విమానాల్లో బాంబులు పెట్టినట్టు 400 బెదిరింపులు
దక్షిణ భారతాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆగంతకులు
తిరుపతి, విజయవాడ హోటళ్లకూ బెదిరింపులు
ఓ ఆగంతకుడిని అస్సాంలో అరెస్ట్ చేసిన పోలీసులు
సాక్షి, అమరావతి: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బెదిరింపు రాగానే పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది. ప్రధానంగా దక్షిణ భారతంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఈ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వస్తుండటం గమనార్హం. ‘నాన్నా.. పులి కథ’లా మారకూడదన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
రెండు వారాల్లో 400 బెదిరింపులు
విమానాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ వస్తుండటంతో పౌర విమానయాన శాఖ బెంబేలెత్తుతోంది. రెండు వారాల్లో ఏకంగా 400 బెదిరింపులు రావడం గమనార్హం. శనివారం ఒక్కరోజే 33 బెదిరింపులు రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని అంతర్జాతీయ ప్రయాణికులను ఖలీస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల బెదిరించడం కూడా ఈ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర విమానాశ్రయాలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్‌తోపాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో టేకాఫ్ తీసుకున్న విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయిస్తూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
దక్షిణ భారతమే ప్రధాన లక్ష్యంగా..
బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఆగంతకులు ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైకు బెదిరింపులు వచ్చాయి. అక్కడి విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాల్లోనూ, ఆ నగరంలోని హోటళ్లలోనూ బాంబులు పెట్టినట్టు బెదిరించారు. బెంగళూరు, హైదరాబాద్ కూడా ఈ బెదిరింపుల బెడద బారిన పడ్డాయి. ఆ రెండు నగరాల్లో విమానాలతోపాటు విద్యాసంస్థల్లో బాంబులు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికల ద్వారా బెంబేలెత్తించారు. బెదిరింపుల బెడద ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
వారం రోజుల్లో తిరుపతిలోని 17 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తిరుపతి ఇస్కాన్ ఆలయంలోనూ బాంబు పెట్టినట్టు బెదిరించడం గమనార్హం. కాగా.. విజయవాడలోని ఓ స్టార్ హోటల్‌కు కూడా బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకర్ని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు, విజయవాడలోని హోటళ్లలో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన ఓ ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. అస్సాం నుంచి ఆ మెయిల్ వచ్చినట్టు గుర్తించి ఏపీ, కర్ణాటక ఎస్‌ఐబీ విభాగం అధికారులు ఆ రాష్ట్రంలో సోదాలు నిర్వహించారు. ఈమెయిల్ పంపిన ఆగంతకుడిని గుర్తించి అరెస్ట్ చేసి బెంగళూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతను మతిస్థిమితంలేని వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు.
విమానాశ్రయాల్లో ‘బీటీసీ’ల మోహరింపు
బాంబు బెదిరింపుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్‌ఐఏ) కార్యాచరణను వేగవంతం చేసింది. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ థ్రెట్ అసిస్టెంట్ కమిటీ(బీటీసీ)లను మోహరించింది. బెదిరింపు ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులను ఈ విభాగం పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయో గుర్తించడం, ఎవరు చేస్తున్నారన్నది దర్యాప్తు చేయడం, తదనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు భద్రతా దళాలకు సహకరించడంలో బీటీసీ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
మరో విమానానికి బాంబు బెదిరింపు
విశాఖ నుంచి ముంబై బయలుదేరిన విమానాన్ని వెనక్కి రప్పించిన అధికారులు
తనిఖీల అనంతరం బాంబు లేదని నిర్ధారణ
సాక్షి, విశాఖపట్నం: వరుస బాంబుబెదిరింపులు విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజులుగా వివిధ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బెదిరింపు కాల్ సోమవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అక్కడి అధికారులు విశాఖ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అప్పటికే విశాఖ చేరుకుని.. ముంబై బయలుదేరిన ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి రప్పించారు. విమానం ల్యాండ్ అయ్యేసరికే బాంబ్ స్క్వాడ్‌ను సిద్ధం చేశారు. ప్రయాణికులను దింపి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విశాఖ నుంచి సుమారు 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.32 గంటలకు విమానం ముంబైకి బయలుదేరి వెళ్లిందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment