
ఏలూరులో వృద్ధురాలి దారుణ హత్య
కిరాతకానికి ఒడిగట్టిన యువకుడు
ముఖంపై తీవ్రంగా దాడి..అక్కడికక్కడే అవ్వ మృతి
ఆపై చేతులు, కాళ్లను కట్టేసి..నోట్లో గుడ్డలు కుక్కి, పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వంలో ఒంటరి వృద్ధులకూ రక్షణ కరువైంది. ఎవరిని ఏం చేసినా పట్టించుకునే వారే లేకపోవడంతో అరాచకశక్తులు పేట్రేగిపోతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏలూరు వన్‌టౌన్ సత్యనారాయణపేటకు చెందిన చానాపతి రమణమ్మ (65) అనే ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ప్రసాద్ అనే యువకుడు ఆమె వద్ద డబ్బు ఉందని తెలుసుకుని 7.30 గంటల సమయంలో గొడవ పడ్డాడు. 9.30 గంటలకు మరోసారి వెళ్లి గొడవకు దిగాడు. ఆమె ముఖంపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మెడలోని బంగారు గొలుసు, బీరువాలోని కొంత నగదు తీసుకుని పరారయ్యాడు.
తానే చంపానన్న అనుమానం వస్తుందని భావించి అర్ధరాత్రి ఆమె ఇంటికి మళ్లీ వచ్చాడు. ఆమె చేతులు, కాళ్లను కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి, వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఆమె ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావటంతో స్థానికులు వెళ్లి చూడగా విషయం వెలుగు చూసింది. పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ బృందంతో రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.