ఇంకా విడుదల కాని ‘సత్యం’ రాజు
బెయిల్ కాగితాలు చర్లపల్లి జైలు అధికారులకు
ఇంకా చేరకపోవడమే కారణం
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న దోషులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినా వారి విడుదలలో జాప్యం ఏర్పడింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గత నెల 9న దోషులకు ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రామలింగరాజు, రామరాజులకు రూ.5.75 కోట్లు, మిగతా దోషులకు రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు జరిమానా విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చర్లపల్లి జైలులో ఉంటున్న రామలింగరాజు విజ్ఞప్తి మేరకు ప్రత్యేకకోర్టు జైలుశిక్ష అమలును నిలిపివేసి దోషులందరికీ సోమవారం బెయిల్ మంజూరు చేసింది. జైలు శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయడంతోపాటు జరిమానాలో 10 శాతాన్ని జైలు నుంచి విడుదలైన నాలుగు వారాల్లోగా చెల్లించాలని కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అలాగే రామలింగరాజు, రామరాజులు రూ. లక్ష చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, మిగిలిన 8 మంది దోషులు రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలని బెయిల్ ఉత్తర్వుల్లో షరతు విధించింది. బెయిల్ కాగితాలు మంగళవారం రాత్రి వరకు కూడా చర్లపల్లి జైలు అధికారులకు చేరలేదు. దీంతో విడుదలలో జాప్యం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల బెయిల్ ఉత్తర్వుల ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే జైలు అధికారులకు చేరలేదు. బుధవారం సాయంత్రంలోగా బెయిల్ పేపర్లు జైలు అధికారులకు చేరే అవకాశాలు ఉన్నాయని జైలు వర్గాలు పేర్కొన్నాయి. రామలింగరాజు కొద్దిరోజులుగా జైలులో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాడు.