Future group
-
కొనుగోలు చేసేవాళ్లే లేరా.. మూసివేత దిశగా బిగ్‌బజార్?
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్ఆర్ఎల్) కొనుగోలు చేసేందుకు సరైన కొనుగోలుదారుపై రుణదాతలు ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో సంస్థ మూసివేత దిశగా చర్యలు ప్రారంభం కానున్నాయి. సంస్థ లిక్విడేషన్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ముంబై బెంచ్)లో పరిష్కార నిపుణుడు (ఆర్పీ) దరఖాస్తు సమర్పించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఎఫ్ఆర్ఎల్ తెలియజేసింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఎఫ్ఆర్ఎల్కు రూ. 30,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉంది. సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు 2020లో రిలయన్స్ రిటైల్ ప్రతిపాదించినప్పటికీ .. అమెజాన్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా రుణదాతలు దాన్ని తిరస్కరించారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌పై 2022 జులై 20 నుంచి దివాలా ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ప్రారంభమయ్యాయి. పరిష్కార చర్యలకు గడువును ఎన్సీఎల్టీ నాలుగు సార్లు పొడిగించినప్పటికీ తగిన పరిష్కారం లభించలేదు. చివరి సారిగా నిర్దేశిత గడువులోగా స్పేస్ మంత్ర రూ. 550 కోట్లకు బిడ్ వేసినప్పటికీ రుణదాతల కమిటీలో (సీవోసీ) దానికి తగినంత స్థాయిలో మద్దతు లభించలేదు. దీంతో ఎఫ్ఆర్ఎల్ లిక్విడేషన్ బాట పట్టనుంది. -
ఫ్యూచర్ ఫోరెన్సిక్ ఆడిట్‌పై కోర్టుకు బియానీ
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) ఫోరెన్సిక్ ఆడిట్ ప్రక్రియపై సంస్థ డైరెక్టర్ కిశోర్ బియానీ తాజాగా బోంబే హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బీడీవో ఇండియా ఆగస్టు 9న సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుతో పాటు మొత్తం ఆడిట్ ప్రక్రియను సవాలు చేస్తూ ఆయన రిట్ పిటీషన్ దాఖలు చేసినట్లు కంపెనీ తెలిపింది. వివరాల్లోకి వెడితే.. గతేడాది జూలై 20న ఎఫ్‌ఆర్‌ఎల్‌పై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి ముగియాలి. ఇందులో భాగంగా కంపెనీ ఖాతాలను ప్రధాన రుణదాత బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) తరఫున బీడీవో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. దీనిపై తమ సమాధానాలు తెలపాల్సిందిగా కిషోర్ బియానీ, ఆయన సోదరుడు రాకేష్ బియానీకి బీవోఐ సూచించింది. -
కిశోర్ బియానీకి సెబీ జరిమానా
న్యూఢిల్లీ: సెబీ తాజాగా ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన సంస్థలు, వ్యక్తులకు విడిగా రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించింది. వీటిని 45 రోజుల్లోగా చెల్లించాలంటూ ఆదేశించింది. కిశోర్ బియానీ, ఫ్యూచర్ కార్పొరేట్ రీసోర్సెస్(ఎఫ్‌సీఆర్‌ఎల్)సహా 14 సంస్థ లు, వ్యక్తులపై సెబీ జరిమానా విధించింది. ప్రాగ్జిస్ హోమ్ రిటైల్‌లో ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా పెరిగిన నేపథ్యంలో వాటాదారుల(పబ్లిక్)కు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంది. అయితే ప్రాగ్జిస్ హోమ్ రిటైల్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించకపోవడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. తప్పనిసరిగా మార్పిడయ్యే 3,180 డిబెంచర్ల(సీసీడీలు)ను ఈక్విటీగా మార్చడంతో 2020 ఫిబ్రవరి 11కల్లా ప్రాగ్జిస్లో ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా 5.71 శాతం పెరిగింది. తద్వారా ప్రాగ్జిస్ ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా 47.43% నుంచి 53.13 శాతానికి బలపడింది. అయితే ఎస్‌ఏఎస్‌టీ నిబంధనల ప్రకారం ఇప్పటివరకూ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించకపోవడంతో సంబంధిత 15 సంస్థలు, వ్యక్తులకు సెబీ జరిమానా విధించింది. -
ఫ్యూచర్ గ్రూప్ ఎవరిదో.. రేసులో రిలయన్స్, అదానీ సంస్థలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఉన్న ఫ్యూచర్ రిటైల్‌ను సొంతం చేసుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది. రేసులో రిలయన్స్, అదానీ, జిందాల్ తదితర పలు గ్రూప్‌లు, సంస్థలు పోటీపడుతున్నాయి. వెరసి కంపెనీ ఆస్తుల కొనుగోలుకి ఆసక్తిని వ్యక్తం చేస్తూ(ఈవోఐ) 49 బిడ్స్ దాఖలయ్యాయి. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియలో భాగమైన ఫ్యూచర్ రిటైల్ ఆస్తులను ఐదు క్లస్టర్స్‌గా విడదీశాక రుణదాతలు ఈవోఐ బిడ్స్‌కు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. -
'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ..కొండంత అప్పును మంచులా కరిగించేసింది..కానీ!
బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విఫలమైంది.సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కేఫె కాఫీ డే సంస్థ తెలిపింది. వీటిలో ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్ తదితర అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీలున్నట్లు పేర్కొంది. అయితే భర్త వీజీ సిద్ధార్థ మరణంతో కొండలా పేరుకు పోయినా అప్పును మాళవిక హెగ్డే మంచులా కరిగించేశారు.కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కెఫె కాఫీ డే ఆర్ధిక వ్యవహారాలు బిజినెస్ వరల్డ్‌లో హాట్ టాపిగ్గా మారాయి. ఎందుకంటే? మాళవిక హెగ్డే మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. భర్త మరణంతో వెలుగులోకి 2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కొండంత అప్పును మంచులా కరిగించేసింది కేఫె కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కెఫె కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా! -
ఫ్యూచర్‌కు ఎదురు దెబ్బ.. ఈసారి లైఫ్ స్టయిల్ ఫ్యాషన్స్ రూపంలో
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూపు కంపెనీ అయిన ఫ్యూచర్ లైఫ్ స్టయిల్ ఫ్యాషన్స్ జూన్ త్రైమాసికానికి రూ.1,880 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ నష్టం కేలం రూ.149 కోట్లుగానే ఉంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.831కోట్ల నుంచి రూ.607 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ.1,438 కోట్లకు పెరిగాయి. విక్రయాలు తగ్గడం, రుణాల ఖర్చులు, ఆస్తుల విలువ తగ్గిపోవడం, కొన్ని రకాల కేటాయింపులు భారీ నష్టాలకు కారణమని సంస్థ తెలిపింది. ఈ సంస్థ నిర్వహణలోని 34 సెంట్రల్ స్టోర్లు, 78 బ్రాండ్ ఫ్యాక్టరీ దుకాణాలు మూతపడినట్టు ప్రకటించింది. -
'తప్పంతా మీదే' ఫ్యూచర్‌పై అమెజాన్ ఆగ్రహం!
న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ రిటైల్ స్వతంత్ర డైరెక్టర్లు తమ చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఇది దేశంలోని కార్పొరేట్ పాలనకుగల బాధ్యత, పారదర్శకత, నిజాయితీలపై పలు ప్రశ్నలకు తావిస్తున్నదని వ్యాఖ్యానించింది. కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌కు రాసిన లేఖలో అమెజాన్ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ బిజినెస్‌ను రిలయన్స్‌కు బదిలీ చేసేందుకు ప్రయత్నించడంలో ఫ్యూచర్ గ్రూప్ న్యాయపరమైన ఆదేశాల ఉల్లంఘనకు తెరతీసిందంటూ ఆరోపించింది. 2020 ఆగస్ట్‌లో ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌తో రూ. 24,713 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాలతో కలిపి 19 కంపెనీలను విక్రయించేందుకు డీల్ కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందానికి విరుద్ధంగా అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అంతేకాకుండా అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ వివాదం సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఎన్సీఎల్టీ తదితరాలచెంతకు చేరడంతో సెక్యూర్డ్ రుణదాతలు డీల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఒప్పందానికి చెక్ పడింది. -
వడ్డీలు కట్టలేక చేతులెత్తేసిన ‘ఫ్యూచర్’!
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ తాజాగా రూ. 6.07 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. కంపెనీ గతంలో జారీ చేసిన మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు)పై ఈ నెల 20కల్లా వడ్డీ చెల్లించవలసి ఉన్నట్లు తెలియజేసింది. అయితే ప్రతికూల పరిస్థితులతో వీటిపై వడ్డీ చెల్లించలేకపోయినట్లు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రూ. 120 కోట్ల విలువైన సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. ఈ సెక్యూర్డ్ డిబెంచర్లను వార్షికంగా 10.15 శాతం కూపన్ రేటుతో జారీ చేసింది. కాగా.. ఈ నెల మొదట్లోనూ రూ. 29 కోట్ల విలువైన ఎన్‌సీడీలపై రూ. 1.41 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో కంపెనీ విఫలంకావడం గమనార్హం! -
ఫ్యూచర్‌కు మరో ఎదురు దెబ్బ.. ఈసారి వడ్డీ రూపంలో
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఈఎల్) తాజాగా రూ. 23 కోట్ల నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి రూ. 1.06 కోట్ల వడ్డీని చెల్లించడంలో విఫలమైనట్లు తెలిపింది. మే 17న దీన్ని చెల్లించాల్సినట్లు పేర్కొంది గత మూడు నెలల్లో ఫ్యూచర్ గ్రూప్ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి బ్యాంకులకు రూ. 2,836 కోట్ల చెల్లింపులో కూడా విఫలమైనట్లు ఎఫ్ఈఎల్ గత నెల స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఫ్యూచర్ గ్రూప్‌లోని 19 సంస్థలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేయడానికి రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ డీల్ సాకారం కాలేదు. -
అప్పుల ఊబి, వాటల విక్రయం..ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌కు వేల కోట్లు!
న్యూఢిల్లీ: రుణ ఊబిలో ఉన్న ఫ్యూచర్ గ్రూపు కంపెనీ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ దివాలా ప్రక్రియ బారిన పడకుండా చర్యల మార్గం పట్టింది. ఫ్యూచర్ జనరాలి ఇన్సూరెన్స్ కంపెనీల్లో తనకున్న వాటాలను విక్రయించడం ద్వారా రూ.3,000 కోట్లను సమకూర్చుకోనుంది. ఈ నిధులతో రుణభారం తగ్గించుకోవాలన్నది కంపెనీ వ్యూహం. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ అన్నది ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, జనరాలి భాగస్వామ్య సంస్థ. ఇది సాధారణ బీమా సంస్థ. ఇందులో తనకున్న వాటాలో 25 శాతాన్ని భాగస్వామి జనరాలికి రూ.1,266 కోట్లను విక్రయించినట్టు గత వారమే ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. ఈ లావాదేవీ తర్వాత కూడా ఫ్యూచర్ జనరాలిలో ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్‌కు 24.91 శాతం వాటా మిగిలే ఉంది. వచ్చే 30–40 రోజుల్లో మిగిలిన 25 శాతం వాటా విక్రయంతో రూ.1,250 కోట్లు లభిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఉన్న 33.3 శాతం వాటాను సైతం విక్రయించనుంది. దీని ద్వారా మరో రూ.400 కోట్ల వరకు రానున్నాయి. ఈ మూడు లావాదేవీలతో మొత్తం రూ.2,950 కోట్ల వరకు సమకూరతాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి చెల్లించాల్సిన రూ. 2,911 కోట్ల రుణాల విషయంలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ డిఫాల్ట్ అయింది. దీనికి అదనంగా 30 రోజుల సమీక్ష కాలంలోనూ చెల్లించలేకపోయింది. -
Future Group: 'ఫ్యూచర్'కు మంచి ఫ్యూచర్ ఉంది!
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ తిరిగి నిలదొక్కుకోవడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రూప్ కంపెనీలు ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్, సప్లై చైన్ సొల్యూషన్స్, కన్జూమర్ అండ్ ఎంటర్ప్రైజెస్ తిరిగి పట్టాలెక్కేందుకు వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫ్యూచర్ గ్రూప్‌తో రిలయన్స్ రిటైల్ కుదుర్చుకున్న రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని సెక్యూర్డ్ రుణదాతలు తిరస్కరించిన నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(ఎఫ్ఆర్ఎల్) దాదాపు రూ. 18,000 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉంది. దివాలా చట్ట చర్యలను ఎదుర్కోబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అయితే ఇతర కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్(ఎఫ్ఈఎల్), ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్(ఎఫ్ఎల్ఈఎల్), ఫ్యూచ ర్ సప్లై చైన్ సొల్యూషన్స్(ఎఫ్ఎస్సీఎస్ఎల్), ఫ్యూచర్ కన్జూమర్ (ఎఫ్‌సీఎల్) తమ సొంత ఆస్తుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పునరుజ్జీవనం పొందే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పునరుత్తేజం ఇలా సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఎఫ్ఈఎల్కు రూ. 5,000 కోట్ల రుణభారముంది. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ బిజినెస్‌లో వాటాను విక్రయిస్తోంది. రూ. 3,000 కోట్లవరకూ లభించనున్నాయి. దీంతో రుణ భారం భారీగా తగ్గనుంది. ఇక కర్ణాటకలోని తుమ్కూర్లో 110 ఎకరాల ఫుడ్ పార్క్‌ను ఎఫ్ఎంసీజీ కంపెనీ ఎఫ్‌సీఎల్ కలిగి ఉంది. ఇది కంపెనీ పునరి్నర్మాణానికి వినియోగపడనుంది. దేశవ్యాప్తంగా ఎఫ్ఎస్సీఎస్ఎల్కు వేర్‌హౌస్‌లున్నాయి. నాగ్‌పూర్‌లో అత్యంత భారీ, ఆధునిక ఆటోమేటెడ్ పంపిణీ కేంద్రాన్ని కలి గి ఉంది. ఇవన్నీ కంపెనీకి అండగా నిలవనున్నా యి. అయితే ఈ అంశాలపై స్పందించేందుకు ఫ్యూ చర్ గ్రూప్ ప్రతినిధి నిరాకరించడం గమనార్హం! సోమవారం ట్రేడింగ్‌లో ఫ్యూచర్ గ్రూప్‌లోని పలు కంపెనీల షేర్లు 20–5% మధ్య పతనమయ్యాయి. -
ఫ్యూచర్‌తో రిలయన్స్ డీల్ క్యాన్సిల్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ఆరంభమైంది. యూస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సూచీలు బలహీనంగా కదలాడాయి. వాటి ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ఈ రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఏడాదికి పైగా కొనసాగుతున్న రియలన్స్, ఫ్యూచర్, అమెజాన్ వివాదం ముగింపుకు వచ్చింది. అమెజాన్ అభ్యంతరాల నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూపును కొనుగోలు చేయాలనే నిర్ణయం నుంచి రిలయన్స్ వెనకడుగు వేసింది. దీంతో రూ.24, 713 కోట్ల రూపాయల భారీ డీల్ క్యాన్సిల్ అయ్యింది. ఈ నిర్ణయం వెడివన వెంటనే ఫ్యూచర్ షేర్లు దారుణంగా నష్టపోయాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 20 శాతానికి పైగా ఫ్యూచర్ షేరు పతనమైంది. ఇటీవల కాలంలో దారుణంగా పతనమైన పేటీఎంను వెనక్కి నెట్టింది ఫ్యూచర్. మరోవైపు రిలయన్స్ షేరు ధర కూడా 2.4 శాతం మేర నష్టపోయింది. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ ఇంచుమించు 400 పాయింట్ల నష్టంతో 56,757 పాయింట్ల వద్ద మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. స్మాల్, మిడ్, బ్లూచిప్ ఇలా అన్ని కేటగిరీల్లో నష్టాలు వచ్చాయి. మార్కెట్ ముగిసే సమయానికి 617 పాయింట్లు నష్టపోయి 56,579 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 218 పాయింట్లు నష్టపోయి 16,953 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. చదవండి: నెగ్గిన అమెజాన్ పంతం..! రూ. 24 వేల కోట్ల డీల్‌ను రద్దు చేసుకున్న రిలయన్స్..! -
నెగ్గిన అమెజాన్ పంతం..! రూ. 24 వేల కోట్ల డీల్‌ను రద్దు చేసుకున్న రిలయన్స్..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిలయన్స్– ఫ్యూచర్ గ్రూప్ మధ్య 21 నెలల క్రితం కుదిరిన ఒప్పందానికి తెరపడింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ రిటైల్, ఇతర లిస్టెడ్ కంపెనీలకు చెందిన సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఈ డీల్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం తెలిసిందే. దీంతో ఒప్పందం అమలు అసాధ్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం స్పష్టం చేసింది. కిశోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, గిడ్డంగుల వ్యాపారాల్లోని 19 కంపెనీలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ రూ.24,713 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. కానీ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఈ డీల్‌ను వ్యతిరేకించింది. ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాను రూ.1,500 కోట్లకు అమెజాన్ కొనుగోలు చేసింది. రిలయన్స్–ఫ్యూచర్ గ్రూప్ డీల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..వాటిపై పూర్తి నిషేధం..! -
రిలయన్స్ ఇలాంటి రహాస్య పనులు తగవు.. పబ్లిక్ నోటీస్ జారీ చేసిన అమెజాన్
Amazon Issued Public Notice On Reliance Deal: రెండేళ్లుగా నలుగుతున్న ఫ్యూచర్ అమెజాన్ రిలయన్స్ డీల్ వివాదం మరో మలుపు తీసుకుంది. రేపోమాపు ముగింపుకు వస్తుందని అంతా భావిస్తుండగా అమెజాన్ ట్విస్ట్ ఇచ్చింది. తమ అభ్యంతరాలను పరిష్కరించకుండా ముందుకు సాగితే కుదరదంటూ అమెజాన్ బహిరంగంగా తేల్చి చెప్పింది. బిగ్‌బజార్, ఫాంటాలూన్స్ పేరుతో భారీ రిటైల్ నెట్‌వర్క్‌ను కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు నెలకొల్పింది. ఈ క్రమంలో ఫ్యూచర్ గ్రూపులో పెట్టుబడులు పెట్టి మైనర్ వాటాలను అమెజాన్ కొనుగోలు చేసింది. అయితే అమెజాన్ నిర్ణయాలను పరిగణలోకి తీసుకోకుండా ఫ్యూచర్ గ్రూపు మొత్తాన్ని రిలయన్స్‌కి 3.4 బిలియన్ డాలర్లకు అమ్మేస్తూ డీల్ చేసుకున్నారు. తమ అభిప్రాయానలు పరిగణలోకి తీసుకోకుండా ఫ్యూచర్‌ను రిలయన్స్ ఎలా టేకోవర్ చేస్తుందంటూ అమెజాన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టు విచారిస్తోంది. అయితే ఫ్యూచర్ ఆధీనంలో దేశవ్యాప్తంగా విస్తరించిన రిటైల్ స్టోర్లను క్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది రిలయన్స్ సంస్థ. ఫ్యూచర్ గ్రూపు స్టోర్లను రీబ్రాండ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. చదవండి: రిలయన్స్ ఆధీనంలోకి ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్ వివాదం సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా ఫ్యూచర్, రిలయన్స్‌ను రహ్యసంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయంటూ అమెజాన్ పబ్లిక్ నోటీస్ పేరుతో ప్రకటన జారీ చేసింది. కోర్టు విచారణలో ఉండగా చట్ట విరుద్ధంగా రహస్య పద్దతుల్లో ఫ్యూచర్, రిలయన్స్ డీల్ చేస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించింది. వ్యాపార దిగ్గజ కంపెనీల మధ్య పోరు కావడంతో ఫ్యూచర్ వివాదం దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా అమెజాన్ ఇచ్చిన పబ్లిక్ నోటీస్‌పై రియలన్స్, ఫ్యూచర్ గ్రూపుల నుంచి ఇంకా స్పందన రాలేదు. చదవండి: ఫ్యూచర్‌కు షాక్! లీగల్ నోటీసులు పంపిన రిలయన్స్! -
ఫ్యూచర్‌కు షాక్! లీగల్ నోటీసులు పంపిన రిలయన్స్!
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ మార్కెట్‌పై ఆధిపత్యం కోసం దిగ్గజ కంపెనీల మధ్య సాగుతున్న పోరు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. తాజాగా ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన 950 స్టోర్స్‌కి సంబంధించిన సబ్–లీజును రద్దు చేయాలని రిలయన్స్ రిటైల్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఫ్యూచర్ రిటైల్‌కు నోటీసులు జారీ చేసింది. రుణభారంతో కుంగుతున్న ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు గురువారం ఈ వివరాలను స్టాక్ ఎక్ఛేంజీలకు తెలియజేశాయి. వీటిలో 835 ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్ ఉండగా, 112 ఫ్యూచర్ లైఫ్‌స్టయిల్ స్టోర్స్ ఉన్నాయని వివరించింది. ‘రిలయన్స్ సంస్థల నుంచి సబ్–లీజుకు తీసుకున్న ప్రాపర్టీలకు సంబంధించి రద్దు నోటీసులు అందాయి. వీటిలో 342 భారీ ఫార్మాట్ స్టోర్స్ (బిగ్ బజార్, ఫ్యాషన్ఎట్బిగ్బజార్ మొదలైనవి), 493 చిన్న ఫార్మాట్ స్టోర్స్ (ఈజీడే, హెరిటేజ్ స్టోర్స్ వంటివి) ఉన్నాయి‘ అని ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. మరోవైపు, 34 ’సెంట్రల్’ స్టోర్లు, 78 ’బ్రాండ్ ఫ్యాక్టరీ’ అవుట్లెట్ల సబ్–లీజు రద్దు నోటీసులు తమకు వచ్చినట్లు ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ వివరించింది. కంపెనీ రిటైల్ ఆదాయాల్లో వీటి వాటా దాదాపు 55–65 శాతం వరకూ ఉంటుందని పేర్కొంది. యథాతథ స్థితిని కొనసాగించేందుకు, వివిధ వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రిలయన్స్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఫ్యూచర్ గ్రూప్‌లోని రెండు సంస్థలూ తెలిపాయి. గత నెలలోనే టేకోవర్.. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ వ్యాపార కార్యకలాపాలను .. రూ. 24,713 కోట్ల మొత్తానికి రిలయన్స్‌కు విక్రయించేందుకు 2020 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఫ్యూచర్ కూపన్స్ సంస్థలో స్వల్ప వాటాల వల్ల, పరోక్షంగా రిటైల్ విభాగాల్లోను వాటాదారుగా మారిన ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ డీల్‌ను అడ్డుకుంటోంది. దీనిపై ప్రస్తుతం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య న్యాయ వివాదం నడుస్తోంది. ఇక, ఫ్యూచర్ గ్రూప్‌నకు 1,700 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఆర్థిక కష్టాల కారణంగా లీజు అద్దెలను కొన్నాళ్లుగా ఫ్యూచర్ గ్రూప్ చెల్లించలేకపోతోంది. ఇవన్నీ మూతబడే పరిస్థితి నెలకొనడంతో వీటిలో కొన్ని స్టోర్స్ లీజును రిలయన్స్ తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)కు బదలాయించుకుని, వాటిని ఫ్యూచర్‌కు సబ్–లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుత సరఫరాదారులకు సైతం ఫ్యూచర్ చెల్లింపులు జరపలేకపోతుండటంతో ఆయా స్టోర్స్‌కు అవసరమైన ఉత్పత్తులను కూడా రిలయన్స్ జియోమార్ట్ సరఫరా చేస్తోంది. దీంతో సదరు స్టోర్స్‌లో అధిక భాగం ఉత్పత్తులు రిలయన్స్‌వే ఉన్నాయి. సబ్–లీజు బాకీలను ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు కట్టలేకపోవడం వల్ల రిలయన్స్ ఆ అవుట్‌లెట్స్‌ను స్వాధీనం చేసుకుని, రీబ్రాండింగ్ చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగానే సబ్–లీజులను రద్దు చేసి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
తేలని వివాదం.. బిగ్‌బజార్‌ని స్వాధీనం చేసుకోనున్న రిలయన్స్
దేశంలోనే అతి పెద్ద వివాస్పద డీల్స్‌లో ఒకటిగా నిలిచింది ఫ్యూచర్ గ్రూప్ అమ్మకం. ఫ్యూచర్ గ్రూపులో అమెజాన్ పెట్టుబడులు ఉండగా.. దాన్ని రిలయన్స్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఈ నిర్ణయం వివాస్పదం కావడంతో ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లలో ఈ కేసుపై విచారణ కొనసాగుతున్నాయి. రిలయన్స్ సంస్థ 2.3 బిలియన్ డాలర్లకు ఫ్యూచర్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డీల్ మధ్యలో ఆగిపోయింది. ఈ వివాదం తలెత్తె సమయానికి దేశవ్యాప్తంగా ఫ్యూచర్ గ్రూప్‌కి 1700 అవుట్‌లెట్స్ ఉన్నాయి. సుదీర్ఘ విచారణ జరిగినా కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇంతలో ఫ్యూచర్ గ్రూప్ ఆధీనంలో ఉన్న అవుట్‌లెట్స్ లీజు అగ్రిమెంట్లు ముగుస్తున్నాయి. తమకు లీజు బకాయిలు చెల్లించాలంటూ భవనాల యజమానుల నుంచి ఒత్తిడి వస్తోంది. అంతేకాదు రెండేళ్లుగా ఫ్యూచర్ ఆధీనంలో ఉన్న బిగ్‌బజార్ తదితర అవుట్లెట్ల వ్యాపారం మందగించింది. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ ఫ్యూచర్ ఆధీనంలోని 1700 అవుట్లెట్లలో ఓ 200 అవుట్లెట్లను రిలయన్స్ స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. వాటిని పాత పేరుతో లేదా రిలయన్స్ బ్రాండ్ కిందకు తీసుకువచ్చి వ్యాపారం పునరుద్ధరించే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించారు. అయితే ప్రస్తుత వ్యహారంపై రిలయన్స్, ఫ్యూచర్, అమెజాన్లు అధికారికంగా స్పందించలేదు. తాజా అప్డేట్స్ను ముందుగా రాయిటర్స్ ప్రచురించగా ఆ తర్వాత జాతీయ మీడియాలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఫ్యూచర్ వివాదానికి సంబంధించి 2022 మార్చిలో న్యాయస్థానాల్లో మరోసారి విచారణ జరగనుంది. -
బీమా నుంచి ఫ్యూచర్ గ్రూప్ ఔట్!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ తాజాగా బీమా రంగం నుంచి బయటపడే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. సమయానుగుణంగా భాగస్వామ్య సంస్థ(జేవీ) ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో తమకు గల వాటాను విక్రయించాలని భావిస్తోంది. ఈ జేవీలో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్‌నకు 49.91 శాతం వాటా ఉంది. దీనిలో 25 శాతం వాటాను జేవీలో మరో భాగస్వామి నెదర్లాండ్స్‌కు చెందిన జనరాలి పార్టిసిపేషన్స్కు విక్రయించనున్నట్లు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. దాదాపు రూ. 1,253 కోట్ల విలువలో నగదు రూపేణా వాటాను విక్రయించనున్నట్లు తెలియజేసింది. -
ఫ్యూచర్ వివాదంపై ఎన్సీఎల్ఏటీకి అమెజాన్
న్యూఢిల్లీ: ఫిన్ టెక్ సంస్థ ’గ్రో’లో తాజాగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేయడంతో పాటు సలహాదారుగా కూడా చేరారు. గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్ కేస్రి ఈ విషయం తెలిపారు. అయితే, సత్య ఎంత ఇన్వెస్ట్ చేసినదీ మాత్రం వెల్లడించలేదు. స్టాక్స్, ఫండ్స్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పడే గ్రో 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. గతేడాది అక్టోబర్‌లో 1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 251 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,885 కోట్లు) సమీకరించింది. తాజా విడతలో అల్కియోన్, లోన్ పైన్ క్యాపిటల్, స్టెడ్‌ఫాస్ట్ సహా ప్రస్తుత ఇన్వెస్టర్లయిన సెకోయా క్యాపిటల్, రిబిట్ క్యాపిటల్, వైసీ కంటిన్యుటీ, టైగర్ గ్లోబల్, ప్రొపెల్ వెంచర్ మొదలైనవి కూడా పెట్టుబడులు పెట్టాయి. చదవండి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ అమెజాన్.. కోర్టుకు చేరిన పంచాయితీ -
ఈడీని కోర్టుకు లాగిన అమెజాన్!
Amazon Files Writ Petition Against ED In Delhi HC: విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలకు సంబంధించి ఈడీ దర్యాప్తు పరిధిపై వివరణ కోరుతూ అమెజాన్ ఢిల్లీ హైకోర్టులో బుధవారం ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం విషయంలో ‘విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలు జరిగాయని’ అమెజాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ ఈ– రిటైలర్ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌తో డీల్‌కు సంబంధించి అమెజాన్‌కు గత నెల్లో ఈడీ నుంచి సమన్లు కూడా అందాయి. ఈ విషయాన్ని గత నెల్లో అమెజాన్ స్వయంగా వెల్లడించింది. రిట్ దాఖలుకు సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం తన విచారణా పరిధిని మించి ఈడీ వ్యవహరిస్తోందన్నది అమెజాన్ ఆరోపణ. ఫ్యూచర్–అమెజాన్ లావాదేవీలతో సంబంధం లేని లేదా వాటి గురించి అవగాహన లేని తన ఎగ్జిక్యూటివ్‌లకు వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వడానికి ఈడీ సమన్లు చేయడం వెనుక ఉన్న హేతుబద్ధతను రిట్ పిటిషన్లో అమెజాన్ ప్రశ్నించింది. కాగా, ఈ రిట్‌పై అడిగిన ప్రశ్నలకు అమెజాన్ నుంచి ఎటువంటి ప్రతి స్పందనా లభించలేదు. అమెజాన్–ఫ్యూచర్ గ్రూప్ మధ్య ప్రస్తుతం రూ.24,500 కోట్ల రిలయన్స్ రిటైల్ (ఫ్యూచర్ గ్రూప్ ఆ సంస్థలో చేసుకున్న) ఒప్పందపై న్యాయపోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. -
అమెజాన్‌కు భారీ షాక్ ఇచ్చిన సీసీఐ
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు సీసీఐ భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్‌సిపిఎల్) మధ్య కుదిరిన ఒప్పందాన్ని 2019లో ఆమోదించిన కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఎఫ్‌సిపిఎల్ తో జరిగిన రూ.1400 కోట్ల ఒప్పందానికి అమెజాన్ ఆమోదం కోరుతూ కీలక సమాచారాన్ని దాచిపెట్టినట్లు ఆరోపిస్తూ సీసీఐ అమెజాన్ కు 60 రోజుల నోటీసు జారీ చేసింది. అప్పటి వరకు ఈ డీల్ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేసింది. అలాగే, అమెజాన్‌కు రూ.202 కోట్లు జరిమానా కూడా విధించింది. ఎఫ్‌సిపిఎల్ అనేది ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(ఎఫ్ఆర్ఎల్) ప్రమోటర్ ఎంటిటీ. 2019లో అమెజాన్-ఎఫ్‌సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని వెల్లడించడంలో విఫలం చెందడం అనేది కాంపిటీషన్ చట్టంలో రెగ్యులేషన్ 5 సెక్షన్ 6, సబ్ సెక్షన్ (2) & కాంబినేషన్ రెగ్యులేషన్స్ సబ్ రెగ్యులేషన్స్(4), (5) ఉల్లంఘనలకు సమానమని సీసీఐ తన ఉత్తర్వుల్లో సూచించింది. అమెజాన్ ప్రతినిధి ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ.. "మేము కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించిన ఉత్తర్వులను సమీక్షిస్తున్నాము, తదుపరి చర్యలకు సంబంధించి తగిన సమయంలో వెల్లడిస్తాము" అని చెప్పారు. "చట్టం సెక్షన్ 6(2) కింద అమెజాన్-ఎఫ్‌సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని తెలియజేయడంలో విఫలమైనందుకు చట్టంలోని సెక్షన్ 43ఎ కింద కమిషన్ జరిమానా విధించడానికి అవకాశం ఉంది. జరిమానా అనేది మొత్తం టర్నోవర్ లేదా ఆస్తులలో ఒక శాతం వరకు ఉండే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాల వల్ల కమిషన్ అమెజాన్‌పై రెండు వందల కోట్ల రూపాయల జరిమానా విధిస్తుంది" అని సీసీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ విషయంలో న్యాయపోరాటం సాగిస్తున్న వేళ సీసీఐ నిర్ణయం అమెజాన్‌ను ఇరకాటంలో పెట్టింది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో 2019లో అమెజాన్ 200 మిలియన్ డాలర్ల మేర(49 శాతం) పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. (చదవండి: అమెరికా బాట పట్టిన బైజూస్.. రూ.30వేల కోట్ల నిధుల సమీకరణ) -
అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ అధికారులకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్‌లో అమెజాన్ ఇండియా పెట్టుబడుల విషయంలో విదేశీ మారక చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై ఇరు కంపెనీల అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. నిర్దిష్ట పత్రాలతో పాటు విచారణకు హాజరు కావాలంటూ అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ సహా సీనియర్ అధికారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ సమన్లను పరిశీలిస్తున్నామని, తగు విధంగా స్పందిస్తామని అమెజాన్ ప్రతినిధి తెలిపారు. ఫ్యూచర్ గ్రూప్ సంస్థలో అమెజాన్‌కు పెట్టుబడులు ఉన్న సంగతి తెలిసిందే. దీని ఊతంతో .. దేశీ దిగ్గజం రిలయన్స్‌కి ‘ఫ్యూచర్ రిటైల్’ సంస్థను విక్రయించనివ్వకుండా అడ్డుపడుతుండటంపై ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్‌ల మధ్య వివాదం నడుస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడుల ద్వారా ఫ్యూచర్ రిటైల్‌పై అజమాయిషీ చలాయించేందుకు అమెజాన్ ప్రయత్నిస్తుండటాన్ని .. ఫెమా, విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘ నగా భావించాల్సి వస్తుందంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు, ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి నిర్దిష్ట మల్టీ–బ్రాండ్ రిటైల్ వ్యాపారాలు సాగిస్తుండటంపై తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవలే ఈడీకి సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా సమన్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: ఫ్యూచర్ రిటైల్‌లో ఆర్థిక అవకతవకలు -
ఫ్యూచర్‌గ్రూపు, అమెజాన్ వివాదంలో మరో మలుపు!
న్యూఢిల్లీ: కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్గ్రూపుతో సయోధ్యకు అమెజాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెజాన్‌కు వ్యతిరేకంగా ఫెమా ఉల్లంఘనలపై సీసీఐ వద్ద ఫ్యూచర్ గ్రూపు కేసు దాఖలు చేసింది. అమెజాన్‌లో పెట్టుబడులకు ఆమోదం తీసుకునే విషయంలో సీసీఐ వద్ద వాస్తవాలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టు ఫ్యూచర్ గ్రూపు ఆరోపిస్తోంది. ఈకేసును వెనక్కి తీసుకోవాలని ఫ్యూచర్ గ్రూపును అమెజాన్ కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెట్టుబడులకు సంబంధించి తమ మధ్య వివాదానానికి ముగింపు విషయమై ఇరు వర్గాలు చర్చించినట్టు కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ గ్రూపు తన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ వ్యాపారాలను రిలయన్స్‌కు విక్రయించేందుకు గతేడాది ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఫ్యూచర్ రిటైల్‌లో పెట్టుబడులు కలిగిన అమెజాన్ ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించడంతో ఇది నిలిచిపోయింది. అమెజాన్ పక్కకు తప్పుకుంటే చెల్లించాల్సిన పరిహారంపైనా చర్చించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఈ విషయాన్ని తప్పుదోవపట్టించేదిగా, కల్పితంగా అమెజాన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఫ్యూచర్ రిటైల్‌కు సాయం చేసేందుకు అమెజాన్ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చదవండి: అమెజాన్ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీం కోర్టును కోరిన ఎఫ్ఆర్ఎల్ -
వాటాదారుల ఆమోదం కోరనున్న ఫ్యూచర్ గ్రూపు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చేసుకున్న ఒప్పందానికి వాటాదారుల ఆమోదాన్ని ఫ్యూచర్ గ్రూపు సంస్థలు కోరనున్నాయి. ఈ మేరకు నవంబర్ 10, 11 తేదీల్లో వాటాదారులు, రుణదాతల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఫ్యూచర్ గ్రూపు కంపెనీలు తమ వాటాదారులకు సమాచారం ఇచ్చాయి. వీడియో కాన్ఫరెన్స్/ఆడియో, వీడియో విధానంలో ఈ సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలిపాయి. అదే విధంగా ఉన్నచోట నుంచే ఈఓటు వేసే ఏర్పాటు కూడా చేసినట్టు పేర్కొన్నాయి. ఫ్యూచర్ గ్రూపు కంపెనీలన్నింటినీ ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనం చేసి.. తదుపరి ఫ్యూచర్ రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుంపగుత్తగా విక్రయించాలన్నది ఫ్యూచర్ గ్రూపు ప్రణాళిక. ఇందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.24,713 కోట్లు చెల్లించనుంది. ఈ మొత్తం ఫ్యూచర్ గ్రూపు రుణదాతలకు దక్కనుంది. -
ఫ్యూచర్‌తో రిలయన్స్ ఒప్పందం గడువు పెంపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్ర్‌బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో న్యాయ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్‌తో రూ.24,713 కోట్ల ఒప్పంద పక్రియ పూర్తికి గడువును (లాంగ్ స్టాప్ డేట్) రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) మరోసారి పొడిగించింది. ఇప్పటి వరకూ 2021 సెపె్టంబర్ 30తో గడువు పూర్తికాగా, దీనిని 2022 మార్చి వరకూ ఆర్ఆర్వీఎల్ పొడిగించినట్లు ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్ సమర్పించింది. సుదీర్ఘ న్యాయ వివాదం రిలయన్స్‌కు ఫ్యూచర్ గ్రూప్‌ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ అర్ర్‌బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. అప్పటి ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్‌కు అనుకూలంగా రూలింగ్ వచి్చంది. ఆర్ర్‌బిట్రేషన్ ట్రిబ్యునల్ అవార్డు భారత్ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందని ఇటీవలే ఒక రూలింగ్ ఇచి్చంది. పూర్తి వివాదం అంశంలో ఇంకా తుది తీర్పు వెలువడాల్సి ఉంది. దేశంలో లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి. ఈజీఎం నిర్వహణకు ఫ్యూచర్‌కు వెసులుబాటు... మరోవైపు ఈ ఒప్పందానికి ఆమోదం కోసం వాటాదారులు, రుణదాతల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇటీవల కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్‌కు అనుమతి ఇచి్చంది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఒకవేళ ఫ్యూచర్ జరిపే ఈజీఎం గ్రూప్ సంస్థల విక్రయానికి ఆమోదముద్ర వేసినప్పటికీ, సంబంధిత స్కీమ్‌కు ఎన్సీఎల్టీ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ దశలో తన అభ్యంతరాలను అమెజాన్ ఎన్సీఎల్టీ ముందు ఉంచవచ్చని అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్ నిర్వహించే సమావేశం సరికాదనడం తప్పని ఎన్సీఎల్టీ పేర్కొంది. దీనివల్ల తక్షణం అమెజాన్‌కు జరిగే న్యాయపరమైన నష్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని ఆమోదిస్తూ, తుది ఉత్తర్వుఇవ్వవద్దని మాత్రమే సుప్రీంకోర్టు తనను ఆదేశించినట్లు వివరించింది. ఫ్యూచర్ ఈజీఎంను నిర్వహించి పథకానికి ముందుగానే ఆమోదముద్ర పొందినట్లయితే, ‘తరువాత ఆర్ర్‌బిట్రేషన్ పక్రియలో విజయం సాధిస్తే’ రిలయన్స్‌తో ఒప్పందం ప్రక్రియ పూర్తికి ఐదారు నెలల సమయం ఆదా అవుతుందనీ వివరించింది. -
రిలయన్స్‌తో ఒప్పందంపై ఫ్యూచర్‌కు ఊరట!
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌కు తన గ్రూప్ సంస్థల విక్రయానికి సంబంధించి కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌కు ఊరట లభించింది. ఈ ఒప్పందానికి ఆమోదం కోసం వాటాదారులు, రుణదాతల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మంగళవారం కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్‌కు అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుచిత్ర కనుపర్తి, చంద్రభన్‌సింగ్ లతో కూడిన ఇరువురు సభ్యుల ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తోసిపుచ్చినట్లు సమాచారం.అయితే ఈ వార్తలపై పంపిన ఈమెయిల్స్‌కు అటు అమెజాన్‌కానీ, ఇటు ఫ్యూచర్‌కానీ సమాధానం ఇవ్వలేదు. అమెజాన్‌కు తక్షణం నష్టం లేదు సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఒకవేళ ఫ్యూచర్ జరిపే ఈజీఎం గ్రూప్ సంస్థల విక్రయానికి ఆమోదముద్ర వేసినప్పటికీ, సంబంధిత స్కీమ్‌కు ఎన్సీఎల్టీ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ దశలో తన అభ్యంతరాలను అమెజాన్ ఎన్సీఎల్టీ ముందు ఉంచవచ్చని అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్ నిర్వహించే సమావేశం సరికాదనడం తప్పని ఎన్సీఎల్టీ పేర్కొంది. దీనివల్ల తక్షణం అమెజాన్‌కు జరిగే న్యాయపరమైన నష్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని ఆమోదిస్తూ, తుది ఉత్తర్వుఇవ్వవద్దని మాత్రమే సుప్రీంకోర్టు తనను ఆదేశించినట్లు వివరించింది. ఫ్యూచర్ ఈజీఎంను నిర్వహించి పథకానికి ముందుగానే ఆమోదముద్ర పొందితే, ‘తరువాత ఆర్ర్‌బిట్రేషన్ పక్రియలో విజయం సాదిస్తే’ రిలయన్స్‌తో ఒప్పందం ప్రక్రియ పూర్తికి ఐదారు నెలల సమయం ఆదా అవుతుందనీ వివరించింది. సుదీర్ఘ న్యాయ వివాదం రిలయన్స్‌కు ఫ్యూచర్ గ్రూప్‌ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ అర్ర్‌బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్‌కు అనుకూలంగా రూలింగ్ వచ్చింది. దేశంలో లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: అమెజాన్ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీం కోర్టును కోరిన ఎఫ్ఆర్ఎల్