Improper storage
-
గాదెకింద ‘కంది’కొక్కులు
గోదాముల్లో కందుల అక్రమ నిల్వలు సరుకు దాచేసి మార్కెట్లో కృత్రిమ కొరత రైతుల వద్ద చవగ్గాకొని అదును చూసి అధిక ధరకు అమ్మకాలు వినియోగదారులను దోచుకుతింటున్న వ్యాపారులు పన్నుల ఎగవేతతో ప్రభుత్వాదాయూనికి భారీగా గండి పట్టించుకోని అధికారులు.. విజిలెన్స్ మొక్కుబడి దాడులు రైతుల నిల్వలంటూ తప్పించుకొంటున్న నిందితులు పీసీపల్లిలో 587 క్వింటాళ్ల అక్రమ నిల్వల గుర్తింపు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అక్రమార్కులకు కందుల వ్యాపారం కాసుల పంట పండిస్తోంది. గాదెకింద పందికొక్కుల్లా తయూరై దోచుకుతింటున్నారు. ఏటా వేలాది క్వింటాళ్ల కందులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. రైతుల వద్ద చవగ్గా కొని ఫుడ్‌గ్రైన్ లెసైన్స్ తీసుకోకుండానే కందులను అక్రమంగా నిల్వ ఉంచుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో డిమాండ్ పెంచుతున్నారు. ఈ తరువాత అధిక రేట్లకు విక్రయించి వినియోగదారులను దోచుకుతింటూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. పన్నులు చెల్లించకుండా ప్రభుత్వాదాయానికి రూ.కోట్లలో గండి కొడుతున్నారు. ఒక్కరోజే భారీ నిల్వల గుర్తింపు.. విజిలెన్స్ సీఐలు కిషోర్, శ్రీరామ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో మండల కేంద్రం పీసీపల్లిలో 310 బస్తాలు, మురుగమ్మిలో 469 బస్తాలు, పెదవరిమడుగులో 200 బస్తాలు మొత్తం 979 బస్తాల(587 క్వింటాళ్ల) కందులు పట్టుబడ్డాయి. ఒక్కరోజు నిర్వహించిన దాడుల్లో ఇంత మొత్తంలో కందులు పట్టుబడ్డాయంటే అక్రమ నిల్వలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. వ్యాపారులు వీటిని రైతులవద్ద కారు చవకగా కొని ప్రభుత్వానికి ఎటువంటి పన్నుచెల్లించకుండా గోదాముల్లో అక్రమంగా దాచారు. 2014-15 ఏడాదిలో 668 క్వింటాళ్లు,2015-16 లో 486 క్వింటాళ్లు, 2016-17 కు గాను తాజాగా శుక్రవారం 587 క్వింటాళ్లు కందులు పట్టు బడినట్లు విజిలెన్స్ నివేదికలు చెబుతున్నాయి. అధికారు పార్టీ ఒత్తిళ్లతో అటు విజిలెన్స్ సైతం మొక్కుబడి దాడులతో సరిపెడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో దాడులు జరిగితే జిల్లా వ్యాప్తంగా వేలాది క్వింటాళ్ల కందుల అక్రమ నిల్వలు బయటపడే అవకాశముంది. ఇదే జరిగితే మార్కెట్లో వినియోగదారులకు కంది కొరత తీరినట్లే. జోరుగా అక్రమ వ్యాపారం.. జిల్లాలో ముఖ్యంగా పశ్చిమప్రాంతంలో కందులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఆప్రాంతంతోపాటు ఇటు తూర్పు ప్రకాశంలోని పలుప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో వేలాది క్వింటాళ్లు అక్రమంగా నిల్వ ఉంచుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా నిత్యావసర వస్తువులు నిలువ ఉంచాలంటే ఫుడ్‌గ్రైన్ సర్టిఫికెట్ తప్పనిరి. కానీ ఏ ఒక్క వ్యాపారీ అనుమతులు తీసుకున్న దాఖలాలు లేవు. కొందరు అధికారులకు ముపుడుపులు ముట్టజెప్పి అక్రమంగా నిల్వ చేస్తున్నారు. సరుకు దాచేసి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడంతోనే నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతున్నాయి. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోని అధికారులు.. వ్యాపారులు అక్రమ నిల్వలకు పాల్పడుతున్నా పౌరసరఫరాల విభాగం, కమర్షియల్ టాక్స్, వ్యవసాయ, పోలీసు, విజిలెన్స్ విభాగాలు స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. అధికారులు అందిన కాడికి దండుకొని వ్యాపారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ మార్కెట్ ప్రాంతంలోనే వేల క్వింటాళ్ల కందులు నిలువ ఉన్నాయని, ఆ మార్కెట్ లోకి అధికారపార్టీ ప్రజాప్రతినిధి అనుమతి లేనిదే విజిలెన్స్ సైతం వెళ్లకూడదన్న నిబంధనలున్నట్లు ప్రచారం ఉంది. రైతుల సాకుచూపి.. విజిలెన్స్ దాడుల్లో పట్టుబడ్డ అక్రమ నిల్వలు ఆ తరువాత కేసు విచారణకు వచ్చే నాటికి రైతులు దాచుకున్నవిగా తేల్చిసి వ్యాపారులు తప్పించుకుంటున్నారు. చివరకు రైతులే.. కందులను గోడౌన్లలో దాచుకున్నారని తేలుస్తారు. వ్యాపారులు తమకు పరిచయమున్న రైతుల పాసుపుస్తకాలు తెచ్చి విచారణాధికారి ముందుంచి, మసిపూసి మారేడు కాయ చేస్తారు. చివరకు రైతులను అడ్డుపెట్టి వారు తప్పించుకొంటారు. పౌరసరఫరాల విభాగంలో పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారులు వ్యాపారులకు సహకరిస్తున్నట్లు సమాచారం. అధికారుల సలహాలతోనే ఈ తంతు నడుస్తోందని సాక్షాత్తు విజిలెన్స్‌కు చెందిన ఓ అధికారే పేర్కొనడం గమనార్హం. -
నందిగామలో విజిలెన్స్ దాడులు
కృష్ణ జిల్లా నందిగామలో విజిలెన్స్ అధికారులు శనివారం సాయంత్రం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. కందిపప్పును నిల్వ ఉంచి కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అక్రమంగా కందిపప్పు బ్లాక్ చేసిన ఒక వ్యాపారిని అరెస్టు చేశారు. కందిపప్పును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. -
అక్రమ నిల్వలపై అధికారుల దాడులు
జనరల్ స్టోర్స్‌పై సివిల్ సఫ్లై అధికారులు దాడిచేసి నాలుగు లక్షల విలువైన పప్పు ధాన్యాలను సీజ్ చేశారు. ఈ సంఘటన ఏలూరులోని బెనర్జీపేటలో గురువారం మధ్యాహ్నం జరిగింది. బెనర్జీపేటకు చెందిన సాంబశివ జనరల్ స్టోర్‌లో అక్రమంగా పప్పు దాన్యాలు నిలువ ఉంచారనే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో షాప్‌పై దాడిచేసి నాలుగు లక్షల విలువ చేసే పప్పు ధాన్యాలను అధికారులు సీజ్ చేశారు. -
ధరల మంట!
కిలో కందిపప్పు రూ.120కి చేరిన వైనం సన్నబియ్యం రూ.40లకు పైమాటే కాగుతున్న వంటనూనెలు అక్రమ నిల్వల వల్లే ధరలు ఆకాశానికి బతుకు బరువైన కరువు జిల్లా ప్రజలపై తాజాగా నిత్యావసరాల ధరలు పిడుగులై కురుస్తున్నాయి. అవసరమైనప్పుడు చినుకు కురవక అవసరంలేనప్పుడు గాలివాన పంటలపై దాడులు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు పప్పులు, బియ్యం, కూరగాయల ధరలు సైతం ఆకాశం కేసి చూస్తున్నాయి. కొనాలని వెళ్లిన సామాన్యుడికి ధరలు వింటే వణుకు పుడుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు స్వార్థపరులు అక్రమంగా నిల్వ చేసి ధరల కృత్రిమపెరుగుదలకు కారణమవుతున్నారు. జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టకపోతే ఈ ధరలు ఇప్పుడిప్పుడే దిగేలా లేవు. అనంతపురం అర్బన్ : రైస్ మిల్లల యాజమానులు, వర్తకులు ఒక్కటై ధరల మంటలకు ఆజ్యం పోస్తున్నారు. జిల్లాలోని ప్రజలకు సరిపడా బియ్యం, కందిపప్పు ఉన్నా వ్యాపారులు మాత్రం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ముందస్తుగా రైతుల నుండి కొనుగోలు చేసి గోడౌన్లో, రైస్ మిల్లుల్లో నెలల తరబడి అక్రమ నిల్వలు చేసి ధరల భారాన్ని ప్రజల నెత్తిపై మోపుతున్నారు. రోజు రోజుకు నిత్యావసర సరుకులైన కందిపప్పు, మినపప్పు, చింతపండు, సన్నబియ్యంపై ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఏప్రిల్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రతి సరుకుపైన రూ. 15 నుండి రూ. 20ల వరకు ధరలు పెరిగాయి. కిలో కందిపప్పు అప్పుడు రూ. 80లు ఉండగా.. ప్రస్తుతం రూ. 120లకు విక్రయిస్తున్నారు. అదే విధంగా కేజీ సన్నబియ్యం రూ. 30లు ఉండగా.. ప్రస్తుతం రూ. 40లకు పెంచేశారు. ఇక నూనెల విషయానికొస్తే రోజు రోజుకు నూనె మంటలు రేగుతున్నాయి. మార్చి నెలలో రూ.55లు ఉన్న పామాయిల్ ధరలు ప్రస్తుతం రూ.60లు ఉంది. ఇక వేరుశనగ నూనె అయితే ఏకంగా రూ. 120లకు చేరుకుంది. అక్రమ నిల్వలు ఇలా.. జిల్లాలో రైతు పండించే ప్రధాన పంటలను కొందరు మిల్లర్లు తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేస్తారు. మూడు నెలల క్రితం క్వింటాళ్లు వరిధాన్యాన్ని వ్యాపారులు రైతుల నుంచి రూ. 1200లకు, కందులను క్వింటాల్ రూ. 5 వేలకు, వేరుశనగ కాయలను రూ. 3,500లకు కొనుగోలు చేశారు. వాటిని మిల్లు ఆడించి సిద్ధం చేసి పెట్టుకున్నారు. కొంతమంది ఈ సరుకును అక్రమంగా నిలువ ఉంచారు. వ్యాపారులు కొనుగోలు చేసిన ధరలు ప్రకారం బహిరంగ మార్కెట్లో వేరుశనగ నూనెను రూ. 75ల నుండి రూ. 80ల వరకు విక్రయించాలి. అయితే ప్రస్తుతం రూ. 120లకు వేరుశనగ నూనెను విక్రయిస్తున్నారు. అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, తదితర ప్రాంతాల్లో వీటిని అధిక శాతంలో వ్యాపారులు అక్రమ నిల్వలు చేసినట్లు తెలుస్తోంది. మండుతున్న కూరగాయల ధరలు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల మార్కెట్ ధరలు మండుతున్నాయి. రూ.200లు బజార్‌కు తీసుకెళ్తే.. కనీసం మూడు రోజులకు సరిపడే కూరగాయలు కూడా రావడం లేదని గృహిణిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చి మిర్చి మార్చిలో రూ. 12లు ఉండగా.. ప్రస్తుతం రూ. 20లకు ఎగబాకింది. అలాగే ఉల్లిపాయలు రూ. 12లు నుంచి రూ. 25ల వరకు ధర పెరిగింది. బంగాళదుంప రూ. 16ల నుండి రూ. 24లకు, టమోట రూ. 20 నుంచి రూ. 35లకు ఎగబాకింది. క్యారెట్ ధర కూడా రూ. 16ల నుండి రూ. 24ల వరకు పెరిగింది. ఇలా కాయగూరలు, ఆకుకూరలు సైతం ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. -
కమ్మని ఫలం.. కాలకూట విషం!
♦ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో కట్టలు తెంచుకున్న ‘కార్బైడ్’ ♦ మామిడి రాకతో భారీగా అక్రమ నిల్వలు ♦ కాలకూటంతోనే కదులుతోన్న ఎగుమతులు ♦ మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం ♦ అక్రమాలపై దృష్టిపెట్టని విజిలెన్స్, ఏసీబీలు సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో కార్బైడ్ కాలకూటం కట్టలు తెంచుకొంది. కమీషన్‌దారుల దుకాణాల్లో కుప్పులు తెప్పలుగా కార్బైడ్ దర్శనమిస్తోంది. ఒకటి కాదు... రెండు కాదు... దాదాపు అన్ని దుకాణాల్లో కార్బైడ్‌ను పొట్లాలు కట్టి మామిడి కాయల బాక్స్‌ల్లో పెట్టి కాయలు కృత్రిమంగా మగ్గేలా చేస్తున్నారు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా అడ్డుకొనే నాథుడే లేడు. కార్బైడ్ వినియోగంపై నిషేధం అమల్లో ఉందన్న విషయాన్ని ఇక్కడి వ్యాపారులు ఖాతరు చేయట్లేదు. మార్కెట్లోకి కార్బైడ్ రాకుండా అడ్డుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ప్రస్తుతం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ కాల కూటానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు ప్రస్తుతం అనంతపూర్, చిత్తూరు, కృష్ణా, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా నుంచి రోజుకు 200-300 వాహనాల్లో మామిడి దిగుమతవుతోంది. మార్కెట్లోకి వచ్చేవరకు మామిడి స్వచ్ఛంగానే ఉంటున్నా... ఇక్కడినుంచి బయటకు వెళ్లేసరికి విషతుల్యంగా మారిపోతున్నాయి. వేలంలో సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు మార్కెట్లో బహిరంగంగానే కార్బైడ్‌ను పొట్లాలుగా కట్టి మామిడికాయల బాక్స్‌ల్లో వేసి కాయలను మగ్గబెడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలీలను పెట్టిమరీ కార్బైడ్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసి పొట్లాలు కట్టించి మామిడి కాయల బాక్స్‌ల్లో పెడుతున్నారు. ఈ తంతు నిత్యం కమీషన్ వ్యాపారుల దుకాణాల్లో బహిరంగంగానే సాగుతున్నా ఇదేమని ? ప్రశ్నించే నాథుడే లేడు. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు అడ్డుఅదుపూ లేకుండా కార్బైడ్ కాలకూటాన్ని యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతవుతోన్న మామిడి కాలకూటంతోనే కదులుతోన్న వాస్తవాన్ని అధికారులు సైతం ఖండించలేని పచ్చి నిజం. కొనుగోళ్లు ఆపేస్తారట ! గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో కార్బైడ్ వినియోగాన్ని అడ్డుకొంటే వ్యాపారులు మామిడి కొనుగోళ్లు నిలిపివేస్తారని, అందుకే ఏమీ చేయలేకపోతున్నామని ఏకంగా మార్కెటింగ్ శాఖ అధికారులే చెబుతున్నారు. అదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోతారని, సెస్సు రూపంలో ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం అందకుండా పోయే ప్రమాదం ఉందంటూ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. కాగా ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కిందిస్థాయి అధికారులు సరిగ్గా ఇక్కడే ఉన్నతాధికారులను పక్కదోవ పట్టిస్తున్న విషయం స్పష్టమవుతోంది. మార్కెట్ కమిటీ అధికారులు గట్టి నిఘా పెడితే మార్కెట్లోకి కార్బైడ్ ఎలా వస్తుంది..? అన్న విషయాన్ని ఉన్నతాధికారులు గమనించాలి. కార్బైడ్‌కు ప్రత్యామ్నాయం ఏదీ లేదంటూ కిందిస్థాయి అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవమెంతో తెలుసుకోవాలి. దోర మామిడి ఇతర రాష్ట్రాలకు వెళ్లేలోగా పండే అవకాశం ఉన్నా.. అది అసాధ్యమంటూ వ్యాపారులకే కొందరు అధికారులు వంతపాడుతుండటం గమనార్హం. పాలకులకు పట్టదా...? ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన భాధ్యత ప్రభుత్వానిదే. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం వహిస్తే ప్రజారోగ్యంపై తీవ్ర పరిణామాలు ఎదురవ్వడం ఖాయమని వైద్యరం నిఫుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి కార్బైడ్ వినియోగం వల్ల కాయలు సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమ పక్వతను సంతరించుకుంటాయి. వీటిలో రంగు తప్ప రుచి, వాసన ఉండదు. పండ్లు నిగనిగలాడుతూ మాగినట్టు కన్పిస్తున్నా... తింటే మాత్రం పళ్లు పులిచి పోతున్నాయి. -
జోగుతున్న నిఘా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని సరుకుల ధరలూ రెట్టింపయ్యాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆహార పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఫలితంగా ఉత్పత్తుల తక్కువగా వచ్చే పరిస్థితి ఉండటంతో వ్యాపారులు, రైస్ మిల్లర్లు నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తున్నారు. దీంతో ధరల పెరుగుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయినా పౌర సరఫరాల శాఖ, నిఘా విభాగం అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. అక్రమ నిల్వలు, సర్కారు సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతున్న విషయంలో పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు ఎక్కువగా జరగాలి. జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. గత ఏడాది తనిఖీలో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గాయి. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు మాత్రం పెరగడం గమనార్హం. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు పెరగకపోవడానికి జిల్లా ఉన్నతాధికారుల ఉదాసీనతే కారణంగా కనిపిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ(రేషన్)లో పారదర్శకత పెంచడం, నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చర్యలు లక్ష్యంగా జిల్లాలో ఉన్న ఆహార సలహా కమిటీ(ఎఫ్ఏసీ) సమావేశం నిర్వహణపైనా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి ఎఫ్ఏసీ సమావేశం జరగాల్సి ఉంది. చివరగా 2014 జనవరిలో జరిగింది. తనిఖీలు నామమాత్రమే.. పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో ఐదుగురు సహాయ సరఫరా అధికారులు(ఏఎస్వో), ఐదుగురు ఆహార ఇన్స్పెక్టర్లు, ఉప తహశీల్దార్లు ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక ధాన్యం కొనుగోలు అధికారి(జీపీవో), సహాయ అధికారి ఉన్నారు. నిత్యావసరాల అక్రమ నిల్వలను నిరోధించడం, ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను నివారించడం లక్ష్యంగా వీరు నిత్యం తనిఖీలు నిర్వహించాలి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు చేయాలి. ఇలా ప్రత్యేకంగా తనిఖీలు, దాడులు చేసే పౌర సరఫరాల అధికారులు సిబ్బంది కాకుండా ప్రతి మండంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉంటారు. ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు ఉంటారు. వీరు కూడా ఈ పనులు చేయవచ్చు. నిత్యావసర సరుకుల బడా వ్యాపారులతో, రైస్ మిల్లర్లతో అధికారులకు, కింది స్థాయి ఉద్యోగుల వరకు ఉన్న సత్సంబంధాల కారణంగా ఎవరూ తనిఖీలు చేయడంలేదని తెలుస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేసినా... సంబంధిత వ్యాపారులకు అధికారుల నుంచి ముందుగానే సమాచారం అందుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సరఫరా చేసే సరుకులను కొనుగోలు చేయాలంటే కొన్ని ఇతర వస్తువులు తీసుకోవాల్సిందేనని కొందరు రేషన్ డీలర్లు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా పౌర సరఫరాల అధికారులు స్పందించడంలేదు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ సైతం దాడులు, తనిఖీల విధులను దాదాపుగా పక్కనబెట్టింది. ఏదైనా ఫిర్యాదు వస్తే కింది స్థాయి సిబ్బంది అక్కడి వెళ్లి, తర్వాత పౌర సరఫరాల అధికారులకు సమాచారం ఇచ్చి రావడం జరుగుతుందే తప్ప చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. -
అక్రమ నిల్వలకు పాల్పడితే జైలుకే!
6ఏ కేసులకు మరింత పదును నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రభుత్వ కసరత్తు సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అక్రమ నిల్వలకు పాల్పడే వారిని నేరుగా జైలుకు పంపే విధంగా నిబంధనల్లో మార్పులను తీసుకురానున్నారు. ఈ మేరకు తగు చొరవ, చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం మార్కెట్లో పలు వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. నాలుగైదు మాసాల క్రితం కిలో సన్న బియ్యం ధర రూ.40 ఉండగా తాజాగా ఈ ధర రూ.50కి పైగా చేరింది. ఎన్నికల సమయంలో అధికారులతో మిల్లర్లు కుమ్మక్కై సన్నరకం బియ్యాన్ని భారీగా ఇతర ప్రాంతాలకు తరలించారు. దాంతో ప్రస్తుతం బియ్యం ధరలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో కొంత మంది వ్యాపారస్తులు పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవడం కోసం బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్టు సమాచారం. ఈ ధరలు మరింత పెరిగిన తర్వాత తమ నిల్వలను బయటకు తీసుకువచ్చి విక్రయించాలని భావిస్తున్నారు. దాంతో సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అంచనా వేసిన ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యల్ని తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా అక్రమంగా నిల్వలకు పాల్పడే వారిపై బెయిల్ లేని కేసులను నమోదు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారిపై నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చట్టం(6ఏ) ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ కేసుల్లో వెంటనే బెయిల్ లభిస్తుండడంతో వ్యాపారస్తుల్లో భయం ఉండడం లేదనే వాదన ఉంది. అందుకోసం ఈ చట్టానికి సవరణ చేయాలని, అరెస్ట్ చేసిన సందర్భంలో బెయిల్ రాకుండా కఠిన నిబంధనలను రూపొందించాలని కేంద్రాన్ని రాష్ర్ట ప్రభుత్వం కోరింది. కాగా, నిలిచిపోయిన పామాయిల్ సరఫరాను పునరుద్ధరించాలని రాష్ర్టం నిర్ణయించింది. గత అక్టోబర్ మాసం నుంచి రాష్ర్టంలో సబ్సిడీపై అందించే పామాయిల్ సరఫరాను రద్దు చేశారు. దీనిని తిరిగి పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి రాష్ర్టం లేఖను రాసింది. ఇందుకోసం నెలకు సుమారు రూ.15 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే, గతంలో మాదిరిగా సబ్సిడీపై కందిపప్పును కూడా సరఫరా చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది. -
నకిలీ ఎరువుల గుట్టు రట్టు
మందస,న్యూస్‌లైన్: అనుమతులు లేవు.. బ్రాం డెడ్ కంపెనీల మందులూ లేవూ..అంతా డూప్లికేటే..పట్టించుకునే నాథుడే కరువవడంతో స్వేచ్ఛగా డూప్లికేట్ జీవ నియంత్రణ ఎరువుల వ్యాపారం సాగిపోతోంది. అందుకోసం ఏకం గా ఓ గోదాంనే ఏర్పాటు చేసుకున్నారు. మరో అడుగు ముందుకేసి..ఎరువులను తయా రు చేస్తున్నారు కూడా.. బోగస్ కంపెనీల పేర్లతో మందుల నిల్వలను చూసి..దాడులు నిర్వహిం చిన అధికారులే అవాక్కయ్యారు. వివరాలివీ.. మందస రాజావారి కోటకు సమీపంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోని గదిలో నిబంధనలకు విరుద్ధంగా..ఎటువంటి అనుమతులు లేకుం డా.. కల్తీ జీవ నియంత్రణ ఎరువులు తయారు చేస్తున్నారని, ప్రస్తుతం అక్కడ భారీగా అక్రమ నిల్వలు ఉన్నాయని వ్యవసాయ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఏవో పూజారి సత్యనారాయణ గోదాం వద్దకు వెళ్లారు. అక్కడ వ్యవసాయానికి సంబంధించిన జీవ నియంత్రణ ఎరువులు ఉన్నట్లు గుర్తించారు. వాటిని ఇద్దరు మహిళలు ప్యాకింగ్ చేస్తున్నట్లు గమనించారు. వెంటనే పోలీసులకు, పలాస ఏడీఏ టి.వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించా రు. అధికారులంతా..కలిసి పక్కా ప్రణాళికతో సోమవారం సాయంత్రం గోదాంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ప్యాకింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఎం.రమేష్ అనే వ్యక్తి పేరుతో గో దాంలో ఓ కవర్ ఉం దని, గోదాం నిర్వాహకుడు ఆయనే అయి ఉండవచ్చని ఏడీఈ అనుమానం వ్యక్తం చేశారు. గోదాంపై సాయి ఆగ్రో అనే పేరుతో బోర్డు ఉందన్నారు. కానీ ఈ పేరుతో ఎటువంటి లెసైన్సులు జారీ చేయలేదని పేర్కొన్నారు. 12 కంపెనీలకు చెందిన లేబుళ్లు.. గోదాంలో 12 రకాల కంపెనీలకు చెందిన లేబుళ్లు ఉన్నాయని, ఆయా పేర్లతో దేశంలో ఎక్కడా కంపెనీలు లేవని అధికారులు పేర్కొన్నారు. పూర్తిగా డూప్లికేట్ ఎరువుల తయారీ గోదాంగా గుర్తించామన్నారు. ఇక్కడ లభ్యమైన ఎరువులు సైతం నకిలీవేనని నిర్ధారించారు. గోదాంలో ఉన్న ఎరువుల విలువ రూ.లక్షల్లో ఉంటుందన్నారు. ఎరువులను ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన అన్ని పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సామగ్రిని, లేబుళ్లను స్వాధీనం చేసుకుని, గోదాంను సీజ్ చేశామని అధికారులు చెప్పారు. వాటిని సంబంధిత తహశీల్దార్ లేదా కోర్టులు అధీనంలో ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో ఏఈవోలు మెట్ట జ్యోత్స్న, పి.ఉదయ్‌కుమార్, ఆర్ఐ రామకృష్ణ, వీఆర్వో గౌరీ ప్రసాద్, ట్రైనీ ఎస్సై బి.సురేష్‌బాబు, హెచ్‌సీ మెట్ట విజయ్‌కుమార్ ఉన్నారు.