కిలో రూ.450తో వినియోగదారులు బెంబేలు
పదేళ్ల తర్వాత ఇంత ధర చూస్తున్నామంటున్న వ్యాపారస్తులు
మధ్యప్రదేశ్‌లో సాగు విస్తీర్ణం తగ్గడమే కారణం
తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తగ్గిన దిగుమతి
సాక్షి, భీమవరం: నిత్యావసరాల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామన్యుడిని వెల్లుల్లి ‘ఘాటు’ మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. కిలో రూ.450 చేరి చుక్కలు చూపిస్తోంది. పదేళ్ల తర్వాత మళ్లీ ధర భారీగా పెరగడం చూస్తున్నామని వ్యాపారస్తులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వెల్లుల్లిని తాడేపల్లిగూడెంలోని హోల్‌సేల్ మార్కెట్‌కు తీసుకువస్తుంటారు.
ఇక్కడి నుంచే ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణాజిల్లాల్లోని రిటైల్ మార్కెట్‌లకు తరలిస్తుంటారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు గతంలో రోజుకు 125 టన్నుల నుంచి 150 టన్నుల వరకు దిగుమతులు జరిగేవి. వెల్లుల్లి పంట దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో సాగవుతుండగా రాజస్థాన్, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది ధర ఆశాజనకంగా లేక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపడంతో వెల్లుల్లి సాగు విస్తీర్ణం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఉన్నకొద్ది నిల్వలను అక్కడి వ్యాపారులు భారీ ఎత్తున స్టాకులు పెట్టడంతో కృత్రిమ కొరత ఏర్పడి కొద్దినెలలుగా ధర పెరుగుతూ వచ్చింది. సాధారణంగా వెల్లుల్లి సైజు, పాత, కొత్త రకాన్ని బట్టి పది వరకు క్వాలిటీల్లో విక్రయిస్తుంటారు. వారం పదిరోజుల క్రితం వరకు వాటి క్వాలిటీ మేరకు హోల్‌సేల్ ధర కిలో రూ.180 నుంచి రూ.380 వరకు అమ్మకాలు జరిగాయి. రిటైల్ మార్కెట్‌లోకి వచ్చేసరికి మంచి క్వాలిటీ వెల్లుల్లి కిలో రూ.450 వరకు చేరింది.
పదేళ్ల క్రితం అత్యధికంగా కిలో రూ.220 నుంచి రూ.350 వరకు చేరినట్టు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. తర్వాత అంత ఎక్కువగా ధర పెరగడం మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని చెబుతున్నారు. ధర పెరగడంతో ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌కు 25 నుంచి 50 టన్నుల లోపు సరుకు మాత్రమే వస్తున్నట్టు తెలిపారు. వారం రోజులుగా కొత్త పంట మార్కెట్‌లోకి వస్తుండటంతో నాణ్యతను బట్టి హోల్‌సేల్ ధర రూ.130 నుంచి రూ.280 వరకు ఉంది.
అయితే కొత్త పంట పాయల్లో తేమశాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరగా పాడైపోతుంటాయి. ప్రస్తుతం కొత్త పంట రాకతో ధర కొంత తగ్గడం మూన్నాళ్ల ముచ్చటేనని హోల్‌సేల్ వ్యాపారి ఒకరు తెలిపారు. రెండు మూడు నెలల తర్వాత మధ్యప్రదేశ్ నుంచి మళ్లీ ఆరబెట్టిన వెల్లుల్లి మార్కెట్‌లోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.
వినియోగదారుల బెంబేలు
మసాల కూరలు వండాలంటే వెల్లుల్లి తప్పనిసరి. నాన్‌వెజ్ వంటకాలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెల్లుల్లి వినియోగం ఎక్కువ. ఇప్పటికే పప్పుదినుసులు, నూనెలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో క్వాలిటీ వెల్లుల్లి కిలో రూ.450 ఉండటంతో గతంలో అరకిలో, కిలో చొప్పున కొనుగోలు చేసే వినియోగదారులు మరింత తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు.
కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి
ఇక, పూర్తిస్థాయిలో దిగుమతులు లేక ఉల్లి ధర దిగిరావడం లేదు. నాసిక్, షోలాపూర్ నుంచి తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్‌కు రోజుకు 150 టన్నులు ఉల్లిపాయలు వస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మండపేట, నరసాపురం తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రిటైల్ వ్యాపారులు తీసుకువెళుతుంటారు.
ప్రస్తుతం హోల్‌సేల్ ధర క్వాలిటీని బట్టి రూ.10 నుంచి రూ.35 వరకు ఉండగా రిటైల్ మార్కెట్‌లో రూ.20 నుంచి రూ.50 వరకు ఉంటోంది. గతంలో నాణ్యమైన ఉల్లి రూ.25లోపే ఉండగా ప్రస్తుతం రెట్టింపై వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment