Mundlamuru
-
బాలుడి అదృశ్యంపై అనుమానాలు
సాక్షి, ముండ్లమూరు (ప్రకాశం): మండలంలోని రెడ్డినగర్ గ్రామానికి చెందిన రెండేళ్ల మేడగం అరుష్‌రెడ్డి అదృశ్యమై 50 గంటలు గడిచినా ఇంకా ఆచూకీ దొరకలేదు. బాలుడి తండ్రి అశోక్‌రెడ్డి గ్రామంలో చిరు వ్యాపారం చేసుకుంటూ తనకు ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అశోక్‌రెడ్డి మృదుస్వభావని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అశోక్‌రెడ్డి తండ్రి వెంకటేశ్వరరెడ్డి ఏడాదిన్నర క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి చిరువ్యాపారం ప్రారంభించాడు. అరుష్‌రెడ్డి తల్లిదండ్రులు మేడగం అశోక్‌రెడ్డి, జ్యోతిలు ఎవరిపై ఎటువంటి అనుమానం లేదని చెప్పడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. బాలుడి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి కుమారుడు కనిపించకుండా పోవడంతో ఎవరైనా మాటు వేసి బాలుడిని అపహరించుకెళ్లారా అనే అనుమానం కలుగుతోంది. తెలిసిన వారే కిడ్నాప్ చేశారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. గ్రామంతో పరిచయం లేని వారు అయితే అంత తక్కువ సమయంలో బాలుడిని గ్రామం దాటించడం చాలాకష్టంతో కూడిన పని. దీనిని బట్టి గ్రామానికి చెందిన వ్యక్తుల ప్రమేయంతోనే బాలుడు గ్రామం దాటి వెళ్లి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త వ్యక్తి అయితే బాలుడు కేకలు వేస్తాడని, తెలిసన వారే గ్రామం దాటించే అవకాశం ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క డాగ్ స్క్వాడ్ ద్వారా గ్రామం అంతా జల్లెడ పట్టినా ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. బాలుడి ఆచూకీ కనుగొనడం పోలీసులకు భారంగా మారింది. రెడ్డినగర్‌కు చెందిన ఎక్కువ కుటుంబాల వారు కనిగిరి ప్రాంతం నుంచి వలస వచ్చిన వారే. అదృశ్యమైన బాలుడి తల్లి జ్యోతి స్వగ్రామం గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం నర్సింగ్‌పాడు. ఆ గ్రామస్తులు కూడా కనిగిరి ప్రాంతానికి చెందిన వారే కావడంతో రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. బాలుడి తల్లిదండ్రులను బెదిరించేందుకు లేదా వారికి తెలియకుండా ఏమైనా కక్షలు పెంచుకున్న వారు కిడ్నాప్‌నకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు మరోవైపు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే గతంలో మండలంలోని వేముల గ్రామంలో బాలుడు అదృశ్యమైన కేసులో గుంటూరు జిల్లాకు చెందిన వారి ప్రమేయం ఏమైనా ఉందనే చర్చ గ్రామాల్లో జరుగుతోంది. అప్పట్లో చిత్తు కాగితాలు ఏరుకునే వారిని ఆ కేసులో పోలీసులు నిందితులుగా గుర్తించారు. దీని ఆధారంగా పలు అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. అదృశ్యమైన బాలుడు క్షేమంగా ఇంటికి చేరాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. -
ప్రియుని ఇంటి ముందు మౌన దీక్ష
ప్రకాశం, ముండ్లమూరు: మండలంలోని ఈదర పంచాయతీ పరిధిలోని అయోధ్యనగర్‌లో ప్రియుని ఇంటి ముందు ప్రియురాలు మౌన దీక్ష చేపట్టింది. హైదరాబాద్ బోరుబండకు చెందిన తోట రేణుక గ్రామానికి చెందిన నారు నాగ శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు మంగళవారం దీక్ష చేపట్టింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శివనాంచారయ్య సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని రేణుకను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా రేణుక మాట్లాడుతూ తనతో రెండేళ్లుగా పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో నాగ శ్రీని వాసరెడ్డి మోసం చేశాడని తెలిపింది. 15 రోజులుగా కనిపించకుండా పోవడంతో వెతుక్కుంటూ అయోధ్యనగర్ వచ్చానని చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో తనని మోసం చేసినట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. దీంతో ఎస్ఐ శివనాంచారయ్య ఎస్ఆర్నగర్ ఎస్ఐతో ఫోన్లో మాట్లాడారు. రేణుకతో ఫోన్ మాట్లాడించగా తనకి న్యాయం చేస్తానని ఎస్ఆర్నగర్ ఎస్ఐ ఫోన్లో సర్ది చెప్పడంతో అక్కడి నుంచి దీక్ష విరమించింది. -
పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందని..
ముండ్లమూరు : వేధిస్తున్నాడంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెందిన భర్త.. పోలీసుస్టేషన్‌కు సమీపంలో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానిక పోలీసుస్టేషన్‌కు సమీపంలో సోమవారం జరిగింది. ఏఎస్ఐ కథనం ప్రకారం.. మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ శ్రీనివాసనగర్‌కు చెందిన అతిరాసి ప్రసాద్, సుగుణ భార్యాభర్తలు. భార్యపై అనుమానంతో ఈ నెల 6వ తేదీన భర్త చేయి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భర్త వేధిస్తున్నాడంటూ సుగుణ ఆ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుస్టేషన్‌కు రావాలని పోలీసులు ప్రసాద్‌కు శనివారం కబురు పంపారు. ప్రసాద్ స్టేషన్‌కు వచ్చాడు. ఎస్ఐ బాలరంగయ్య విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ వెళ్లి ఉన్నారు. అదే రోజు సాయంత్రం ప్రసాద్‌ను ఇంటికి పంపారు. సోమవారం ఉదయం ప్రసాద్ పోలీసుస్టేషన్‌కు రాగా ఎస్ఐ, ఏఎస్ఐ ఇద్దరూ లేరు. వారు వచ్చాక రమ్మని కానిస్టేబుళ్లు మళ్లీ చెప్పారు. దీంతో ప్రసాద్ పోలీసుస్టేషన్ బయటకు వెళ్లి భార్య తనను పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పుతోందని మనస్తాపం చెంది బ్లేడుతో గొంతు కోసుకుంటున్నాడు. అటు వైపు వెళ్తున్న దళిత నేత పాలెపోగు డగ్లస్ గమనించి తప్పించే ప్రయత్నం చేశాడు. ఆయన కేకలకు కానిస్టేబుళ్లు కూడా బయటకు వచ్చి ప్రసాద్‌ను రక్షించారు. అప్పటికే కొంతమేర గొంతు తెగడంతో రక్తం కారుతోంది. క్షతగాత్రుడిని వెంటనే అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. -
లోక్‌అదాలత్‌ను వినియోగించుకోండి
ముండ్లమూరు : కోర్టులో కేసులు ఉన్న వారు మెగా లోక్‌అదాలత్‌ను వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎస్పీ శ్రీకాంత్ కోరారు. సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం స్థానిక పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీన అన్ని జిల్లాల్లో మెగా లోక్‌అదాలత్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 1400 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని, ఆ కేసుల్లోని ఇరువర్గాల వారు లోక్‌ఆదాలత్‌కు హాజరై ఒకరికొకరు అవగాహనకు వస్తే రాజీ చేసి కేసు మూసేస్తారని ఎస్పీ తెలిపారు. దొంగతనాలు అరికడతాం ఇటీవల జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా కేసులను ఛేదిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఒంగోలులో 26 సవర్ల బంగారం చోరీకి గురైంద న్న బాధితుని ఫిర్యాదుపై సందేహాలు ఉన్నాయన్నారు. అందుకే ఆ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే దాన్ని ఛేదిస్తామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌కు సుమారు 3.50 ఎకరాల స్థలం ఉందని, సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించవచ్చు కదా.. అని విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదుపులో శాంతిభద్రతలు ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతలు ఆదుపులో ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి తమ దృష్టికి వస్తే తక్షణమే పరిస్థితులను అదుపులోకి తెస్తున్నామన్నారు. జిల్లాలో మూడు పోలీసుస్టేషన్లకు ఎస్సైలు లేరని ఆయన దృష్టికి తీసుకురాగా అక్కడ సాధ్యమైనంత త్వరలో ఎస్హెచ్ఓలను నియమిస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రం దర్శిలో ఎస్సై లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలపగా ఇక్కడి ఎస్సై టాస్క్‌ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ చెప్పారు. బదిలీలు ఇప్పట్లో లేనట్లే జిల్లాలో అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించి ప్రస్తుతం బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్సైలకు సంబంధించిన బదిలీలు ఎప్పుడు ఉంటాయని ఎస్పీని విలేకరులు ప్రశ్నించారు. ఇప్పట్లో ఎస్సైలకు బదిలీలు జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఒకటి రెండు స్టేషన్లలో బదిలు జరిగితే జరగవచ్చని ఎస్పీ వివరించారు.