ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వేసిన రోడ్డు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు కానున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భూముల ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. అలాంటి చోట నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు మాధవి భర్త లోకం ప్రసాద్ 14.22 ఎకరాల ప్రభుత్వ భూములను గత సర్కారు హయాంలో ఆక్రమించారు.
అవన్నీ ఇటు చెన్నై–హౌరా జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 16), విమానాశ్రయ నిర్మాణం కోసం సేకరించిన భూమికి ఆనుకుని ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం అక్కడ ఎకరా విలువ రూ.2 కోట్లకు పైమాటే!
ఆక్రమించి.. ప్రహరీ కట్టేసి
భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలో మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలను లోకం ప్రసాద్ ఏర్పాటు చేశారు. కాలేజీ హాస్టళ్లు, కెఫేటేరియా, సాఫ్ట్‌వేర్ సంస్థ భవనాలు, ఉద్యోగుల వసతి కోసం సమీపంలోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేశారు. గెడ్డలు, కాలువలతో పాటు కాలి బాటలన్నీ కలిపేసి రోడ్డు నిర్మించారు. కొన్ని కల్వర్టులను సొంతంగా కట్టుకుని భూముల చుట్టూ ప్రహరీ కట్టేసి పెద్ద గేట్లను పెట్టేశారు.
కన్నెత్తి చూడని టీడీపీ సర్కారు..
ముంజేరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 293/1లో ఎకరా, 293/5లో 60 సెంట్లు, 296లో అర ఎకరా, 337లో 0.61 సెంట్లు, 343లో 3.52 ఎకరాలు, 342లో 5.02 ఎకరాలు, 391లో 1.52 ఎకరాలు, 392లో 1.16 ఎకరాలు, సర్వే నంబరు 393లో 29 సెంట్ల మేర ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు తాజాగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ పక్కనే కొంగవానిపాలెం గ్రామ రెవెన్యూ పరిధి 98/2పీ సర్వే నంబరులో 40 సెంట్ల బంజరు భూమి కూడా ‘మిరాకిల్’ ఆక్రమణలోనే ఉంది.
ఈ వ్యవహారం అంతా గత టీడీపీ పాలనలో దఫాదఫాలుగా జరిగింది. గత పాలకులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల ఆ భూముల చుట్టూ మిరాకిల్ యజమానులు ప్రహరీ నిర్మించి పెద్ద గేట్లు అమర్చడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. పక్కాగా సర్వే నిర్వహించడంతో మిరాకిల్ ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
డీ పట్టా భూములనూ వదల్లేదు..
మిరాకిల్ యజమానుల గుప్పిట్లో డీ పట్టా భూములు కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కంచేరు, ముంజేరు, కొంగవానిపాలెం గ్రామాల పరిధిలో మొత్తం 8.52 ఎకరాల వరకు ఉన్నట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
నిజమేనంటూనే..
ఆక్రమణలు నిజమేనని లోపాయికారీగా అంగీకరించిన మిరాకిల్ యాజమాన్యం ప్రభుత్వ భూమి చేజారిపోకుండా ఎత్తుగడలు వేస్తోంది. మిరాకిల్ ఉద్యోగులను, స్థానిక జనసేన కార్యకర్తలను ఆందోళనకు పురిగొల్పుతున్నారు. ప్రభుత్వ భూముల్లో తమ సంస్థ భవనాలేవీ నిర్మించనప్పుడు ఎలా స్వాధీనం చేసుకుంటారని అడ్డగోలుగా వాదిస్తున్నారు. గెడ్డలు కప్పేసి తయారు చేసిన మైదానం యువత క్రికెట్ ఆడుకోవడానికి ఉపయోగపడుతోందంటూ రెవెన్యూ అధికారులతో వాదనకు దిగుతున్నారు.
ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాం..
ముంజేరు, కొంగవానిపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయి సర్వేతో పాటు డ్రోన్ సర్వే చేశాం. పక్కాగా ఆక్రమణలను గుర్తించాం. ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. స్వాధీనం చేసుకోవడానికి పోలీసు శాఖ సాయం కోరాం. అవన్నీ కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం.
– కోరాడ శ్రీనివాసరావు, తహసీల్దారు, భోగాపురం, విజయనగరం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment