కమ్మని ఫలం.. కాలకూట విషం! | Improper storage in Gaddi annaram fruit market | Sakshi
Sakshi News home page

కమ్మని ఫలం.. కాలకూట విషం!

Published Fri, Apr 17 2015 4:56 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

కమ్మని ఫలం..  కాలకూట విషం!

కమ్మని ఫలం.. కాలకూట విషం!

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో  కట్టలు తెంచుకున్న ‘కార్బైడ్’
మామిడి రాకతో భారీగా అక్రమ నిల్వలు
కాలకూటంతోనే కదులుతోన్న ఎగుమతులు
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం
అక్రమాలపై దృష్టిపెట్టని విజిలెన్స్, ఏసీబీలు

 
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో కార్బైడ్ కాలకూటం కట్టలు తెంచుకొంది.  కమీషన్‌దారుల దుకాణాల్లో కుప్పులు తెప్పలుగా కార్బైడ్ దర్శనమిస్తోంది. ఒకటి కాదు... రెండు కాదు... దాదాపు అన్ని దుకాణాల్లో కార్బైడ్‌ను పొట్లాలు కట్టి మామిడి కాయల బాక్స్‌ల్లో పెట్టి కాయలు కృత్రిమంగా మగ్గేలా చేస్తున్నారు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా అడ్డుకొనే నాథుడే లేడు.  కార్బైడ్ వినియోగంపై నిషేధం అమల్లో ఉందన్న విషయాన్ని ఇక్కడి వ్యాపారులు ఖాతరు చేయట్లేదు. మార్కెట్లోకి కార్బైడ్ రాకుండా  అడ్డుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో  ప్రస్తుతం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ కాల కూటానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు ప్రస్తుతం అనంతపూర్, చిత్తూరు, కృష్ణా, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా నుంచి రోజుకు 200-300 వాహనాల్లో మామిడి దిగుమతవుతోంది. మార్కెట్లోకి వచ్చేవరకు మామిడి స్వచ్ఛంగానే ఉంటున్నా... ఇక్కడినుంచి బయటకు వెళ్లేసరికి విషతుల్యంగా మారిపోతున్నాయి. వేలంలో సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు  మార్కెట్లో బహిరంగంగానే కార్బైడ్‌ను పొట్లాలుగా కట్టి మామిడికాయల బాక్స్‌ల్లో వేసి కాయలను మగ్గబెడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలీలను పెట్టిమరీ కార్బైడ్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసి పొట్లాలు కట్టించి మామిడి కాయల బాక్స్‌ల్లో పెడుతున్నారు.

ఈ తంతు నిత్యం కమీషన్ వ్యాపారుల దుకాణాల్లో బహిరంగంగానే  సాగుతున్నా ఇదేమని ? ప్రశ్నించే నాథుడే లేడు. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు అడ్డుఅదుపూ లేకుండా కార్బైడ్ కాలకూటాన్ని యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతవుతోన్న మామిడి కాలకూటంతోనే కదులుతోన్న వాస్తవాన్ని అధికారులు సైతం ఖండించలేని పచ్చి నిజం.

కొనుగోళ్లు ఆపేస్తారట !
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో  కార్బైడ్ వినియోగాన్ని అడ్డుకొంటే  వ్యాపారులు మామిడి కొనుగోళ్లు నిలిపివేస్తారని, అందుకే ఏమీ చేయలేకపోతున్నామని ఏకంగా మార్కెటింగ్ శాఖ అధికారులే చెబుతున్నారు. అదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోతారని, సెస్సు రూపంలో ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం అందకుండా పోయే ప్రమాదం ఉందంటూ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. కాగా ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కిందిస్థాయి అధికారులు సరిగ్గా ఇక్కడే ఉన్నతాధికారులను పక్కదోవ పట్టిస్తున్న విషయం స్పష్టమవుతోంది.

మార్కెట్ కమిటీ అధికారులు గట్టి నిఘా పెడితే మార్కెట్లోకి కార్బైడ్ ఎలా వస్తుంది..? అన్న విషయాన్ని ఉన్నతాధికారులు గమనించాలి. కార్బైడ్‌కు ప్రత్యామ్నాయం ఏదీ లేదంటూ కిందిస్థాయి అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవమెంతో తెలుసుకోవాలి. దోర మామిడి ఇతర రాష్ట్రాలకు వెళ్లేలోగా పండే అవకాశం ఉన్నా.. అది అసాధ్యమంటూ వ్యాపారులకే  కొందరు అధికారులు వంతపాడుతుండటం గమనార్హం.

పాలకులకు పట్టదా...?
ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన భాధ్యత ప్రభుత్వానిదే. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం వహిస్తే ప్రజారోగ్యంపై తీవ్ర పరిణామాలు ఎదురవ్వడం ఖాయమని వైద్యరం నిఫుణులు హెచ్చరిస్తున్నారు.  నిజానికి కార్బైడ్ వినియోగం వల్ల కాయలు సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమ పక్వతను సంతరించుకుంటాయి. వీటిలో రంగు తప్ప రుచి, వాసన ఉండదు. పండ్లు నిగనిగలాడుతూ మాగినట్టు కన్పిస్తున్నా... తింటే మాత్రం పళ్లు పులిచి పోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement