కీలక సాక్ష్యం.. ‘మరణవాంగ్మూలం’ | Dying Declaration Is Crutious For Judgemnent | Sakshi
Sakshi News home page

కీలక సాక్ష్యం.. ‘మరణవాంగ్మూలం’

Published Sun, Aug 4 2019 7:54 AM | Last Updated on Sun, Aug 4 2019 7:54 AM

Dying Declaration Is Crutious For Judgemnent  - Sakshi

సాక్షి, జాగిత్యాల : రమ్యపై ఆమె భర్తకు అనుమానం. ఆమె ప్రవర్తన విషయమై ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రమ్య భరించలేకపోయింది. ఒకరోజు కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుంది. భర్త ఆసుపత్రికి తరలించాడు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నప్పటికీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వెంటనే కోర్టు మెజిస్ట్రేట్‌ వచ్చి బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అసలు ఎవరు ఏమి చేస్తున్నారో, ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది’. ఈ నేపథ్యంలో బాధితుల మరణవాంగ్మూలం, పోలీసుల విచారణ తదితర విషయాల గురించి జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది ఎస్‌.పవన్‌కుమార్‌(9440128938) వివరించారు.

చావు ప్రశ్నార్థకమైనప్పుడు..
వ్యక్తి చావు ప్రశ్నార్థకమైనప్పుడు, మరణించే వ్యక్తి తన చావుకు గల కారణాన్ని, ఆ చావుకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకునేందుకు మెజిస్ట్రేట్‌ బాధితుల నుంచి నమోదు చేసే స్టేట్‌మెంట్‌ను మరణ వాంగ్మూలంగా పిలుస్తారు. జరిగిన నేరానికి బాధితుడు ఒక్కడే సాక్షి. ఆ సాక్షి చెప్పేదే బలమైన సాక్ష్యం అయి ఉండవచ్చు.

అతడి స్టేట్‌మెంట్‌ను తీసుకోకుంటే బాధితుడికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడు.. చావుకు దగ్గరైన వ్యక్తి నిజం చెబుతాడని, ఆ సమయంలో అబద్ధం చెప్పడని, చెప్పడానికి సదరు వ్యక్తి మనస్సు అంగీకరించదని చట్టం భావిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మరణ వాంగ్మూలాన్ని కోర్టు ప్రధాన సాక్ష్యంగా తీసుకుంటుంది. 

పోలీసులు ఏం చేస్తారంటే..
ఏవరైనా వ్యక్తి తీవ్రగాయాలతో సీరియస్‌గా ఉన్న పరిస్థితుల్లో, ఆ వ్యక్తి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేయాలి. మరణ వాంగ్మూలం నమోదు చేసేందుకు ముందుగా మెజిస్ట్రేట్‌కు తెలియజేయాలి. ఇందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. అయితే గాయాలైన వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండి, మెజిస్ట్రేట్‌ వచ్చేంత వరకు కూడా బతకలేని పక్షంలోనే, చికిత్స అందిస్తున్న డాక్టర్‌ను మరణ వాంగ్మూలం నమోదు చేయాలని కోరే హక్కు పోలీసులకు ఉంటుంది.

అంతేకాకుండా ఆ వ్యక్తి పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉండి, ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేని పరిస్థితులు ఉన్నప్పుడు, పోలీస్‌ అధికారే మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయాలి. పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేసేటప్పుడు ఒక్కరిద్దరు సాక్షులు తప్పనిసరిగా ఉండాలి. సాధ్యమైనంత వరకు పోలీసులు మరణ వాంగ్మూలం నమోదు చేయకుండా ఉండటం బెటర్‌. అన్నింటికంటే ముఖ్యంగా కోర్టు మెజిస్ట్రేట్‌ చేత మరణ వాంగ్మూలం నమోదు చేయిస్తే విలువ ఎక్కువగా ఉంటుంది. ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏవరు మరణ వాంగ్మూలాన్ని నమోదు చేశారనే విషయాలను కేసు డైరీలో రాయాల్సి ఉంటుంది.

రవాణా సౌకర్యం కల్పించాల్సిందే..
మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ప్రత్యేక పద్ధతంటూ చట్టంలో ఎక్కడా లేదు. కానీ మరణ వాంగ్మూలానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. పోలీసుల నుంచి అధికారిక సమాచారం రాగానే కోర్టు మెజిస్ట్రేట్‌ సైతం వాంగ్మూలం తీసుకోవాల్సిన వ్యక్తి దగ్గరకు బయలుదేరుతాడు. బాధితుడి దగ్గరకు వెళ్లగానే మెజిస్ట్రేట్‌ పోలీసులు పేర్కొంటున్న బాధితుడు ఇతడేనా..వంటి వివరాలు చూసుకుంటారు.

బాధితుడికి తాను జడ్జినని చెప్పి, అతడు వాంగ్మూలం ఇచ్చే స్థితిలో ఉన్నాడా లేడా అనే విషయాలు తెలుసుకున్న తర్వాత వాంగ్మూలం రాస్తుంటారు. కేసు పరిశోధనలో మరణ వాంగ్మూలానికి అత్యంత విలువ ఉంటుంది కాబట్టి వాంగ్మూలం తీసుకునేందుకు వచ్చే మెజిస్ట్రేట్‌లకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉం దని హైకోర్టు 1993లో ఉత్తర్వులు జారీ చేసింది.

ఎలా నమోదు చేస్తారంటే..
వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి సృహలో ఉన్నాడా, లేడా తను అడిగే ప్రశ్నలను అర్థం చేసుకొని జవాబు చెప్పే పరిస్థితిలో ఉన్నాడా లేడా అని మొదట మెజిస్ట్రేట్‌ గమనిస్తుంటారు. అతడు అలా లేడని అనిపించినప్పుడు ఎలాంటి స్టేట్‌మెంట్‌ను నమోదు చేయకుండా, అతడు సృహలో లేడనే విషయాన్ని నోట్‌ చేసి ముగిస్తుంటారు. అతడు సృహలో ఉన్నాడని మెజిస్ట్రేట్‌ తృప్తిపడితే, బాధితుడు సందర్భశుద్ధిగా మాట్లాడగలడా లేదా, మానసికస్థితి సరిగా ఉందా లేదనే విషయాలను పసిగడుతారు.

ఇలా అన్ని విషయాలపై సంతృప్తి చెందిన తర్వాత, సంఘటన ఎలా జరిగింది, కారణం ఎవ్వరు వంటి ప్రశ్నలను అడుగుతూ మెజిస్ట్రేట్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారు. వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు డాక్టర్లు తప్పనిసరిగా అక్కడే ఉండాలి. అలాగే వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి సరైన మానసికస్థితిలో ఉన్నట్లు డాక్టర్ల నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

సంతకం చేయలేక పోతే వేలి ముద్రలు..
స్టేట్‌మెంట్‌ పూర్తైన తర్వాత, ఆ స్టేట్‌మెంట్‌లోని విషయాలను, స్టేట్‌మెంట్‌ ఇచ్చిన వ్యక్తికి తెలియజేసి అతడి సంతకాన్ని తీసుకోవాలి. బాధితుడు సంతకం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అతడి వేలిముద్రలను స్టేట్‌మెంట్‌ చివర తీసుకోవాలి. గాయపడిన వ్యక్తి సృహాలో ఉన్నప్పటికీ సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఆయనకు చిన్నచిన్న ప్రశ్నలు వేసి, ఆ ప్రశ్నలకు ఆయనిచ్చే గుర్తులు, సంజ్ఞల ద్వారా వాంగ్మూలం నమోదు చేయాలి. ముఖ్యంగా స్టేట్‌మెంట్‌ నమోదు చేసే సమయంలో బాధితుల బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులను దగ్గర ఉండనివ్వరు. మరణ వాంగ్మూలం నమోదు ప్రారంభించిన, ముగింపు సమయాన్ని స్టేట్‌మెంట్‌పై తప్పనిసరిగా వేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement