హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బ్లాక్‌బస్టర్ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్) తాజాగా కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన 1,800లకుపైగా బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి. వీటిని వినియోగించుకునేందుకు రిలయన్స్‌కు మార్గం లభించింది.
రిలయన్స్ రిటైల్ వ్యాపారాల విస్తరణ వేగంగా జరిగేందుకు, పోటీ కంపెనీలకు ధీటుగా ఈ–కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు ఈ లావాదేవీ దోహదం చేయనుంది. ఇక డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు బదిలీ చేస్తారు. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన పేరొందిన ఫార్మాట్స్, బ్రాండ్స్‌కు ఒక వేదిక ఇవ్వడం ఆనందంగా ఉందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్, ఆర్థిక పరిస్థితుల మూలంగా తలెత్తిన సవాళ్లకు.. పునర్‌వ్యవస్థీకరణ, తాజా లావాదేవీ ఫలితంగా సంస్థకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వ్యాఖ్యానించారు
Comments
Please login to add a commentAdd a comment