Gaddiannaram fruit market
-
అర్థరాత్రి హైడ్రామా.. రాత్రి రాత్రే కొత్తపేట పండ్ల మార్కెట్ నేలమట్టం
సాక్షి, సిటీబ్యూరో/చైతన్యపురి: కొత్తపేట పండ్ల మార్కెట్ కాలగర్భంలో కలిసిపోయింది. 36 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కెట్ రాత్రికి రాత్రే భూస్థాపితమైంది. పండ్ల మార్కెట్ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించిన సర్కారు.. 21 ఎకరాల ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్యశాఖకు బదలాయించింది. దీంతో ఈ మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని నిర్ణయించిన సర్కారు ఆగమేఘాల మీద జేసీబీలతో మంగళవారం తెల్లవారేసరికి మార్కెట్‌ను కూల్చేసింది. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన కమీషన్ ఏజెంట్లు హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సమర్పించడం.. న్యాయస్థానం కూడా ఈ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ అధికారుల తీరును తప్పుపట్టడం చకచకా జరిగిపోయాయి. ఏర్పాట్లు చేసేంతవరకు.. ► కోహెడలో పూర్తిస్థాయిలో మార్కెట్ నిర్మించేంతవరకు తాత్కాలికంగా బాటసింగారానికి కొత్తపేట పండ్ల మార్కెట్‌ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ సౌకర్యాల కల్పన సరిగా లేకపోవడంతో ఈ వ్యవహారంపై కమీషన్ ఏజెంట్లు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారించిన న్యాయస్థానం అక్కడ పూర్తి ఏర్పాట్లు చేసేంతవరకు మార్కెట్‌ను కొత్తపేటలోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ► ఈ నేపథ్యంలో ఈ నెల 4న కొత్తపేటలో పండ్ల మార్కెట్‌ను పునఃప్రారంభించారు. మార్కెట్ తరలింపు వ్యవహారం సర్కారుకు చికాకుగా మారింది. తడవకోసారి బాటసింగారం, అక్కడి నుంచి కొత్తపేటకు తరలించడం ద్వారా క్రయవిక్రయాలపై ప్రభావం పడుతుందని భావించిన ప్రభుత్వం.. ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించినందున ఖాళీ చేయాలని నిర్ణయించింది. ► ఈ క్రమంలోనే స్థలాన్ని స్వాధీనం చేసుకున్న వైద్య, ఆరోగ్యశాఖ షెడ్లను కూల్చివేసింది. మార్కెట్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మార్కెట్ మూసివేతకు అధికారులు రావడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ మార్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ను కూల్చివేస్తున్నారనే సమాచారంతో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి వీరిని చెదరగొట్టారు. తెల్లవారేసరికి ఫ్రూట్ మార్కెట్‌ను నేలమట్టం చేశారు. ► కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మార్కెట్‌ను కూల్చివేశారని కమీషన్ ఏజెంట్లు ఆరోపిస్తు న్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం బాటసింగారంలోనే మార్కెట్ కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, అక్కడే పండ్ల మార్కెట్ కొనసాగుతుందని, మంగళవారం బాటసింగారంలోనే క్రయవిక్రయాలు జరిగా యని అధికారులు చెబుతుండటం గమనార్హం. ► మార్కెట్లో కూల్చివేతల విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మల్రెడ్డి రాంరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పెల్లి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి మార్కెట్ వ్యాపారులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. కూల్చివేతలు ఆపండి: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ తరలింపు ప్రక్రియకు నెల రోజుల గడువు ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా మార్కెట్లో కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యాపారులను మార్కెట్ ఆవరణలోకి అనుమతించాలని, తమ వస్తువులను బాటసింగారం మార్కెట్‌కు తరలించేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావులను హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ధర్మాసనం ఆదేశాలకు విరుద్దంగా మార్కెట్‌ను కూల్చివేస్తున్నారంటూ కమీషన్ ఏజెంట్లు దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. నెల రోజుల్లో ఖాళీ చేయాలని గత నెల 8న ధర్మాసనం ఆదేశించిందని, ఈ నెల 8 వరకు గడువు ఉన్నా...వ్యాపారులను ఈ నెల 4న మాత్రమే అనుమతించారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గంగయ్యనాయుడు వాదనలు వినిపించారు. మార్కెట్లోకి ప్రవేశించిన వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేశారని, దాదాపు 500 మంది పోలీసుల పహారా మధ్య సోమవారం అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తున్నారని తెలిపారు. 106 కమిషన్ ఏజెంట్లలో 78 మంది ఇప్పటికే బాటసింగారం మార్కెట్‌కు తరలి వెళ్లిపోయారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ నివేదించారు. దీంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితి కల్పించడం తీవ్ర దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. -
గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి సరైన నివేదికలు ఇవ్వకపోవడంతో మార్కెట్ తరలింపు వ్యవహారం క్లిష్టతరమవుతోంది. కమీషన్ ఏజెంట్లు హైకోర్టు డబుల్ బెంచ్‌ను ఆశ్రయించడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. దీంతో తరలింపు వ్యవహారం వాయిదా పడింది. మార్కెట్‌ను బాటసింగారం తరలించడానికి గత నెలరోజుల నుంచి అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. శుక్రవారం మార్కెట్ తరలింపుపై హైకోర్టులో విచారణ చేపట్టగా అధికారులు కోర్టుకు కూడా పూర్తి స్థాయి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ నెల 4వ తేదీ సోమ వారం వరకు మార్కెట్లో యథాతథస్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. చదవండి: దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్: నాడు అలా, నేడు ఇలా! కోహెడలోనే సౌకర్యాలు కల్పించండి బాటసింగారంలో సౌకర్యాలు లేవు. స్థలం కూడా సరిపోయే పరిస్థితి లేదని, కోహెడలోనే తమకు స్థలాలు కేటాయించి పూర్తి స్థాయిలో వసతులు కలి్పంచాలని కమీషన్ ఏజెంట్ల ప్రతినిధి సయ్యద్ అఫ్సర్ డిమాండ్ చేశారు. మార్కెట్ తరలింపును ఆరు వారాలు వాయిదా వేయాలని ఆయన కోరారు. -
నేటితో మూతపడనున్న గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్
-
23లోగా తరలి వెళ్లాల్సిందే!.. ఎలా వెళ్లాలి?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 23వ తేదీ వరకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేసేందుకు మార్కెటింగ్ శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పద్మహర్ష నేతృత్వంలో కమీషన్ ఏజెంట్ల సమావేశం ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్ పరిధిలో నిర్వహించారు. సమావేశంలో పద్మహర్ష మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం ప్రకారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మార్కెట్ తరలింపు అనివార్యంగా మారిందన్నారు. ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు బదలాయిస్తూ..తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కోహెడలో మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేంతవరకు తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కులో ప్రస్తుత మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వర్తించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించిందన్నారు. బాటసింగారంలో ఉన్న 11 ఎకరాల్లో రైతులకు, వ్యాపారులకు కోసం తగిన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 23 లోపు మార్కెట్ స్థలాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అప్పగించాల్సి ఉందన్నారు. సౌకర్యాలు లేకుండా ఎలా వెళ్లాలి? రెండు వారాల్లో మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని మార్కెటింగ్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొవాలని కమీషన్ ఏజెంట్లు, అన్ని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కోహెడలో పక్కా నిర్మాణాలు చేస్తే ఎప్పుడైనా వెళ్లాడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు తరలింపును ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని, తరలింపు వ్యవహారం కోర్టు ఆ«దీనంలో ఉండడంతో తాము ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం సమావేశంలో చెప్పలేమని, ఇలా చేస్తే కోర్టు నియమాలకు విరుద్ధంగా ఉంటుందన్నారు. బాటసింగారం లాజిస్టిక్ పార్కు స్థలంలో కేవలం ఒకే ఒక్క షెడ్డు నిరి్మంచారని, ఇది వందల మంది రైతులకు ఎలా సరిపోతుందని ప్రశి్నంచారు. చివరకు ఏజెంట్ల వాదోపవాదాల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. -
కమ్మని ఫలం.. కాలకూట విషం!
♦ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో కట్టలు తెంచుకున్న ‘కార్బైడ్’ ♦ మామిడి రాకతో భారీగా అక్రమ నిల్వలు ♦ కాలకూటంతోనే కదులుతోన్న ఎగుమతులు ♦ మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం ♦ అక్రమాలపై దృష్టిపెట్టని విజిలెన్స్, ఏసీబీలు సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో కార్బైడ్ కాలకూటం కట్టలు తెంచుకొంది. కమీషన్‌దారుల దుకాణాల్లో కుప్పులు తెప్పలుగా కార్బైడ్ దర్శనమిస్తోంది. ఒకటి కాదు... రెండు కాదు... దాదాపు అన్ని దుకాణాల్లో కార్బైడ్‌ను పొట్లాలు కట్టి మామిడి కాయల బాక్స్‌ల్లో పెట్టి కాయలు కృత్రిమంగా మగ్గేలా చేస్తున్నారు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా అడ్డుకొనే నాథుడే లేడు. కార్బైడ్ వినియోగంపై నిషేధం అమల్లో ఉందన్న విషయాన్ని ఇక్కడి వ్యాపారులు ఖాతరు చేయట్లేదు. మార్కెట్లోకి కార్బైడ్ రాకుండా అడ్డుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ప్రస్తుతం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ కాల కూటానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు ప్రస్తుతం అనంతపూర్, చిత్తూరు, కృష్ణా, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా నుంచి రోజుకు 200-300 వాహనాల్లో మామిడి దిగుమతవుతోంది. మార్కెట్లోకి వచ్చేవరకు మామిడి స్వచ్ఛంగానే ఉంటున్నా... ఇక్కడినుంచి బయటకు వెళ్లేసరికి విషతుల్యంగా మారిపోతున్నాయి. వేలంలో సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు మార్కెట్లో బహిరంగంగానే కార్బైడ్‌ను పొట్లాలుగా కట్టి మామిడికాయల బాక్స్‌ల్లో వేసి కాయలను మగ్గబెడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలీలను పెట్టిమరీ కార్బైడ్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసి పొట్లాలు కట్టించి మామిడి కాయల బాక్స్‌ల్లో పెడుతున్నారు. ఈ తంతు నిత్యం కమీషన్ వ్యాపారుల దుకాణాల్లో బహిరంగంగానే సాగుతున్నా ఇదేమని ? ప్రశ్నించే నాథుడే లేడు. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు అడ్డుఅదుపూ లేకుండా కార్బైడ్ కాలకూటాన్ని యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతవుతోన్న మామిడి కాలకూటంతోనే కదులుతోన్న వాస్తవాన్ని అధికారులు సైతం ఖండించలేని పచ్చి నిజం. కొనుగోళ్లు ఆపేస్తారట ! గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో కార్బైడ్ వినియోగాన్ని అడ్డుకొంటే వ్యాపారులు మామిడి కొనుగోళ్లు నిలిపివేస్తారని, అందుకే ఏమీ చేయలేకపోతున్నామని ఏకంగా మార్కెటింగ్ శాఖ అధికారులే చెబుతున్నారు. అదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోతారని, సెస్సు రూపంలో ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం అందకుండా పోయే ప్రమాదం ఉందంటూ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. కాగా ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కిందిస్థాయి అధికారులు సరిగ్గా ఇక్కడే ఉన్నతాధికారులను పక్కదోవ పట్టిస్తున్న విషయం స్పష్టమవుతోంది. మార్కెట్ కమిటీ అధికారులు గట్టి నిఘా పెడితే మార్కెట్లోకి కార్బైడ్ ఎలా వస్తుంది..? అన్న విషయాన్ని ఉన్నతాధికారులు గమనించాలి. కార్బైడ్‌కు ప్రత్యామ్నాయం ఏదీ లేదంటూ కిందిస్థాయి అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవమెంతో తెలుసుకోవాలి. దోర మామిడి ఇతర రాష్ట్రాలకు వెళ్లేలోగా పండే అవకాశం ఉన్నా.. అది అసాధ్యమంటూ వ్యాపారులకే కొందరు అధికారులు వంతపాడుతుండటం గమనార్హం. పాలకులకు పట్టదా...? ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన భాధ్యత ప్రభుత్వానిదే. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం వహిస్తే ప్రజారోగ్యంపై తీవ్ర పరిణామాలు ఎదురవ్వడం ఖాయమని వైద్యరం నిఫుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి కార్బైడ్ వినియోగం వల్ల కాయలు సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమ పక్వతను సంతరించుకుంటాయి. వీటిలో రంగు తప్ప రుచి, వాసన ఉండదు. పండ్లు నిగనిగలాడుతూ మాగినట్టు కన్పిస్తున్నా... తింటే మాత్రం పళ్లు పులిచి పోతున్నాయి.