న్యూఢిల్లీ: డీఏపీ తదితర యూరియాయేతర ఎరువుల గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ)ని పెంచవద్దని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఎరువుల కంపెనీలను ఆదేశించింది. వాటిని పాత రేట్లకే అమ్మాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా యూరీయాయేతర ఎరువుల రేట్లను పెంచడంపై కేంద్రం ఈ మేరకు ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ(డై అమ్మోనియం ఫాస్పేట్), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ), ఎన్‌పీకే తదితర నాన్ యూరియా ఎరువుల రిటెయిల్ ధరల నిర్ధారణను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయా ఫర్టిలైజర్ కంపెనీలే ఆ ధరలను నిర్ధారిస్తాయి.
అయితే, ప్రభుత్వం ఏటా వాటికి నిర్ధారిత మొత్తంలో సబ్సీడీ ఇస్తుంది. ‘ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకే ఎరువుల ధరలను పెంచవద్దని ఫర్టిలైజర్ కంపెనీలకు సూచించింది. గతంలో ఉన్న రేట్లకే వీటిని విక్రయించాలని స్పష్టం చేసింది. దానికి ఆ కంపెనీలు అంగీకరించాయి’ అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. రైతులకు పాత ధరలకే ఆ ఎరువులు లభిస్తాయన్నారు. అంతర్జాతీయంగా ఎరువుల ముడి సరకుల ధర భారీగా పెరగడంతో ఇటీవల ఈ ఎరువుల ధరలను పెంచుతూ ఫర్టిలైజర్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి క్రిభ్కో, ఎంసీఎఫ్‌ఎల్, జువారీ అగ్రో కెమికల్స్, పారాదీప్ ఫాస్పేట్స్ సంస్థలు డీఏపీ చిల్లర ధరను బ్యాగ్‌కు రూ. 17 వందలకు పెంచాయి.
2021–22 ఆర్థిక సంవత్సరానికి పాస్ఫరస్, పొటాషియం ఎరువుల ధరలకు ఇచ్చే సబ్సీడీలో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. గత సంవత్సరం నైట్రోజన్(ఎన్)కు కేజీకి రూ. 18.78 చొప్పున, ఫాస్పేట్(పీ)కు కేజీకి రూ. 14.88 చొప్పున, పొటాష్(కే)కు రూ. 10.11 చొప్పున, సల్ఫర్‌కు రూ. 2.37 చొప్పున సబ్సిడీని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment