‘బ్రాండ్‌’ మోత తగ్గిపోయింది | Future Group Out Of The League Pool For IPL 2020 | Sakshi
Sakshi News home page

‘బ్రాండ్‌’ మోత తగ్గిపోయింది

Published Tue, Aug 25 2020 2:38 AM | Last Updated on Sat, Sep 19 2020 3:49 PM

Future Group Out Of The League Pool For IPL 2020 - Sakshi

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి ‘వివో’ తప్పుకోవడంలో భారత్‌–చైనా సంబంధాలు కీలక పాత్ర పోషించాయనేది బయటకు కనిపిస్తోంది. అయితే ఒకవేళ అది కారణం కాకుండా ఉంటే... ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఏడాదికి ‘వివో’ రూ. 440 కోట్లు చెల్లించేదా లేక దానిని తగ్గించమని బీసీసీఐని కోరేదా అనేది కూడా చర్చనీయాంశం. ఎందుకంటే రూ. 222 కోట్లు మాత్రమే ఇచ్చి డ్రీమ్‌ ఎలెవన్‌ ఇప్పుడు ఐపీఎల్‌తో జత కట్టడం చూస్తే ఆర్థికపరంగా పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఇది టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌కే పరిమితం కాలేదని ఫ్రాంచైజీలు కూడా తక్కువ మొత్తాలకే హక్కులు ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. –సాక్షి క్రీడా విభాగం

ఢిల్లీ క్యాపిటల్స్‌ (గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌) జట్టుకు 2015 నుంచి జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఎయిర్‌ కండిషనర్‌ కంపెనీ ‘డైకిన్‌’ స్పాన్సర్‌గా ఉంటూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఢిల్లీ జట్టుతో తమ అనుబంధం కొనసాగుతుందని వారు ప్రకటించారు. ఇంతలో కరోనా వచ్చి ప్రపంచాన్ని కుమ్మేసింది. గత వారం ‘డైకిన్‌’ తాము ఐపీఎల్‌ టీమ్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రిన్సిపల్‌ స్పాన్సర్‌గా ‘డైకిన్‌’ చాలా తక్కువ మొత్తం ఇవ్వజూపిందని, దానికి ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం అంగీకరించలేదని తెలిసింది.  

సొంత కంపెనీ పేరుతోనే... 
‘డైకిన్‌’ తప్పుకున్న తర్వాత ఇంత తక్కువ వ్యవధిలో మరో స్పాన్సర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ వెతుక్కునే ప్రయత్నం చేయలేదు. పైగా ఇతర కంపెనీలు కూడా చాలా తక్కువ మొత్తాలనే ఆఫర్‌ చేశాయనేది మార్కెట్‌ వర్గాల సమాచారం. దాంతో ఈ టీమ్‌ యజమానుల్లో ఒకరైన ‘జిందాల్‌ గ్రూప్‌’ తమ జేఎస్‌డబ్ల్యూ పేరుతోనే ఢిల్లీ టీమ్‌ జెర్సీ ముందు భాగంలో కనిపించేలా ప్రిన్సిపల్‌ స్పాన్సర్‌గా ఉండేందుకు సిద్ధమైంది. జీఎంఆర్‌ గ్రూప్‌ ఈ టీమ్‌కు మరో యజమాని. స్పాన్సర్లకు భారీ డిస్కౌంట్‌లు ఇచ్చి ఆకట్టుకోవడం తమకు కష్టంగా మారిందని, దానికంటే తమ కంపెనీకే ప్రచారం వచ్చేలా సిద్ధపడటం మంచిదని భావించినట్లు జిందాల్‌ గ్రూప్‌ ఎండీ పార్థ్‌ జిందాల్‌ వెల్లడించారు. క్యాపిటల్స్‌ సహ యజమానుల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో, బయటి స్పాన్సర్‌ తరహాలోనే జేఎస్‌డబ్ల్యూ కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందో ఎవరికీ తెలియని అంతర్గత వ్యవహారం కానీ... ఒక ఐపీఎల్‌ టీమ్‌కు స్పాన్సర్‌ చేయడంలో కంపెనీలు వెనకడుగు వేయడం మాత్రం అనూహ్యమే.  

తప్పనిసరి పరిస్థితుల్లోనే... 
లీగ్‌లో పాల్గొంటున్న జట్లకు ఐపీఎల్‌ కాకుండా సాధారణంగా ఇతర వ్యాపార వ్యవహారాలు దాదాపు అందరికీ ఉంటాయి. అయినా సరే లీగ్‌ సమయంలో ప్రతీ జట్టు తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకోవాలని ప్రయత్నించదు. భారీ మొత్తానికి ప్రిన్సిపల్, ఇతర  స్పాన్సర్‌షిప్‌ హక్కులు అమ్మి లీగ్‌లో ఖర్చు పెట్టాల్సిన డబ్బును లీగ్‌ ద్వారానే సంపాదించే ప్రయత్నం చేస్తుంది. ‘ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఒక్క ఐపీఎల్‌ సీజన్‌లో కూడా తమ సొంత బ్రాండ్‌ను ప్రధాన స్పాన్సర్‌గా ప్రదర్శించలేదు. చివరకు ‘జియో’ వచ్చిన సమయంలో కూడా సహ భాగస్వామిగా ఇతర జట్లకు ఉన్నారే తప్ప తమ టీమ్‌కు మాత్రం దానిని వాడుకోలేదు. తమ టీమ్‌ విలువను చూపించి స్పాన్సర్లను ఆకర్షించిన విషయం మరచిపోవద్దు. అదే నిజమైన వ్యాపార వ్యూహం. కాబట్టి స్పాన్సర్‌షిప్‌కు కంపెనీలు వెనక్కి తగ్గడం, సొంత బ్రాండ్‌ను పెట్టుకోవాల్సి రావడం అంటే అది వైఫల్యం కిందనే లెక్క’ అని ప్రకటనల రంగ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు.

అదీ కారణం...
కరోనా సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు వారు ఆశించే విధంగా తగినంత ప్రచారం ఈసారి  దక్కే అవకాశం లేకపోవడం కూడా ముందుకు రాకపోవడానికి కారణమైంది. దేశ రాజధాని కేంద్రంగా ఉన్న జట్టుకు మంచి ప్రచారం లభించడం ఖాయం. జట్టు వరుసగా విఫలమవుతున్నా (ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరని జట్టు ఢిల్లీ ఒక్కటే) ఢిల్లీకి స్పాన్సర్ల కొదవ లేకపోవడానికి అదే కారణం. సాధారణంగా టీమ్‌ స్పాన్సర్‌ పేరు స్టేడియం అంతగా ప్రదర్శితమవుతుంది. లీగ్‌ సమయంలో కనీసం 2–3 ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. పెద్ద ఆటగాళ్లు వస్తారు. అభిమానులతో ముచ్చటించే కార్యక్రమాలూ ఎలాగూ ఉంటాయి. స్పాన్సర్‌ పేరు ఉండే మర్కండైజ్‌ ద్వారా అదనపు ఆదాయం వస్తుంది.

కరోనా కారణంగా యూఏఈకి తరలి పోవడంతో వీటన్నింటిపై ప్రభావం పడింది. అక్కడ ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు కానీ జనం లేకపోతే బ్రాండ్లపై ఎవరి కనీస దృష్టి కూడా పడదు. టీవీలో మ్యాచ్‌ల ప్రసారం వల్ల నేరుగా టీమ్‌ స్పాన్సర్లకు పెద్దగా లాభం ఉండదు. ఇప్పుడు ఐపీఎల్‌ సెంట్రల్‌ పూల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి ప్రముఖ సంస్థ ‘ఫ్యూచర్‌ గ్రూప్‌’ కూడా తప్పుకుంది. బిగ్‌ బజార్, ఫుడ్‌ బజార్‌ తదితర బ్రాండింగ్‌లు ఉన్న ఈ సంస్థ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఐపీఎల్‌ సీజన్‌కు రూ. 40 కోట్లు చెల్లించడం భారంగా భావిస్తోంది. ప్రచారం కోసం అంత మొత్తం పెట్టడం అనవసరమని ఫ్యూచర్‌ గ్రూప్‌ నిర్ణయించుకుంది.

బయటకు వివరంగా చెప్పకపోయినా ప్రతీ ఫ్రాంచైజీ కూడా గతంతో పోలిస్తే తక్కువ మొత్తాలకే స్పాన్సర్‌షిప్‌ హక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తాము డిమాండ్‌ చేసే స్థితిలో లేమని, ఎవరూ ముందుకు రాలేదని అనిపించుకోవడం కన్నా ఏదో ఒక సంస్థతో జట్టు కట్టడమే మేలని వారు భావించినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇప్పుడు ఐపీఎల్‌ జరగడమే గొప్ప. మేం అస్సలు లాభ నష్టాల గురించి ఆలోచించడం లేదు. ప్రపంచం అంతా ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. రూపాయి లాభం రాకున్నా వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోతే చాలు’ అని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చైర్మన్‌ సంజీవ్‌ సురివాలా చెప్పడం మొత్తం ఐపీఎల్‌ పరిస్థితిని చూపిస్తోంది. వారు చెప్పినట్లు ఇవన్నీ అధిగమించి లీగ్‌లో విజయంపైనే టీమ్‌లు దృష్టి పెడతాయనేది వాస్తవం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement