రైతుల లోగిళ్లలో నిల్వ ఉన్న కందులు, యార్డు బయట జల్లెడ వేస్తున్న కందులు
సాక్షి, కురిచేడు : రెండేళ్లుగా కందులు రైతుల లోగిళ్లలో నిల్వ ఉన్నాయి. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిలబడినా రైతుకు మాత్ర ఫలితం దక్కలేదు. పరపతి సంఘాల్లోని అధికార పార్టీ నాయకులు సీరియల్‌లో ఉన్న తమకు మొండిచేయి చూపి వారి అనుయాయులకు ప్రాధాన్యమిచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. కందుల కేంద్రంలో కాకుండా బయట కూడా కాటా వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురిచేడు మండలంలోని కురిచేడు, ఎన్.ఎస్.పి.అగ్రహారం సహకార పరపతి సంఘాల పరిధిలోని కందుల కొనుగోలు కేంద్రాలకు టార్గెట్లు పూర్తయ్యాయంటూ మార్క్‌ఫెడ్ వారు ఏప్రిల్ 30 నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు.
పడమర వీరాయపాలెం కొనుగోలు కేంద్రం ఒక్కటి మాత్రమే నిర్వహణలో ఉంది. దీంతో కందుల నిల్వలు ఉన్న రైతులంతా కలిసి కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖామంత్రి శిద్దా రాఘవరావు ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కానీ ఇంతవరకు అనుమతి రాకపోవటంతో కేంద్రాలు నిలిచిపోయి ఉన్నాయి. కానీ గడచిన సోమ, మంగళవారాలలో మార్కెట్ యార్డు పక్కన వున్న శ్రీనివాసనగర్‌లో ఓ రైతు ఇంటి వద్ద కందులు కొనుగోలు జరుగుతుండటంతో కలకలం రేగింది. కొందరు రైతులు వాటిని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో గుట్టు రట్టయింది.
అసలేం జరిగిందంటే..!
కందుల కొనుగోలు కోసం కేంద్రాలు ప్రారంభించే ముందు ప్రభుత్వం అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించింది. కానీ అధికారులు మెట్ట భూముల్లో ఎకరానికి నాలుగు క్వింటాల్లు, మాగాణి భూములలో ఎకరానికి 7 క్వింటాళ్ల ప్రకారం దిగుబడి వస్తుందని ప్రభుత్వానికి తెలిపారు. ప్రభుత్వం అందులో సగం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి మెట్ట భూముల రైతులు నీరు అందుబాటులో ఉన్నంత వరకు ఎన్నో వ్యవ ప్రయాసలకు ఓర్చి మూడు కిలోమీటర్ల వరకు నీరు పెట్టి ఎకరానికి 7 క్వింటాళ్ల వరకు పండించారు. మాగాణి భూముల్లో 12 క్వింటాళ్ల వరకు పండించారు. దీంతో రైతుల వద్ద కందులు ఇబ్బడి ముబ్బడిగా మిగిలిపోయాయి. మిగిలిన కందులను ఏంచేయాలో అర్థంకాక, కొనుగోలు కేంద్రాల్లో కొనక, బయట తక్కువకు అడుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
3500 టన్నులు కొనుగోలు చేశారు..
ఇప్పటి వరకు కురిచేడు కొనుగోలు కేంద్రం ద్వారా 3500 టన్నులు కందులు కొనుగోలు చేశారు. మరో 750 టన్నులకు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్.ఎస్.పి. అగ్రహారం కొనుగోలు కేంద్రం పరిధిలో 1800 టన్నులు కొనుగోలు చేశారు. మరో 1300 టన్నుల కొనుగోలుకు అనుమతి కావాలని కోరుతున్నారు. పడమర వీరాయపాలెం కొనుగోలు కేంద్రం పరిధిలో 650 టన్నులకు అనుమతి ఇచ్చారు. కొనుగోలు జరుగుతుంది. ఈ నెల 15 వరకు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖలు రాయటం జరిగింది. –జోత్స్నదేవి, కురిచేడు, ఏఓ
రెండు నెలల తర్వాత వెనక్కు పంపారు
మార్చి నెలలో 13వ తేదీ కందుల కొనుగోలుకు సీరియల్ ఇచ్చారు.కాని రెండు నెలల పాటు కాగితాలు వారి వద్ద ఉంచుకుని తిరిగి ఇప్పడు ఇచ్చారు. యార్డు మూసి వేసిన తరువాత అనుమతి కోసమంటూ మరలా కాగితాలు తీసుకుని అనుమతి వస్తుందని తెలిశాక వెనక్కు ఇచ్చారు. సమాధానం కూడా చెప్పలేదు. అధికార పార్టీ నాయకుల కందులు యార్డులో కాకుండా బయట కొంటున్నారు.– ఇందూరి సుబ్బారెడ్డి, రైతు, కురిచేడు
ప్రభుత్వం కొనలేదు, బయట అమ్ముకోనీయలేదు
ప్రభుత్వం అన్ని కందులు మేమే కొంటామని చెప్పి మోసం చేసింది. బయట అమ్ముకోనీయ కుండా చేసి చివరకు వాళ్లు కూడా కొనలేదు. నిరుడు కందులు కూడా ఉన్నాయి. రెండేళ్ల కందులు ఏమి చేసుకోవాలో అర్థం కావటం లేదు.అప్పులు పెరిగిపోయాయి.– పెనుగొండ రామిరెడ్డి, రైతు, కురిచేడు
Comments
Please login to add a commentAdd a comment