కొలిక్కిరాని గురుకుల బదిలీలు! | Court cases in SC Gurukula Society: Telangana | Sakshi
Sakshi News home page

కొలిక్కిరాని గురుకుల బదిలీలు!

Published Mon, Jul 29 2024 5:33 AM | Last Updated on Mon, Jul 29 2024 6:47 AM

Court cases in SC Gurukula Society: Telangana

ప్రక్రియ దాదాపు పూర్తయినా పెండింగ్‌లోనే పోస్టింగ్‌లు 

ఎస్సీ గురుకుల సొసైటీలో కోర్టు కేసులు, ఇతర సమస్యలతో పెండింగ్‌ 

మైనార్టీ సొసైటీలో అడ్డగోలు కేటాయింపులపై టీచర్ల ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఎటూ తేలకపోతుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో గందరగోళం నెలకొంది. అత్యధికంగా రెగ్యులర్‌ టీచర్లున్న ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో టీచర్‌ పదోన్నతుల ప్రక్రియను నిర్వహిస్తూనే.. సమాంతరంగా బదిలీలనూ చేపట్టారు. కానీ కొన్ని గురుకుల పాఠశాలల్లో శాంక్షన్డ్‌ పోస్టులు, వర్కింగ్‌ కేటగిరీ సరితూగక పోవడంతో సొసైటీ అధికారులు.. పాఠశాలల వారీగా పోస్టుల మంజూరు లెక్కలను పరిశీలించారు.

ఈ సొసైటీ పరిధిలో జీఓ 317 కింద చేసిన కేటాయింపులు కూడా పొంతన లేకుండా ఉన్నాయని గుర్తించి.. ఆ మేరకు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులను డిస్‌లొకేట్‌ చేస్తూ కొత్త చోట్ల నియమించారు. ఆ ఉద్యోగులు, బదిలీల ప్రక్రియలో నిబంధనలు పాటించలేదంటూ మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. అప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ చాలావరకు పూర్తయినా.. కోర్టు స్టే నేపథ్యంలో పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపేశారు. ఉద్యోగులంతా పాతస్థానాల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ఈనెలాఖరుతో ముగుస్తుంది. తర్వాత నిషేధం అమలవుతుంది. ఆలోపు పోస్టింగ్‌ ఉత్తర్వులు వస్తాయా? లేదా? అని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మైనార్టీ గురుకుల పరిధిలో.. 
తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌) పరిధిలో కేటాయింపులపై ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి మైనార్టీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల సంఖ్య తక్కువే. అన్నీ కొత్త గురుకులాలు కావడం, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులంతా కొత్తవారే కావడంతో సులువుగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని భావించారు. కానీ అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడం, నిబంధనలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రక్రియ గందరగోళంగా మారింది.

బదిలీల ప్రక్రియలో తప్పులు కూడా ఇబ్బందిగా మారా యి. కొన్ని గురుకుల పాఠశాలల్లో ఒక సబ్జెక్టుకు సంబంధించి రెండు పోస్టులు మాత్రమే ఉంటే అక్కడ అదే సబ్జెక్ట్‌ వారు ముగ్గురికి పోస్టింగ్‌ ఇచ్చారు. మరికొందరికి ఎంచుకున్న ఆప్షన్‌కు బదులు ఇతర చోట పోస్టింగ్‌ ఇవ్వడం వంటివీ చోటు చేసుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement