‘సత్యం’ రాజుకు బెయిల్ | Satyam’s Ramalinga Raju, 9 others get bail, sentences suspended by court | Sakshi
Sakshi News home page

‘సత్యం’ రాజుకు బెయిల్

Published Tue, May 12 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

‘సత్యం’ రాజుకు బెయిల్

‘సత్యం’ రాజుకు బెయిల్

జైలు శిక్ష అమలును నిలిపివేసిన ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు
 

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో దోషులకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేసి, రామలింగరాజు సహా ఇతరులకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా మొత్తంలో పది శాతాన్ని జైలు నుంచి విడుదలైన 4 వారాల్లో చెల్లించాలని షరతు విధించింది. విచారణను జాప్యం చేసే యత్నం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.

హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో దోషులకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేసి, రామలింగరాజు సహా ఇతరులకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా మొత్తంలో పది శాతాన్ని జైలు నుంచి విడుదలైన నాలుగు వారాల్లో చెల్లించాలని షరతు విధించింది. దీంతోపాటు బెయిల్ కోసం రామలింగరాజు, రామరాజులు రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, మిగతా 8 మంది దోషులు రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గత నెల 9న దోషులకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రామలింగరాజు, రామరాజులకు రూ. 5.75 కోట్లు, మిగతా దోషులకు రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై వారు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టులో అప్పీలు దాఖలు చేయగా.. సోమవారం దీనిపై విచారణ జరిగింది.

ఈ సందర్భంగా దోషుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... తీవ్రమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో, సమాజానికి ప్రమాదకరమని భావించే కేసుల్లో మినహా దోషులను అప్పీళ్ల విచారణ సమయంలో జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టం చేసిందని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో మదుపుదారులెవరికీ నష్టం జరగలేదని, దోషులు మాత్రమే బాధితులుగా మిగిలిపోయారని చెప్పారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. అప్పీళ్ల విచారణకు సహకరించాలని, పదేపదే వాయిదాలు కోరరాదని దోషులకు స్పష్టం చేశారు. వారు కోర్టు విచారణలో జాప్యం చేసే ప్రయత్నం చేస్తే బెయిల్ రద్దు చేయాల్సిందిగా సీబీఐ న్యాయస్థానాన్ని కోరవచ్చని పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement