Mega Lok Adalat
-
లోక్‌అదాలత్‌లో 3.16 లక్షల కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన మెగా లోక్‌అదాలత్‌లో 3,16,558 కేసులు పరిష్కరించి బాధితులకు రూ.118 కోట్లు పరిహారంగా అందించారు. ఇందులో 1,895 సివిల్ కేసులు, 2,95,501 లక్షల క్రిమినల్ కేసులు, 19,162 విచారణ దశలో ఉన్న (ప్రీలిటిగేషన్) కేసులున్నాయి. అదాలత్‌లో 1,20,451 కేసులను పరిష్కరించి రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 68,147 కేసులను పరిష్కరించి హైదరాబాద్ జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. హైకోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 454 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.8.5 కోట్లు పరిహారం అందించారు. ఇందులో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన కేసులు అత్యధికంగా సెటిలైనట్లు లీగల్ ఆఫీసర్లు రాజేశ్, మహమ్మద్ షబ్బీర్ తెలిపారు. సిటీ సివిల్ కోర్టులో 713 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.28 కోట్లు పరిహారం అందించినట్లు అథారిటీ చైర్మన్ రేణుక, కార్యదర్శి మురళీమోహన్ వెల్లడించారు. -
11న మెగా లోక్‌అదాలత్
సాక్షి, హైదరాబాద్: జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 11న(శనివారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో మెగా లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాజీ ద్వారా పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించింది. అదాలత్ తీర్పునకు అప్పీల్ ఉండదని వివరించింది. అదాలత్‌లో కేసులను పరిష్కరించుకుంటే సివిల్ కేసుల్లో చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. -
లోక్‌అదాలత్‌ను వినియోగించుకోండి
ముండ్లమూరు : కోర్టులో కేసులు ఉన్న వారు మెగా లోక్‌అదాలత్‌ను వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎస్పీ శ్రీకాంత్ కోరారు. సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం స్థానిక పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీన అన్ని జిల్లాల్లో మెగా లోక్‌అదాలత్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 1400 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని, ఆ కేసుల్లోని ఇరువర్గాల వారు లోక్‌ఆదాలత్‌కు హాజరై ఒకరికొకరు అవగాహనకు వస్తే రాజీ చేసి కేసు మూసేస్తారని ఎస్పీ తెలిపారు. దొంగతనాలు అరికడతాం ఇటీవల జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా కేసులను ఛేదిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఒంగోలులో 26 సవర్ల బంగారం చోరీకి గురైంద న్న బాధితుని ఫిర్యాదుపై సందేహాలు ఉన్నాయన్నారు. అందుకే ఆ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే దాన్ని ఛేదిస్తామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌కు సుమారు 3.50 ఎకరాల స్థలం ఉందని, సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించవచ్చు కదా.. అని విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదుపులో శాంతిభద్రతలు ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతలు ఆదుపులో ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి తమ దృష్టికి వస్తే తక్షణమే పరిస్థితులను అదుపులోకి తెస్తున్నామన్నారు. జిల్లాలో మూడు పోలీసుస్టేషన్లకు ఎస్సైలు లేరని ఆయన దృష్టికి తీసుకురాగా అక్కడ సాధ్యమైనంత త్వరలో ఎస్హెచ్ఓలను నియమిస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రం దర్శిలో ఎస్సై లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలపగా ఇక్కడి ఎస్సై టాస్క్‌ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ చెప్పారు. బదిలీలు ఇప్పట్లో లేనట్లే జిల్లాలో అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించి ప్రస్తుతం బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్సైలకు సంబంధించిన బదిలీలు ఎప్పుడు ఉంటాయని ఎస్పీని విలేకరులు ప్రశ్నించారు. ఇప్పట్లో ఎస్సైలకు బదిలీలు జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఒకటి రెండు స్టేషన్లలో బదిలు జరిగితే జరగవచ్చని ఎస్పీ వివరించారు. -
డిసెంబర్ 6 తేదిన మెగా లోక్ అదాలత్!
హైదరాబాద్: లోక్ అదాలత్ లో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహరెడ్డి అన్నారు. మెగా లోక్ అదాలత్ పై జస్టిస్ నరసింహరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 6 తేదిన లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. సివిల్ కేసులను కూడా లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. కేసుల సంఖ్యను బట్టి అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ ఉంటుందని ఆయన తెలిపారు. గత ఏడాది నిర్వహించిన లోక్ అదాలత్ లో 1.11 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయని జస్టిస్ నర్సింహరెడ్డి తెలిపారు. ఎఫ్ఐఆర్ దశలో ఉన్న కేసులను మెగా లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. ఏపీలో 10 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని జస్టిస్ నర్సింహరెడ్డి వెల్లడించారు. -
జిల్లా వ్యాప్తంగా నేడు మెగా లోక్ అదాలత్
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా శనివారం మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ తెలిపారు. స్థానిక న్యాయసేవా సదన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, జోగిపేట, నర్సాపూర్, జహీరాబాద్ కోర్టుల్లో న్యాయసేవా సంస్థ జిల్లా చైర్మన్ మాధవరావు ఆదేశాల మేరకు మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రిమినల్, సివిల్, ఫ్యామిలీ, మోటార్ యాక్సిడెంటల్ సంబంధించిన కేసులను పరిష్కరించనున్నట్టు వివరించారు. వివిధ కేసుల్లో నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరుగకుండా సత్వర న్యాయం కోసం న్యాయసేవా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. లోక్ అదాలత్‌లో వివిధ కంపెనీలకు, బ్యాంకులకు సంబంధించి యజమానులు, న్యాయవాదులు పాల్గొంటారని, కక్షిదారుల అంగీకారం మేరకు నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారు సైతం పాల్గొనవచ్చని, వారికి వడ్డీ మాఫీ చేయించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందడమేగాక డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా లోక్ అదాలత్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కాగా గత నవంబర్ నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 5800 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. -
మెగా లోక్‌అదాలత్ సాక్షరత రథయాత్ర ప్రారంభం
రాయచూరు, న్యూస్‌లైన్ : నగరంలో మెగా లోక్ అదాలత్ న్యాయసేవా సాక్షరత రథయాత్రను ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ ప్రాధికారం అధ్యక్షుడు,జిల్లా జడ్జి పీ.కృష్ణభట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడికక్కడే తమ కేసులను పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా లోక్ అదాలత్ జరుగుతోందన్నారు. న్యాయమూర్తులు, సిబ్బంది కొరత కారణంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో కేసులు పరిష్కారానికి నోచుకోవడం హర్షనీయమన్నారు. జిల్లాలో 35 శాతం ప్రజలు వెనుకబడిన వర్గాలకు చెందిన వారేనని, నిరుపేదలైన వీరికి చట్టంపై అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. న్యాయం, చట్ట పరిజ్ఞానాన్ని అందించేందుకు ఈజాతాను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే లింగసూగూరు, దేవదుర్గలలో అభియాన్ పూర్తయింది. ప్రస్తుతం రాయచూరులో ప్రారంభమైందని, జిల్లాలో 15 రోజుల పాటు అభియాన్ కొనసాగుతుందన్నారు. చట్ట పరిజ్ఞానం ఉంటే వివిధ సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అస్కిహాళ్, గోనాళ్, యక్లాసపూర్లో ఆదివారం రథయాత్ర జరిగింది. జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సతీష్‌సింగ్, న్యాయమూర్తి మహ్మద్ ముజాయిద్ ఉల్లా, అదనపు న్యాయమూర్తి సత్యనారాయణచార్, ప్రభుత్వ న్యాయవాది రాఘవేంద్ర, జిల్లా న్యాయాధీశుల సంఘం అధ్యక్ష, కార్యధ్యక్షులు భానుజ్, ప్రభుదేవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.