సత్యం రామలింగ రాజు రేపు విడుదల
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బీ రామలింగరాజు మరో తొమ్మిదిమంది బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా.. అది ఇంకా జైలు అధికారులకు చేరకపోవడంతో ఆయన విడుదల ఒక రోజు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరు చర్లపల్లి సెంట్రల్ జైళ్లో ఉన్నారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో వీరికి ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేసి, రామలింగరాజు సహా ఇతరులకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.
అయితే ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా మొత్తంలో పది శాతాన్ని జైలు నుంచి విడుదలైన నాలుగు వారాల్లో చెల్లించాలని షరతు విధించింది. దీంతోపాటు బెయిల్ కోసం రామలింగరాజు, రామరాజులు రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, మిగతా 8 మంది దోషులు రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.