ధరల మంట!
కిలో కందిపప్పు రూ.120కి చేరిన వైనం
సన్నబియ్యం రూ.40లకు పైమాటే
కాగుతున్న వంటనూనెలు అక్రమ నిల్వల వల్లే ధరలు ఆకాశానికి
బతుకు బరువైన కరువు జిల్లా ప్రజలపై తాజాగా నిత్యావసరాల ధరలు పిడుగులై కురుస్తున్నాయి. అవసరమైనప్పుడు చినుకు కురవక అవసరంలేనప్పుడు గాలివాన పంటలపై దాడులు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు పప్పులు, బియ్యం, కూరగాయల ధరలు సైతం ఆకాశం కేసి చూస్తున్నాయి. కొనాలని వెళ్లిన సామాన్యుడికి ధరలు వింటే వణుకు పుడుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు స్వార్థపరులు అక్రమంగా నిల్వ చేసి ధరల కృత్రిమపెరుగుదలకు కారణమవుతున్నారు. జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టకపోతే ఈ ధరలు ఇప్పుడిప్పుడే దిగేలా లేవు.
అనంతపురం అర్బన్ : రైస్ మిల్లల యాజమానులు, వర్తకులు ఒక్కటై ధరల మంటలకు ఆజ్యం పోస్తున్నారు. జిల్లాలోని ప్రజలకు సరిపడా బియ్యం, కందిపప్పు ఉన్నా వ్యాపారులు మాత్రం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ముందస్తుగా రైతుల నుండి కొనుగోలు చేసి గోడౌన్‌లో, రైస్ మిల్లుల్లో నెలల తరబడి అక్రమ నిల్వలు చేసి ధరల భారాన్ని ప్రజల నెత్తిపై మోపుతున్నారు. రోజు రోజుకు నిత్యావసర సరుకులైన కందిపప్పు, మినపప్పు, చింతపండు, సన్నబియ్యంపై ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఏప్రిల్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రతి సరుకుపైన రూ. 15 నుండి రూ. 20ల వరకు ధరలు పెరిగాయి. కిలో కందిపప్పు అప్పుడు రూ. 80లు ఉండగా.. ప్రస్తుతం రూ. 120లకు విక్రయిస్తున్నారు. అదే విధంగా కేజీ సన్నబియ్యం రూ. 30లు ఉండగా.. ప్రస్తుతం రూ. 40లకు పెంచేశారు. ఇక నూనెల విషయానికొస్తే రోజు రోజుకు నూనె మంటలు రేగుతున్నాయి. మార్చి నెలలో రూ.55లు ఉన్న పామాయిల్ ధరలు ప్రస్తుతం రూ.60లు ఉంది. ఇక వేరుశనగ నూనె అయితే ఏకంగా రూ. 120లకు చేరుకుంది.
అక్రమ నిల్వలు ఇలా..
జిల్లాలో రైతు పండించే ప్రధాన పంటలను కొందరు మిల్లర్లు తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేస్తారు. మూడు నెలల క్రితం క్వింటాళ్లు వరిధాన్యాన్ని వ్యాపారులు రైతుల నుంచి రూ. 1200లకు, కందులను క్వింటాల్ రూ. 5 వేలకు, వేరుశనగ కాయలను రూ. 3,500లకు కొనుగోలు చేశారు. వాటిని మిల్లు ఆడించి సిద్ధం చేసి పెట్టుకున్నారు. కొంతమంది ఈ సరుకును అక్రమంగా నిలువ ఉంచారు. వ్యాపారులు కొనుగోలు చేసిన ధరలు ప్రకారం బహిరంగ మార్కెట్‌లో వేరుశనగ నూనెను రూ. 75ల నుండి రూ. 80ల వరకు విక్రయించాలి. అయితే ప్రస్తుతం రూ. 120లకు వేరుశనగ నూనెను విక్రయిస్తున్నారు. అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, తదితర ప్రాంతాల్లో వీటిని అధిక శాతంలో వ్యాపారులు అక్రమ నిల్వలు చేసినట్లు తెలుస్తోంది.
మండుతున్న కూరగాయల ధరలు
నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల మార్కెట్ ధరలు మండుతున్నాయి. రూ.200లు బజార్‌కు తీసుకెళ్తే.. కనీసం మూడు రోజులకు సరిపడే కూరగాయలు కూడా రావడం లేదని గృహిణిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చి మిర్చి మార్చిలో రూ. 12లు ఉండగా.. ప్రస్తుతం రూ. 20లకు ఎగబాకింది. అలాగే ఉల్లిపాయలు రూ. 12లు నుంచి రూ. 25ల వరకు ధర పెరిగింది. బంగాళదుంప రూ. 16ల నుండి రూ. 24లకు, టమోట రూ. 20 నుంచి రూ. 35లకు ఎగబాకింది. క్యారెట్ ధర కూడా రూ. 16ల నుండి రూ. 24ల వరకు పెరిగింది. ఇలా కాయగూరలు, ఆకుకూరలు సైతం ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు.