‘అమ్మో’రికా! | Rising Prices of Essential Commodities: America | Sakshi
Sakshi News home page

‘అమ్మో’రికా!

Sep 22 2024 5:18 AM | Updated on Sep 22 2024 5:18 AM

Rising Prices of Essential Commodities: America

ధరల పెరుగుదలతో అమెరికన్ల బెంబేలు

తీవ్ర ఆర్థిక ఒత్తిడితో సతమతం

ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపైనా అసంతృప్తి

లేఆఫ్‌లతో మరింత ప్రతికూలంగా పరిస్థితులు

పెరుగుతున్న మానసిక, శారీరక సమస్యలు

సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే ఏకైక సూపర్‌ పవర్‌.. ఏకధ్రువ ప్రపంచంలో ఒకే ఒక్క అగ్రరాజ్యం.. ఆ దేశ పౌరులంటే ఇంటా బయటా గౌరవం, ఆకాశహర్మ్యాల్లాంటి భవంతులు.. బహుళజాతి సంస్థలు.. వాటిలో మంచి ఉద్యోగాలు.. భారీ వేతనాలు.. అద్భుతమైన కెరీర్‌.. మనకు తెలిసిన, ఊహించుకునే అమెరికా ఇది. అయితే వాస్తవాలు వేరుగా ఉన్నాయి.. అక్కడా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో అమెరికన్లను తీవ్ర ‘ఆర్థిక’ ఒత్తిడి చుట్టుముడుతోంది. దీంతో వారిలో మానసిక, శారీరక సమస్యలు పెరుగుతున్నాయి.

బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోవడానికి కూడా.. 
అమెరికాలో మాంద్యం ప్రభావంతో ‘ఆర్థిక’ ఒత్తిడులు పెరుగుతున్నాయి. సగం మంది అమెరికన్లు తమ జీవితంలో అత్యంత ఆర్థిక భయాన్ని అనుభవిస్తున్నారు. డబ్బులు లేని స్థితిని పదేపదే గుర్తు చేసుకోలేక బ్యాంకు ఖాతాలను కూడా తనిఖీ చేసుకోవడానికి వెనుకాడుతున్నారు. తమ జీవన వ్యయంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులకు సర్దుబాటు కాలేక తీవ్ర మానసిక సమస్యల బారినపడుతున్నారు. ఈ మేరకు మార్కెట్‌ వాచ్‌ గైడ్స్‌ చేపట్టిన సర్వేలో నిత్యావసరాల కోసం అవుతున్న అధిక ఖర్చులు తమ బడ్జెట్‌ను తారుమారు చేస్తున్నట్టు అమెరికన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల తొలగింపు (లేఆఫ్స్‌), కొత్త ఉద్యోగాలు రాకపోవడం వంటి కారణాలతో చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. కొంతమంది ఉన్న కొద్ది మొత్తాన్నే జాగ్రత్తగా ఖర్చు చేయాలనే ఆలోచనతో కుటుంబ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండిపోతున్నట్టు తేలింది. ఇలా మానసిక ఆరోగ్యాన్ని కూడా ఫణంగా పెట్టాల్సి వస్తోంది.  

అమెరికన్లలో ‘ఆర్థిక’ ఒత్తిడికి ప్రధాన కారణాలు..
నిత్యావసరాల ధరల పెరుగుదల    
 పొదుపు లేకపోవడం    
తగినంత ఆదాయం లేకపోవడం    
 దేశ ఆర్థిక వ్యవస్థ బాగోకపోవడం    
 ఇంటి అద్దె ఖర్చు 8 అధిక వడ్డీలు    
 పదవీ విరమణకు సంబంధించిన అనిశ్చితి

‘ఆర్థిక’ ఒత్తిడి ఇలా..
కొంత స్థాయిలో ఆర్థిక ఒత్తిడిని అనుభవిస్తున్నవారి  88%
ఆర్థికాంశాలే తమ ఒత్తిడికి అతిపెద్ద కారణమని చెప్పినవారు  65%
కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక ఒత్తిడిని దాచిపెట్టిన వారు 58%
ఆర్థిక సమస్యను సంక్షోభంలా మారే     వరకు విస్మరిస్తున్నవారు 44%
ఆర్థికంగా నిలదొక్కు­కోవడం కోసం తమ మానసిక ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నవారు 94%
 ఆర్థిక సమస్యను సంక్షోభంలా మారే వరకు విస్మరిస్తున్నవారు 44%
ఆర్థిక ఒత్తిడితో ప్రతికూల శారీరక ప్రభావాలను ఎదు­ర్కొంటున్నవారు 92%

ఒత్తిడికి మూలకారణం ఇదే.. 
అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు ఆర్థికాంశాలే ఒత్తిడికి ప్రధాన కారణమని చెప్పారు. ముఖ్యంగా యువ అమెరికన్లలో ఒత్తిడి తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ముందు తరాలతో పోలిస్తే 1981–1996 మధ్య జన్మించిన వారిలో ఆర్థిక ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టణాల్లో నివసించేవారు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తక్కువ వేతనాలు ఉండటంతో నిత్యం ఆర్థిక సమస్యల బారినపడుతున్నారు. మరోవైపు కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు చేపట్టడం కూడా ప్రతికూలంగా మారుతోంది.

ప్రభుత్వ, సాంకేతిక రంగాల్లో 14 నెలల గరిష్ట స్థాయికి ఉద్యోగుల తొలగింపు చేరుకుంది. చాలా మంది ఆర్థిక సమస్యలు సంక్షోభంగా మారేవరకు జాగ్రత్త పడకపోవడంతో తీవ్ర కష్టాల్లో కూరుకుపోతున్నారు. అతిగా ఖర్చు చేసే అలవాటు ఉన్నవారు ఇంకా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్న వారి కంటే.. తిరిగి తీర్చే ప్రణాళిక లేకుండానే అప్పులు చేస్తున్న వారు ఎక్కువగా ఉంటున్నారు.

మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
సర్వేలో దాదాపు 41 శాతం మంది ఆర్థిక పరిస్థితులు తమ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్టు అంగీకరించారు. మరో 57 శాతం మంది ఆర్థిక/మానసిక ఆరోగ్యానికి మధ్య ప్రాధాన్యతను తేల్చుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో పురుషులు నిర్ణీత పని గంటలకు మించి వర్క్‌ చేస్తుంటే.. మహిళలు సమయానికి తిండిలేక, సెలవులు కూడా తీసుకోకుండా పని చేయడంతో శారీరక సమస్యల బారిన పడుతున్నారు. సర్వేలో సగం కంటే ఎక్కువ మంది ఆర్థిక సమస్యల ఒత్తిడితో నిద్రను కోల్పోతున్నామని, తలనొప్పితోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

భయపెడుతున్న నిత్యావసరాల ఖర్చు..
అమెరికాలో వ్యవసాయ విభాగం నివేదికల ప్రకారం.. 2022తో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు 11 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. కొన్ని వస్తువుల ధరలు ఇప్పటికీ పెరుగుదలలోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది గుడ్డు ధరలు మరో 4.8 శాతం, బీఫ్‌ మాంసం ధరలు 3 శాతం కంటే ఎక్కువగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఓవైపు నిత్యావసరాల ధరలు పెరుగుతుండటం.. మరోవైపు అందుకు తగ్గట్టు ఆదాయం లేకపోవడంతో అమెరికన్లు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement