పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందని..
ముండ్లమూరు : వేధిస్తున్నాడంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెందిన భర్త.. పోలీసుస్టేషన్‌కు సమీపంలో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానిక పోలీసుస్టేషన్‌కు సమీపంలో సోమవారం జరిగింది. ఏఎస్‌ఐ కథనం ప్రకారం.. మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ శ్రీనివాసనగర్‌కు చెందిన అతిరాసి ప్రసాద్, సుగుణ భార్యాభర్తలు. భార్యపై అనుమానంతో ఈ నెల 6వ తేదీన భర్త చేయి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భర్త వేధిస్తున్నాడంటూ సుగుణ ఆ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుస్టేషన్‌కు రావాలని పోలీసులు ప్రసాద్‌కు శనివారం కబురు పంపారు. ప్రసాద్ స్టేషన్‌కు వచ్చాడు. ఎస్‌ఐ బాలరంగయ్య విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ వెళ్లి ఉన్నారు. అదే రోజు సాయంత్రం ప్రసాద్‌ను ఇంటికి పంపారు.
సోమవారం ఉదయం ప్రసాద్ పోలీసుస్టేషన్‌కు రాగా ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఇద్దరూ లేరు. వారు వచ్చాక రమ్మని కానిస్టేబుళ్లు మళ్లీ చెప్పారు. దీంతో ప్రసాద్ పోలీసుస్టేషన్ బయటకు వెళ్లి భార్య తనను పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పుతోందని మనస్తాపం చెంది బ్లేడుతో గొంతు కోసుకుంటున్నాడు. అటు వైపు వెళ్తున్న దళిత నేత పాలెపోగు డగ్లస్ గమనించి తప్పించే ప్రయత్నం చేశాడు. ఆయన కేకలకు కానిస్టేబుళ్లు కూడా బయటకు వచ్చి ప్రసాద్‌ను రక్షించారు. అప్పటికే కొంతమేర గొంతు తెగడంతో రక్తం కారుతోంది. క్షతగాత్రుడిని వెంటనే అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.