ముండ్లమూరు : కోర్టులో కేసులు ఉన్న వారు మెగా లోక్‌అదాలత్‌ను వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎస్పీ శ్రీకాంత్ కోరారు. సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం స్థానిక పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీన అన్ని జిల్లాల్లో మెగా లోక్‌అదాలత్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 1400 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని, ఆ కేసుల్లోని ఇరువర్గాల వారు లోక్‌ఆదాలత్‌కు హాజరై ఒకరికొకరు అవగాహనకు వస్తే రాజీ చేసి కేసు మూసేస్తారని ఎస్పీ తెలిపారు.
దొంగతనాలు అరికడతాం
ఇటీవల జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా కేసులను ఛేదిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఒంగోలులో 26 సవర్ల బంగారం చోరీకి గురైంద న్న బాధితుని ఫిర్యాదుపై సందేహాలు ఉన్నాయన్నారు. అందుకే ఆ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే దాన్ని ఛేదిస్తామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌కు సుమారు 3.50 ఎకరాల స్థలం ఉందని, సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించవచ్చు కదా.. అని విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అదుపులో శాంతిభద్రతలు
ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతలు ఆదుపులో ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి తమ దృష్టికి వస్తే తక్షణమే పరిస్థితులను అదుపులోకి తెస్తున్నామన్నారు. జిల్లాలో మూడు పోలీసుస్టేషన్లకు ఎస్సైలు లేరని ఆయన దృష్టికి తీసుకురాగా అక్కడ సాధ్యమైనంత త్వరలో ఎస్‌హెచ్‌ఓలను నియమిస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రం దర్శిలో ఎస్సై లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలపగా ఇక్కడి ఎస్సై టాస్క్‌ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ చెప్పారు.
బదిలీలు ఇప్పట్లో లేనట్లే
జిల్లాలో అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించి ప్రస్తుతం బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్సైలకు సంబంధించిన బదిలీలు ఎప్పుడు ఉంటాయని ఎస్పీని విలేకరులు ప్రశ్నించారు. ఇప్పట్లో ఎస్సైలకు బదిలీలు జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఒకటి రెండు స్టేషన్లలో బదిలు జరిగితే జరగవచ్చని ఎస్పీ వివరించారు.
లోక్‌అదాలత్‌ను వినియోగించుకోండి
Published Thu, Nov 27 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement
Advertisement