
సాక్షి,విశాఖపట్నం: విశాఖ ఆర్టీవో కార్యాలయంలో దసరా,దీపావళి దందాకు తెరతీశారు. రెండు నెలల నుంచి వేల సంఖ్యలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ రిజిస్ట్రేషన్లను అధికారులు పెండింగ్ పెట్టారు. ఉద్దేశ్య పూర్వకంగానే రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ అధికారులు పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.
రిజిస్ట్రేషన్‌ల పెండింగ్‌కు ఏదో ఒక సాకు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఒకటికి పది సార్లు తిప్పించుకుంటున్నారు.రిజిస్ట్రేషన్ జరగాలంటే 500 నుంచి 1000 వరకు చేతులు తపాలని ఆర్టీఏ సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పని జరగాలంటే తమ డ్రైవర్లను కలవాలని కొందరు అధికారులు షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు.
డ్రైవర్‌లతో వాట్సాప్ కాల్‌లోనే మాట్లాడాలని ఆ అధికారులు సూచిస్తున్నారు. తమ డ్రైవర్లకు ఎంతోకొంత ముట్టజెప్పిన వారికే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ రవాణా కమిషనర్(డీటీసీ)కి తెలియకుండా కిందిస్థాయి సిబ్బందే ఈ దందా నడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంతో విసిగిపోయిన టూ వీలర్,ఫోర్ వీలర్ వాహనాల డీలర్లు డీటీసీని మంగళవారం(అక్టోబర్ 29) కలవనున్నారు. గంభీరం నుంచి ఇటీవల బదిలీపై వచ్చిన అధికారి,మరో మహిళా అధికారితో కలిసి ఈ వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు చెబుతున్నారు. ఆర్టీఏ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: బాంబు బెదిరింపులతో హడల్
Comments
Please login to add a commentAdd a comment