గాదెకింద ‘కంది’కొక్కులు | vijilence rides on lentils gowdowns | Sakshi
Sakshi News home page

గాదెకింద ‘కంది’కొక్కులు

Published Sat, Jun 25 2016 4:12 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

గాదెకింద ‘కంది’కొక్కులు

గాదెకింద ‘కంది’కొక్కులు

గోదాముల్లో కందుల అక్రమ నిల్వలు  సరుకు దాచేసి మార్కెట్‌లో కృత్రిమ కొరత  రైతుల వద్ద చవగ్గాకొని అదును చూసి అధిక ధరకు అమ్మకాలు  వినియోగదారులను దోచుకుతింటున్న వ్యాపారులు పన్నుల ఎగవేతతో ప్రభుత్వాదాయూనికి భారీగా గండి  పట్టించుకోని అధికారులు.. విజిలెన్స్ మొక్కుబడి దాడులు రైతుల నిల్వలంటూ తప్పించుకొంటున్న నిందితులు  పీసీపల్లిలో 587 క్వింటాళ్ల అక్రమ నిల్వల గుర్తింపు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అక్రమార్కులకు కందుల వ్యాపారం కాసుల పంట పండిస్తోంది. గాదెకింద పందికొక్కుల్లా తయూరై దోచుకుతింటున్నారు. ఏటా వేలాది క్వింటాళ్ల కందులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. రైతుల వద్ద చవగ్గా  కొని ఫుడ్‌గ్రైన్ లెసైన్స్ తీసుకోకుండానే కందులను అక్రమంగా నిల్వ ఉంచుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్‌లో డిమాండ్ పెంచుతున్నారు. ఈ తరువాత అధిక రేట్లకు విక్రయించి వినియోగదారులను దోచుకుతింటూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. పన్నులు చెల్లించకుండా ప్రభుత్వాదాయానికి రూ.కోట్లలో గండి కొడుతున్నారు.

 ఒక్కరోజే భారీ నిల్వల గుర్తింపు..
విజిలెన్స్ సీఐలు కిషోర్, శ్రీరామ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో మండల కేంద్రం పీసీపల్లిలో 310 బస్తాలు, మురుగమ్మిలో 469 బస్తాలు, పెదవరిమడుగులో 200 బస్తాలు మొత్తం 979 బస్తాల(587 క్వింటాళ్ల) కందులు పట్టుబడ్డాయి. ఒక్కరోజు నిర్వహించిన దాడుల్లో ఇంత మొత్తంలో కందులు పట్టుబడ్డాయంటే అక్రమ నిల్వలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. వ్యాపారులు వీటిని రైతులవద్ద కారు చవకగా కొని ప్రభుత్వానికి ఎటువంటి పన్నుచెల్లించకుండా గోదాముల్లో అక్రమంగా దాచారు.

2014-15 ఏడాదిలో 668 క్వింటాళ్లు,2015-16 లో 486 క్వింటాళ్లు, 2016-17 కు గాను తాజాగా శుక్రవారం 587 క్వింటాళ్లు కందులు పట్టు బడినట్లు విజిలెన్స్ నివేదికలు చెబుతున్నాయి. అధికారు పార్టీ ఒత్తిళ్లతో అటు విజిలెన్స్ సైతం మొక్కుబడి దాడులతో సరిపెడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో దాడులు జరిగితే జిల్లా వ్యాప్తంగా వేలాది క్వింటాళ్ల  కందుల అక్రమ నిల్వలు బయటపడే  అవకాశముంది. ఇదే జరిగితే మార్కెట్‌లో వినియోగదారులకు కంది కొరత తీరినట్లే. 

జోరుగా అక్రమ వ్యాపారం..
జిల్లాలో ముఖ్యంగా పశ్చిమప్రాంతంలో కందులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఆప్రాంతంతోపాటు ఇటు తూర్పు ప్రకాశంలోని పలుప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో వేలాది క్వింటాళ్లు అక్రమంగా నిల్వ ఉంచుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా నిత్యావసర వస్తువులు నిలువ ఉంచాలంటే ఫుడ్‌గ్రైన్ సర్టిఫికెట్ తప్పనిరి. కానీ ఏ ఒక్క వ్యాపారీ అనుమతులు తీసుకున్న దాఖలాలు లేవు. కొందరు అధికారులకు ముపుడుపులు ముట్టజెప్పి అక్రమంగా నిల్వ చేస్తున్నారు. సరుకు దాచేసి మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించడంతోనే నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతున్నాయి. వినియోగదారులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 పట్టించుకోని అధికారులు..
వ్యాపారులు అక్రమ నిల్వలకు పాల్పడుతున్నా పౌరసరఫరాల విభాగం, కమర్షియల్ టాక్స్, వ్యవసాయ, పోలీసు, విజిలెన్స్ విభాగాలు స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. అధికారులు అందిన కాడికి దండుకొని వ్యాపారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ మార్కెట్ ప్రాంతంలోనే వేల క్వింటాళ్ల కందులు నిలువ ఉన్నాయని, ఆ మార్కెట్ లోకి అధికారపార్టీ  ప్రజాప్రతినిధి అనుమతి లేనిదే విజిలెన్స్ సైతం వెళ్లకూడదన్న నిబంధనలున్నట్లు ప్రచారం ఉంది.

 రైతుల సాకుచూపి..
విజిలెన్స్ దాడుల్లో పట్టుబడ్డ అక్రమ నిల్వలు ఆ తరువాత కేసు విచారణకు వచ్చే నాటికి రైతులు దాచుకున్నవిగా తేల్చిసి వ్యాపారులు తప్పించుకుంటున్నారు. చివరకు రైతులే.. కందులను గోడౌన్‌లలో దాచుకున్నారని తేలుస్తారు. వ్యాపారులు తమకు పరిచయమున్న రైతుల పాసుపుస్తకాలు తెచ్చి విచారణాధికారి ముందుంచి, మసిపూసి మారేడు కాయ చేస్తారు. చివరకు రైతులను అడ్డుపెట్టి వారు తప్పించుకొంటారు. పౌరసరఫరాల విభాగంలో పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారులు వ్యాపారులకు సహకరిస్తున్నట్లు సమాచారం. అధికారుల సలహాలతోనే ఈ తంతు నడుస్తోందని సాక్షాత్తు విజిలెన్స్‌కు చెందిన ఓ అధికారే పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement