నిత్యావసరాల ధాటికి జనం జేబులు గుల్ల
ఒక్కో కుటుంబంపై నెలకు రూ.2 వేల నుంచి 4 వేలకుపైగా అదనపు భారం
జాతీయ సగటుతో పోలిస్తే ఏపీలోనే అత్యధిక రేట్లు
దక్షిణాది సగటుతో పోల్చినా రాష్ట్రంలోనే ధరల బాదుడు
బియ్యం నిల్వల బ్లాక్‌తో మార్కెట్‌లో ఎగబాకుతున్న రేట్లు
గత రెండేళ్లతో పోలిస్తే భారీగా పెరిగిన సరుకుల ధరలు
ద్రవ్యోల్బణం రేటు పెరుగుదలలోనూ ఏపీ ముందంజ
దేశ సగటు 5.08 శాతం.. రాష్ట్రంలో ఏకంగా 5.87 శాతం
కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్న కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: నిత్యావసరాలు వంటింటిని హడలెత్తిస్తున్నాయి. పొయ్యి వెలిగించకుండానే భగభగమంటున్నాయి. కందిపప్పు పట్టుకుంటే చేతులు కాలుతున్నాయి. ఉప్పు, పప్పు, చింతపండు, ఎండుమిర్చితో పాటు కూరగాయల వరకు రేట్లు మండిపోతున్నాయి. నిత్యావసరాల ధరల్లో జాతీయ సగటుతో పాటు దక్షిణాది సగటుతో పోలి్చనా ఆంధ్రప్రదేశ్‌లోనే ధరలు అధికంగా ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితంతో పోలిస్తే నిత్యావసరాల రేట్లు బాగా పెరిగాయి. బియ్యం (కామన్ రకం) 12 శాతం, పెసరపప్పు 54 శాతం, ఆటా 67%, కందిపప్పు 61 శాతం, పంచదార 15 శాతం, బంగాళదుంప 21 శాతం, ఉల్లిపాయాలు 87 శాతం, టమాటాలు 50 శాతం, పాలు 6 శాతం, ఉప్పు ధరలు 30 శాతానికిపైగా పెరగడంతో జనం జేబులు గుల్లవుతున్నాయి. ప్రతి నెలా బడ్జెట్ గాడి తప్పుతోంది.
నాడు ఫోరి్టఫైడ్ గోధుమపిండి
గోధుమ పిండి సగటున కిలో రూ.48 నుంచి రూ.70కిపైగా పలుకుతోంది. దేశ వ్యాప్తంగా తమిళనాడు తర్వాత ఏపీలోనే గోధుమ పిండి రేటు ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫోరి్టఫైడ్ గోధుమ పిండిని కిలో ప్యాకెట్ల రూపంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూ.11కే అందించింది.
బియ్యం బాబోయ్!
గత కొన్నేళ్లుగా బియ్యం ధరలు వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. 2019లో సాధారణ బియ్యం కిలో రూ.36 చొప్పున ఉండగా ఇప్పుడు కిలో రూ.55కిపైగా పలుకుతోంది. సూపర్ ఫైన్ బియ్యం రూ.65 – రూ.70కిపైగా ఎగబాకింది. బాస్మతి, దావత్ బియ్యం ఏకంగా కిలో రూ.230కిపైగా ఉంది. తాజాగా బియ్యం రేట్లు తొమ్మిది రాష్ట్రాల్లో కిలో రూ.50 దాటింది. అత్యధిక బియ్యం రేట్లలో ఏపీ 5వ స్థానంలో ఉంది. బియ్యం నిల్వలను నల్ల బజారుకు తరలించడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఖరీఫ్‌లో నాట్లు వేసిన తర్వాత కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో బియ్యాన్ని బ్లాక్ చేసి రేట్లు పెంచే ఆలోచనలో వ్యాపారులున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా బియ్యం నిల్వలపై పరిమితులు విధించకుండా అక్రమార్కులకు కొమ్ముకాస్తూ నామమాత్రంగా రూ.1, రూ.2 తగ్గించి వినియోగదారులుకు ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటోంది. వరి అధికంగా పండే పంజాబ్‌లో కిలో బియ్యం రూ.39.58 మాత్రమే ఉండగా అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.
ఉడకని కందిపప్పు!
రాష్ట్రంలో గత ఫిబ్రవరిలో కిలో రూ.163 చొప్పున ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180కిపైగా చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా పీడీఎస్‌లో కందిపప్పు ఇవ్వకపోవడంతో బయట మార్కెట్‌లో వ్యాపారులు ధరలు పెంచేశారు. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే కందిపప్పు రేటు అధికంగా ఉంది. ధరల పెరుగుదలను నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
తాజాగా రిటైల్ దుకాణాలు, రైతు బజార్లలో రూ.150కే ఇస్తామంటున్నా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ‘‘కిలో రూ.160 ఉన్నప్పుడు కొన్న కందిపప్పును రెండు సార్లు కుక్కర్‌లో ఉడికించి మిక్సీలో తిప్పినా మెత్తగా కావడం లేదు. చేసేది లేక ప్యాకెట్ కందిపప్పు రూ.224 పెట్టి కొనుక్కెళ్లా. ఉడకని పప్పులు తక్కువ రేటుకు ఇచ్చినా ఏం చేసుకోవాలి? ఇది వినియోగదారులకు నష్టం కాదా?’’ అంటూ విజయవాడలోని ఓ సూపర్ మార్కెట్‌లో వినియోగదారుడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూరగాయల కల్లోలం..
రాష్ట్రంలో రెండు నెలల క్రితం అధిక వేడి కారణంగా కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో వాటి ధరలు 40 నుంచి 60 శాతం పెరిగాయి. రైతు బజార్లలో అన్నీ కిలో రూ.50 నుంచి రూ.80కి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అధిక వర్షాలు, వరదల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో నిత్యావసరాలకు తోడు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. మార్కెట్‌లో కాకరకాయల ధర కిలో ఏకంగా రూ.70, క్యారెట్ ధర రూ.90 వరకు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల కారణంగా టమాటా, ఉల్లి, పచి్చమిర్చి, కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికం, అల్లం ధరలు పెరుగుతున్నాయి.
ఏపీలోనే ద్రవ్యోల్బణం ఎక్కువ..
ధరల పెరుగుదల కొంతవరకు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకున్నా ఏపీలో ద్రవ్యోల్బణం అమాంతం పెరుగుతోంది. జాతీయ సగటు 5.08 శాతంతో పోలిస్తే ఏపీలో ధరల పెరుగుదల సూచీ 5.87 శాతంతో భయపెడుతోంది. ధరల పెరుగుదల సూచీ ఒడిశాలో అత్యధికంగా 7.22 శాతం, దాద్రానగర్ హవేలీలో 6.49 శాతం, బిహార్‌లో 6.37 శాతం, కర్నాటకలో 5.98 శాతం తర్వాత ఏపీ ఐదో స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో 5.49 శాతం, తమిళనాడులో 4.75 శాతం. కేరళలో 5.83 శాతం ద్రవ్యోల్బణం రేటు ఉంది.
నిన్నటి రేట్లు ఇవాళ ఉండట్లేదు..
నిత్యావసరాల ధరలు చూస్తుంటే భయం వేస్తోంది. ఒకరోజు ఉన్న రేటు మరుసటి రోజు ఉండటం లేదు. ఊహించని విధంగా మారిపోతున్నాయి. కందిపప్పు కొనలేని పరిస్థితి. పోనీ కూరగాయలైనా వండుకుందామంటే ఏది చూసినా కిలో రూ.50, రూ.100 పలుకుతున్నాయి. ఆదాయానికి, ఖర్చులకు సంబంధం లేకుండా పోయింది. చివరకు చింతపండు రసం చేసుకోవాలన్నా రేట్లు చూస్తే కొనేలా లేవు. – అద్దంకి మౌనిక, పెదరావూరు, తెనాలి మండలం
నలుగురికి సంతోషంగా వడ్డించలేం..
పప్పులు, ఉప్పుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంటగదిలో కూర్చుని నలుగురికి ఆనందంగా వండిపెట్టే రోజులు ఇప్పట్లో రావేమో. ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. సంపాదించే కొద్ది మొత్తంలో నిత్యావసరాలకే సగం ఖర్చయితే సామాన్యులు ఎలా బతకాలి? బియ్యం రేట్లు కూడా విపరీతంగా పెరుగుతుంటే ఇంకేం తినాలి? – యాదల అన్నపూర్ణ, తెనాలి
Comments
Please login to add a commentAdd a comment