కర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధరతో కందులు, శనగలు కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయనున్న కేంద్రాలు ‘తమ్ముళ్ల’ చేతుల్లోకి వెళ్లనున్నాయి. కరువుతో అల్లాడుతున్న అన్నదాతను ఆదుకోవాలనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని రాష్ట్ర అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మార్క్‌ఫెడ్ కందులు, శనగల కొనుగోలు ప్రక్రియను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఇవ్వడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కొనుగోలు కేంద్రాలను అప్పగించడం వల్ల అధికార పార్టీ నేతల సిపార్స్‌లు ఉన్నవారికి చెందిన రైతుల దిగుబడులనే కొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కందుల కొనుగోలు కేంద్రాలు ఇవే..: కందులకు మార్కెట్లలో రూ.4,000 వరకు ధర ఉండగా ఈ నెల 16 నుంచి రూ.5,450 మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు కృష్ణగిరి, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, బేతంచెర్ల, పత్తికొండలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బేతంచెర్ల, నంద్యాల, ఆత్మకూరులో సోమవారం నుంచే రైతులకు టోకెన్‌లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కాగా మిగిలిన కేంద్రాల్లో బుధవారం నుంచి టోకెన్‌లు ఇవ్వనున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి, వెల్దుర్తి కేంద్రాలు డీఆర్‌డీఏ–వెలుగు ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు; బేతంచెర్ల కేంద్రాన్ని ఆగ్రోస్, మిగిలిన కేంద్రాలను డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నడుస్తాయి.
శనగల కొనుగోలు కేంద్రాలు..
శనగలకు మార్కెట్‌లో రూ.3000 నుంచి రూ.3,800 వరకు ఉండగా ప్రభుత్వం ఈ నెల 21 నుంచి రూ.4,400 మద్దతు ధరతో కొనుగోలు చేయనుంది. అందుకు జిల్లా వ్యాప్తంగా 25 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. కర్నూలు, కోడుమూరు, డోన్, బేతంచెర్ల, నందికొట్కూరు, మిడుతూరు, ఆత్మకూరు, నంద్యాల, బనగానపల్లి, ఆళ్లగడ్డ, గుండుపాపల, గోస్పాడు, కోవెలకుంట్ల, దొర్నిపాడు, ఉయ్యలవాడ, సంజామల, కొలిమిగుండ్ల, అవుకు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆస్పరి, హొలగొంద, పత్తికొండ, మద్దికెరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొలిమిగుండ్ల, బేతంచెర్ల, అవుకు కేంద్రాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, గుండుపాపల, ఉయ్యలవాడ, సంజామల కేంద్రాలను పీఏసీఎస్‌లకు, ఎమ్మిగనూరు, దొర్నిపాడు కేంద్రాలను ఆగ్రోస్‌కు, మిడుతూరును గ్రామైక్య సంఘానికి మార్క్‌ఫెడ్ అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment