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. జిల్లాలోనే అత్యధికంగా అనధికార లే అవుట్లు ఇక్కడ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు పట్టణంలో స్థలాలకు విపరీతమైన గిరాకీ ఉండడంతో ఎక్కడా లే అవుట్లకు అనుమతులు పొందిన దాఖలాలు లేవు. వీటిలో ప్రజోపయోగ స్థలాల కేటాయింపు అంతంత మాత్రమే. ఇక్కడ ఇళ్లస్థలాల క్రయ విక్రయాలన్నీ అనధికారంగానే నడుస్తున్నాయనే అభిప్రాయం ఉంది. అభివృద్ధిపై కానరాని చిత్తశుద్ధి సాలూరు పురపాలక పరిధిలో అనుమతులు పొందిన మూడు లేఅవుట్లు ఉన్నాయి. వీటిలో ప్రజావసరాలకు కేటాయించిన స్థలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీనివల్ల ఇక్కడ స్థలాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. ఒక చోట ఖాళీ స్థలానికి కంచె ఏర్పాటు చేశారు తప్ప ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. నెల్లిమర్ల నగర పంచాయతీలో పట్టణాభివృద్ధి అంతంత మాత్రమే. ఈ ప్రాంతంలో అనుమతులు పొందిన లే అవుట్ ఒకటి ఉండగా అనధికారంగా అయిదు లే అవుట్లు వెలిశాయి. ఉన్న అధికార లే అవుట్లో కూడా ప్రజావసరాలకు కేటాయించిన స్థలం నిరుపయోగంగా ఉంది. ఇప్పుడిప్పుడే కొత్తగా ఎన్నో లేఅవుట్లు వెలుస్తున్నా వారు కేటాయించే పది శాతం స్థలాలు కూడా తమ పరిధిలోకి తీసుకునే తీరిక పురపాలిక సంఘ అధికారులకు ఉండడంలేదు. అభివృద్ధికి ప్రణాళికలు పార్వతీపురం పట్టణంలో వెలుస్తున్న లే అవుట్లలో ప్రజావసరాలకు పదిశా తం స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నాం. పురపాలక సంఘం పరంగా ఆ స్థలాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇతర లే అవుట్లలోను ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతీ స్థలాన్ని ప్రజలకు ఉపయోగ పడేవిధంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతాం. – పి.నల్లనయ్య, పురపాలక కమిషనర్, పార్వతీపురం -
సొసైటీల మాటున స్వాహా
- సంస్థల పేరుతో మునిసిపల్ ఆస్తుల స్వాధీనం - బోర్డులు తిప్పేసి సొంత ఆస్తులుగా మార్చేసుకున్న వైనం - స్పందించని అధికార యంత్రాంగం.. కార్యాలయంలో కనిపించని దస్త్రాలు హిందూపురం అర్బన్ : హిందూపురం నడిబొడ్డున రూ.కోట్ల విలువ చేసే మునిసిపల్ స్థలాలను సంస్థల పేరిట స్వాధీనపర్చుకుని సొంత ఆస్తులుగా మార్చేసుకున్నారు. తద్వారా వచ్చే రాబడిని కాజేస్తున్నారు. ఆస్తులు ఇలా అన్యాక్రాంతం అవుతున్నా మునిసిపల్ యంత్రాంగం చేష్టలుడి చూస్తోంది. పట్టణంలోని వైఎస్సార్ పరిగి బస్టాండులో రాజీవ్‌గాంధీ మెమోరియల్ ట్రస్టు పేరిట స్మారక భవనం నిర్మాణానికి 1992 మార్చిలో సర్వే నెంబరు 68లో రూ.కోట్ల విలువ చేసే ఐదు సెంట్ల స్థలం కేటాయించారు. అందులో రాజీవ్‌గాంధీ పేరిట స్మారక భవనం నిర్మించి దానిని ప్రజాసంక్షేమానికి వినియోగించాల్సి ఉంది. కానీ అలా చేయకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. సుమారు 12కుపైగా దుకాణాలు ఏర్పాటు చేసి వారి వద్ద అడ్వాన్సులు, అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. ఈ ట్రస్టు అధికార పార్టీ నాయకుడి ఆధీనంలో ఉండటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాగే 1975 డిసెంబరులో టీఎన్ 356 ది సిండికేట్ ఫార్మర్స్ సర్వీస్ కార్పొరేషన్ సొసైటీ లిమిటెడ్ ప్రారంభించారు. దీనికి మున్సిపాల్టీ పరిధిలోని పరిగి బస్టాండులో 68/1 సర్వే నెంబరులో 1997 జూన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు నిల్వ ఉంచే గోదాముల ఏర్పాటుకు 244.4 గజాల స్థలాన్ని కేటాయించారు. అయితే 2000 సంవత్సరం తర్వాత సొసైటీ నష్టాల్లో కూరుకుపోయి మూతపడింది. మున్సిపాలిటీ ఇచ్చిన స్థలంలో షాపింగ్ రూములు కట్టి అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. రాజకీయ జోక్యంతో ఆయా సంస్థలు ఏయే లక్ష్యాలు చూపి ప్రభుత్వ స్థలాన్ని పొందుతాయో వాటి కోసం కాకుండా ఇతరత్రా పనులకు ఉపయోగిస్తే ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఆ మేరకు నిర్వీర్యమైన సంస్థలకు కేటాయించిన స్థలాలను స్వాధీనపర్చాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే రాజకీయ జోక్యంతో ఆ వ్యవహారం అంతటితో ఆగిపోయింది. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయా స్థలాలకు సంబంధించిన రికార్డులు కనిపించకుండా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం మున్సిపల్ ఖాళీ స్థలాలు, అన్యాక్రాంతమైన వాటిపై విచారణ కోసం ప్రత్యేకంగా బృందం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అలాగే రాజీవ్‌ట్రస్టు, సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ స్థలాలపైనా నోటీసులు జారీ చేస్తామని, ఆ స్థలాల పరిస్థితులపై సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు.