సాయం చేయండి.. గట్టెక్కుతాం!
♦ సెంట్రల్ పూల్ నుంచి రూ. 212 కోట్లు అడిగిన మార్క్‌ఫెడ్
♦ అధికారుల నిర్వాకంతో మొక్కజొన్న లావాదేవీల్లో రూ. 220 కోట్ల నష్టం
♦ రూ. 20 కోట్ల మేర పేరుకు పోయిన ఎరువుల బకాయిలు
సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న కొనుగోలు, ఎరువుల లావాదేవీల్లో అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ మార్క్‌ఫెడ్‌ను నష్టాల్లోకి నెట్టింది. 2013-14కు సంబంధించి సకాలంలో మొక్కజొన్నను వేలం వేయకపోవడంతో రూ. 220 కోట్ల మేర నష్టం వాటిల్లింది. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. మార్క్‌ఫెడ్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు నష్టాలకు బాధ్యులను తేల్చేందుకు విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది. 2013-14కు సంబంధించి రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ రైతుల వద్ద నుంచి 2.7 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను సేకరించింది. కొనుగోలు, ఇతర చార్జీలను కలుపుకుని క్వింటాలుకు రూ. 1,570 మేర మార్క్‌ఫెడ్ ఖర్చు చేసింది. అయితే సేకరించిన ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాల్సి ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీనికితోడు గోదాములు సరిగా లేక మొక్కజొన్న బూజుపట్టి కుళ్లిపోయింది.
దీంతో క్వింటాలుకు రూ. 915 మేర తిరిగి రాగా.. మార్క్‌ఫెడ్‌కు రూ. 220 కోట్ల మేర నష్టం వాటిల్లింది. నష్టాలకు బాధ్యులను తేల్చేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో పాటు.. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో 2014-15కు సంబంధించి 4.32 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేసి.. క్వింటాలుకు రూ. 1,450 నుంచి రూ. 1,600 చొప్పున పొరుగు రాష్ట్రాలకు విక్రయించింది. మరోవైపు 2013-14లో వాటిల్లిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ‘సెంట్రల్ పూల్’ నిధుల నుంచి నిబంధనల మేరకు రూ. 212 కోట్లు మార్క్‌ఫెడ్‌కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరింది.
ఎరువుల బకాయిలదీ ఇదే తంతు
2013-14లో మార్క్‌ఫెడ్ ద్వారా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంఘాలు, ఇతర సంస్థలకు సరఫరా చేశారు. అయితే విక్రయాలు పూర్తయినా రూ.155 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. మార్క్‌ఫెడ్ ఇటీవల సహకార సంఘాలపై ఒత్తిడి తెచ్చి రూ.135 కోట్ల బకాయిలు వసూలు చేసింది.
నష్టాలను పూడ్చుతాం
గత ఏడాది ఏప్రిల్ నాటికి మార్క్‌ఫెడ్ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 2013-14లో మొక్కజొన్న లావాదేవీల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. ఎరువుల బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాం. సెంట్రల్ పూల్ నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. బ్యాంకు రుణాలు చెల్లించడం ద్వారా మార్క్‌ఫెడ్ ప్రతిష్టను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. -డాక్టర్ శరత్, ఎండీ, మార్క్‌ఫెడ్