6ఏ కేసులకు మరింత పదును
నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రభుత్వ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అక్రమ నిల్వలకు పాల్పడే వారిని నేరుగా జైలుకు పంపే విధంగా నిబంధనల్లో మార్పులను తీసుకురానున్నారు. ఈ మేరకు తగు చొరవ, చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం మార్కెట్‌లో పలు వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. నాలుగైదు మాసాల క్రితం కిలో సన్న బియ్యం ధర రూ.40 ఉండగా తాజాగా ఈ ధర రూ.50కి పైగా చేరింది. ఎన్నికల సమయంలో అధికారులతో మిల్లర్లు కుమ్మక్కై సన్నరకం బియ్యాన్ని భారీగా ఇతర ప్రాంతాలకు తరలించారు. దాంతో ప్రస్తుతం బియ్యం ధరలు భారీగా పెరిగాయి.
ఇదే సమయంలో కొంత మంది వ్యాపారస్తులు పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవడం కోసం బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్టు సమాచారం. ఈ ధరలు మరింత పెరిగిన తర్వాత తమ నిల్వలను బయటకు తీసుకువచ్చి విక్రయించాలని భావిస్తున్నారు. దాంతో సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అంచనా వేసిన ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యల్ని తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా అక్రమంగా నిల్వలకు పాల్పడే వారిపై బెయిల్ లేని కేసులను నమోదు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారిపై నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చట్టం(6ఏ) ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.
అయితే, ఈ కేసుల్లో వెంటనే బెయిల్ లభిస్తుండడంతో వ్యాపారస్తుల్లో భయం ఉండడం లేదనే వాదన ఉంది. అందుకోసం ఈ చట్టానికి సవరణ చేయాలని, అరెస్ట్ చేసిన సందర్భంలో బెయిల్ రాకుండా కఠిన నిబంధనలను రూపొందించాలని కేంద్రాన్ని రాష్ర్ట ప్రభుత్వం కోరింది. కాగా, నిలిచిపోయిన పామాయిల్ సరఫరాను పునరుద్ధరించాలని రాష్ర్టం నిర్ణయించింది. గత అక్టోబర్ మాసం నుంచి రాష్ర్టంలో సబ్సిడీపై అందించే పామాయిల్ సరఫరాను రద్దు చేశారు. దీనిని తిరిగి పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి రాష్ర్టం లేఖను రాసింది. ఇందుకోసం నెలకు సుమారు రూ.15 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే, గతంలో మాదిరిగా సబ్సిడీపై కందిపప్పును కూడా సరఫరా చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది.
అక్రమ నిల్వలకు పాల్పడితే జైలుకే!
Published Mon, Jul 7 2014 3:41 AM | Last Updated on Sat, Jul 6 2019 3:22 PM
Advertisement