
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రతినిధులపై నమోదైన పలు కేసులు నేడు కోర్టు ముందుకు విచారణకు వచ్చాయి. వేర్వేరు కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కోర్టుకు హాజరయ్యారు. అయితే వీరిలో బండి సంజయ్‌కు ఊరట లభించగా, మంత్రి మల్లారెడ్డి, దానం నాగేందర్‌లు మరో వాయిదాకు హాజరుకాక తప్పదు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్‌పై కరీంనగర్‌లో నమోదైన మూడు కేసులను కోర్టు కొట్టి వేయగా, తన కేసును కూడా కొట్టివేయాలంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో మంత్రి మల్లారెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 11న మంత్రి మల్లారెడ్డి కచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.