
రిటైల్‌లో ప్రైవేట్ లేబుల్స్
హైదరాబాద్: ప్రైవేట్ లేబుల్స్ దిగ్గజ కంపెనీల ఫుడ్ బిజినెస్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. హిందూస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా, నెస్లే, ఐటీసీ వంటి కంపెనీల ఆహార ఉత్పత్తులకు ప్రైవేట్ లేబుల్స్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. బిగ్‌బజార్ రిటైల్ చెయిన్లను నిర్వహించే ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ సంస్థల ఆహార ఉత్పత్తుల అమ్మకాల్లో ప్రైవేట్ లేబుల్స్ హవా పెరుగుతోంది. ఈ రిటైల్ చెయిన్ షాపుల్లో ఆహార పదార్ధాల అమ్మకాల్లో 75 శాతం ప్రైవేట్ లేబుల్స్‌వే ఉండడం విశేషం.
ప్రైవేట్ లేబుల్స్ ఎందుకంటే...,
పెద్ద కంపెనీ బ్రాండ్ల ఉత్పత్తులు ఖరీదెక్కువనే కారణంతో వినియోగదారులు తక్కువ ధరలకు లభించే ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని నీల్సన్ తాజా సర్వేలో వెల్లడైంది. నాణ్యతతో రాజీపడకుండానే తక్కువ ధరకే ఆహార ఉత్పత్తులను ప్రైవేట్ లేబుల్స్ అందిస్తున్నాయని నీల్సన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆడ్రియన్ టెర్రాన్ చెప్పారు. కొత్త బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేద్దామనుకుంటున్న వినియోగదారులు పెరిగిపోతున్నారని వివరించారు. ఈ పోకడ హిందుస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా, నెస్లే, ఐటీసీల వంటి కంపెనీలపై దీర్ఘకాలంలో ప్రభావం చూపగలదని నిపుణులంటున్నారు. ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తుల ధరలు అందరికీ అందుబాటులో ఉండడం వాటి అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. మార్కెటింగ్, పంపిణీ వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తులు చౌక ధరల్లో లభ్యమవుతున్నాయి.
ఫ్యామిలీ బడ్జెట్లో కోత...
ఇప్పుడు వీకెండ్ సరదాల్లో షాపింగ్ కూడా ఒక భాగమైపోయింది. ఫ్యామిలీలు శని, ఆది వారాల్లో షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారు. ఎంచుకోవడానికి అధిక ఉత్పత్తులు అందుబాటులో ఉండడం, ఊరిస్తున్న ఆఫర్లు వంటి కారణాల వల్ల షాపింగ్ ఖర్చు ఇబ్బడి ముబ్బడి అవుతోంది. దీంతో బడ్జెట్ కోతలో భాగంగా అధిక ధరలున్న పెద్ద కంపెనీల బ్రాండ్ల ఆహార ఉత్పత్తులకు బదులు తక్కువ ధర ఉన్న ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తుల వినియోగం వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు.
పెద్దస్థాయి కాదు
కాగా ప్రస్తుతం పెద్ద కంపెనీలను సవాల్ చేసే స్థాయిల్లో ప్రైవేట్ లేబుల్స్ లేవని కొందరు నిపుణులంటున్నారు. భారత ఆహార, కిరాణా మార్కెట్లో ప్రైవేట్ లేబుల్స్ వాటా 0.3 శాతం మాత్రమేనని రాబొబ్యాంక్ ఇంటర్నేషనల్ అంచనా వేస్తోంది. ఫలానా బ్రాండ్ వస్తువే కొనాలనుకునే వినియోగదారులు బాగా ఉన్నారని, ఇది పెద్ద కంపెనీలకు ప్రయోజనకరమని విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి వారి సంఖ్య పెంచుకోవడం ద్వారా ప్రైవేట్ లేబుల్స్ పోటీని తట్టుకోవడం కోసం పెద్ద కంపెనీలు బ్రాండ్ బిల్డింగ్‌పై బాగానే వ్యయం చేస్తున్నాయి.
ఐదు రెట్ల వృద్ధి..
దేశంలోని ప్రైవేట్ లేబుల్స్ అన్నీ ఒక గొడుగు కిందకు వస్తే, అది దేశంలోనే మూడవ అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ సరఫరా సంస్థ అవుతుందని నీల్సన్ సంస్థ అంచనా. ఈ సంస్థ అంచనా ప్రకారం, ప్రైవేట్ లేబుల్స్ వ్యాపారం 2015 కల్లా ఐదు రెట్ల వృద్ధితో రూ.3,000 కోట్లకు పెరగనున్నది. భారత్‌లోని మోడ్రన్ ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల్లో ఇప్పటికే ప్రైవేట్ లేబుల్స్ వాటా 5 శాతంగా ఉంది. ఇది చైనాలో 1 శాతమే ఉంది. మొత్తం ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల్లో మోడ్రన్ ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు భారత్‌లో 10 శాతంగా ఉండగా, చైనాలో మాత్రం 70 శాతంగా ఉన్నాయి. భారత్‌లో ప్రైవేట్ లేబుల్స్‌కు భారీగా అవకాశాలున్నాయని రిటైలర్లు అంటున్నారు. చాలా కేటగిరిల్లో పెద్ద పెద్ద కంపెనీల ఉత్పత్తులు లేవని, ఇది ప్రైవేట్ లేబుల్స్ విజృంభణకు మంచి అవకాశమని వారంటున్నారు. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ సంస్థ నిర్వహించే బిగ్ బజార్‌ల్లో పన్నెండుకు పైగా వివిధ సెగ్మెంట్లలలో ప్రైవేట్ లేబుల్స్ అమ్మకాలు బాగా ఉన్నాయని ఫుడ్ బజార్ ప్రెసిడెంట్ దేవేంద్ర చావ్లా చెప్పారు. ఇక ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన మోర్, ఆర్‌పీజీ గ్రూప్‌కు చెందిన స్పెన్సర్స్ రిటైల్‌లో కూడా వివిధ కేటగిరిల్లో ముఖ్యంగా ఆహార పదార్ధాలు, గృహ సంరక్షణ కేటగిరిల్లో ప్రైవేట్ లేబుల్స్ హవా జోరుగా ఉంది.