Market Share
-
హైదరాబాద్‌లో మారుత్ డ్రోన్స్
హైదరాబాద్: డ్రోన్ల తయారీ, సేవలను అందించే మారుత్‌డ్రోన్స్ విస్తరణపై దృష్టి సారించింది. 2026 నాటికి దేశ డ్రోన్ల రంగం టర్నోవర్ రూ.12,000–15,000 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో, తన సిబ్బందిని, మార్కెట్ వాటాను పెంచుకోనున్నట్టు ప్రకటించింది. విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. తన డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్టు, 2024 మార్చి నాటికి డీలర్ల సంఖ్యను 100కు పెంచుకోవాలని, 2028 నాటికి 500కు పెంచుకోనున్నట్టు ప్రకటించింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు, సహకారం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సరీ్వస్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్లలో 30,000 డ్రోన్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు ప్రకటించింది. -
ఇన్సూరెన్స్ పాలసీలపై పెరిగిన అవగాహన.. రూ.3 లక్షల కోట్ల బీమా రంగ ఆదాయం
న్యూఢిల్లీ: బీమా పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2025 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది రూ.2.4 లక్షల కోట్లుగా ఉంది. ప్రైవేటు బీమా సంస్థల కంబైన్డ్ రేషియో మెరుగుపడుతుందని, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) 2023–24లో 11.2–12.8 శాతానికి, 2024–25లో 12.5–13.9 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. ప్రభుత్వరంగ బీమా సంస్థలు కంబైన్డ్ రేషియో అధికంగా ఉంటుందని, దీంతో వాటి నష్టాలు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 2024 మార్చి నాటికి సాల్వెన్సీ రేషియో (1.5 రెట్లు) చేరుకునేందుకు వీలుగా వాటికి రూ.17,500 కోట్ల నిధుల అవసరం అవుతాయని అంచనా వేసింది. పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2022–23లో వార్షికంగా చూస్తే 17.2 శాతం వృద్ధితో రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్న విషయాన్ని ప్రస్తావించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2022–23లో నికరంగా రూ.35,000 కోట్ల మేర పెరిగినట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరగడంతో ఈ విభాగం మెరుగైన వృద్ధిని చూసిందని, వృద్ధి చెందిన స్థూల ప్రీమియం ఆదాయంలో 50 శాతం వాటా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచే వచ్చినట్టు వివరించింది. కరోనా సమయంలో లాక్డౌన్లతో దెబ్బతిన్న మోటారు బీమా విభాగం సైతం పుంజుకున్నట్టు ఇక్రా తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు సాధారణ స్థితికి చేరినట్టు పేర్కొంది. వేతన సవరణ, అందుకు సంబంధించిన బకాయిల చెల్లింపులతో ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు నష్టాలు పెరిగినట్టు వివరించింది. -
మారుతీ సుజుకీ కొత్త ప్లాన్స్: మారుతీ మిడ్-ఎస్యూవీ
న్యూఢిల్లీ: దేశంలో కంపెనీ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగాన్ని కీలకంగా పరిగణిస్తున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో ప్రస్తుతం సంస్థ వాటా 45 శాతంగా ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది మారుతీ సుజుకీ లక్ష్యం. ‘ఎస్‌యూవీయేతర విభాగంలో కంపెనీ వాటా 65 శాతం పైచిలుకు. ఎస్‌యూవీల్లో అంత పెద్దగా లేదు. దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం ఇది. ఇందులో మారుతీ సుజుకీ తప్పనిసరిగా సుస్థిర స్థానం సంపాదించాలి. ప్రారంభ స్థాయి ఎస్‌యూవీల విపణి వార్షిక పరిమాణం 6.6 లక్షల యూనిట్లు. ఇందులో సంస్థకు 20 శాతం వాటా ఉంది. 5.5 లక్షల యూనిట్ల వార్షిక పరిమాణం ఉన్న మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో కంపెనీకి ఒక్క మోడల్ కూడా లేదు. ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరులో మిడ్ సైజ్ ఎస్యూవీ ఆవిష్కరించనున్నాం. 4 మీటర్ల లోపు పొడవు ఉండే ఎస్‌యూవీలపైనా దృష్టిసారిస్తాం’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
వ్యాపార వైవిధ్యంపై ఎల్ఐసీ దృష్టి
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్ఐసీ సెప్టెంబర్ 1వ తేదీకి 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తన వ్యాపార వైవిధ్యంపై దృష్టి సారించింది. నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. జీవిత బీమా రంగంలో ఎల్ఐసీకి సుమారు 65 శాతం మార్కెట్ వాటా ఉన్న విషయం తెలిసిందే. 17 ఇండివిడ్యువల్ పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్లు 17 ఇండివిడ్యువల్ (వ్యక్తుల విభాగంలో) నాన్‌పార్టిసిపేటింగ్ ఉత్పత్తులు, 11 గ్రూపు ప్లాన్లను ఎల్ఐసీ ఆఫర్ చేస్తోంది. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లలో బోనస్‌లు రావు. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారాన్నిచ్చే అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లుగా చెబుతారు. తమ ఏజెంట్లు ఇక ముందూ ఉత్పత్తుల పంపిణీకి మూలస్తంభాలుగా కొనసాగుతారని కుమార్ తెలిపారు. ఇండివిడ్యువల్ బీమా ఉత్పత్తుల వ్యాపారంలో 95 శాతం ప్రీమియం తమకు ఏజెన్సీల ద్వారానే వస్తున్నట్టు చెప్పారు. ఎల్ఐసీకి దేశవ్యాప్తంగా 13.3 లక్షల ఏజెన్సీలు ఉండడం గమనార్హం. బ్యాంకు అష్యూరెన్స్ (బ్యాంకుల ద్వారా) రూపంలో తమకు వస్తున్న వ్యాపారం కేవలం 3 శాతంగానే ఉంటుందని కుమార్ తెలిపారు. ‘‘జీవితావసరాలకు బీమా కావాలన్న అవగాహన గరిష్ట స్థాయికి చేరింది. కస్టమర్ల మారుతున్న అవసరాలకు తగ్గట్టు కొత్త విభాగాల్లోకి ప్రవేవిస్తాం’’అని వెల్లడించారు. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లను మరిన్ని తీసుకురావడం ద్వారా తాము అనుసరించే దూకుడైన వైవిధ్య విధానం తగిన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. బ్యాంక్ అష్యూరెన్స్‌ను మరింత చురుగ్గా మారుస్తామన్నారు. -
హైదరాబాద్ రెస్టారెంట్లలో మనం ఇంత బిల్ పే చేస్తున్నామా?
నోరూరించే బిర్యానీకి వరల్డ్ ఫేమస్ హైదరాబాద్. ఇక్కడ ఒక్క బిర్యానీనే కాదు రాయలసీమ రుచులు, పాలమూరు గ్రిల్స్, రాజుగారి వంటగది మొదలు వరల్డ్ ఫేమస్ క్యూజిన్ వంటకాలు భాగ్యనగరంలో లభిస్తాయి. వీటిని ఆరగించేందుకు రెస్టారెంట్లకు వెళ్లేవారు ఎక్కువ. దీంతో దేశంలో రెస్టారెంట్, హోటల్ బిజినెస్‌లో హైదరాబాద్ దూసుకుపోతుంది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో ప్రతీ ఏడు ప్రముఖ రెస్టారెంట్లలో రూ. 6,037 కోట్లు, చైన్ రెస్టారెంట్లలో రూ.1,380 కోట్లు ఉండగా మిగిలిన రెస్టారెంట్లలో రూ.4657 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్టు వెల్లడించింది. కేవలం ఎన్ఆర్ఏఐ వివరాల ప్రకారం ఆర్గనైజ్డ్గా జరుగుతున్న రెస్టారెంట్ల వ్యాపారం రికార్డు స్థాయిలో రూ.12,000 కోట్లకు ఇంచుమించుగా ఉంది. రెస్టారెంట్ల వ్యాపార వ్యవహరాలకు సంబంధించి ఎన్ఆర్ఏఐను 1982లో ఏర్పాటు చేశారు. దేశం మొత్తం మీద అన్ని నగరాల్లో ప్రముఖ రెస్టారెంట్లు హోటళ్లు ఈ అసోసియేషన్‌లో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ చాప్టర్‌ను ప్రారంభించారు. ఈ చాప్టర్లో 200ల వరకు ఎన్‌ఆర్‌ఏఐలో అనుబంధం కలిగి ఉండగా.. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎన్ఆర్ఏఐను విస్తరించి ఈ అసోసియేషన్ పరిధిలోకి 2000ల రెస్టారెంట్లు, హోటళ్లు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కోవిడ్ ఆంక్షలు తలెత్తిన తర్వాత రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా నిబంధనలు రెస్టారెంట్లకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. అదే విధంగా ఫుడ్ ఇండస్ట్రీలోకి చొచ్చుకువస్తున్న ఈ కామర్స్‌కు సంబంధించి వ్యవహారాలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసుల్లో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి మరింత సమర్థంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఎన్ఆర్ఏఐ అడుగులు వేస్తోంది. చదవండి:ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్...! హైదరాబాద్ జోరు మాత్రం తగ్గేదేలే..! -
శామ్సంగ్కు రియల్మీ ఝలక్.. అమ్మకాల్లో మరో రికార్డు
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగ్‌ను గుర్తు చేస్తోంది స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ. కేవలం మూడేళ్ల కిందట భారత మార్కెట్లో అడుగు పెట్టిన ఈ కంపెనీ బడా బ్రాండ్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. నంబర్ 2 ఇండియాలో మొబైల్ సేల్స్‌కి సంబంధించి మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ అక్టోబరు గణాంకాలను విడుదల చేసింది. ఇందులో 18 శాతం మార్కెట్ వాటాతో రియల్మీ శామ్సంగ్ని వెనక్కి నెట్టి ఇండియాలో అత్యధిక మార్కెట్ కలిగిన కంపెనీగా రికార్డు సృష్టించింది. శామ్సంగ్ నుంచి కొత్త మోడళ్ల రాక తగ్గిపోవడంతో కేవలం 16 శాతం మార్కెట్‌కే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది. షావోమి వెంటే గత కొన్నేళ్లుగా ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. షావోమి మార్కెట్‌కి గండి కొట్టేందుకు శామ్సంగ్, రియల్మీ, ఒప్పో, వివోలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా అక్టోబరులో కూడా 20 శాతం మార్కెట్ వాటాతో షావోమినే నంబర్ వన్‌గా నిలిచింది. అయితే ఈ నంబర్ వన్ స్థానం కాపాడుకునేందుకు షావోమి సబ్సిడరీ కంపెనీ పోకో మోడల్స్ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఏ క్షణమైనా షావోమి ఆధిపత్యాని చెక్ పెట్టేందుకు రియల్మీ రెడీగా ఉంది. ఇక 13 శాతం మార్కెట్ వాటాతో వివో నాలుగో స్థానంలో ఉంది. అన్నింటినీ తోసిరాజని క్వార్టర్ 3 అమ్మకాలను అక్టోబరు అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు.. టాప్ 4లో ఉన్న మిగిలిన మూడు కంపెనీల అమ్మకాలు తగ్గుముఖం పట్టగా కేవలం రియల్ మీ బ్రాండ్ మాత్రమే మార్కెట్ వాటాను పెంచుకుంది. షావోమీ 23 నుంచి 20 శాతానికి , శామ్సంగ్ 17 నుంచి 16 శాతానికి, వివో 15 నుంచి 13 శాతానికి మార్కెట్ వాటా పడిపోగా కేవలం రియల్మీ బ్రాండ్ ఒక్కటే మార్కెట్ వాటాను 15 నుంచి 18 శాతానికి పెంచుకోగలిగింది. వచ్చే ఏడాదిలో ఇండియాలో నంబర్ వన్ బ్రాండ్‌గా ఎదగడమే తమ తదుపరి లక్ష్యమని రియల్మీ ప్రతినిధులు అంటున్నారు. -
Apple: పడిపోయిన యాపిల్ మార్కెట్! భారమంతా ఐఫోన్ 13 పైనే?
Apple iPhone 13: టెక్ దిగ్గజం యాపిల్‌కి షాక్ తగిలింది. నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ ఫోర్స్ తాజా లెక్కలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తగ్గిన అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి ట్రెండ్ ఫోర్స్ సంస్థ తాజా గణంకాలు విడుదల చేసింది. ఇందులో రెండో క్వార్టర్‌కి సంబంధించి గ్లోబల్ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాలు 13.7 శాతానికే పరిమితమైనట్టుగా తెలిపింది. గతేడాది ఫోన్ అమ్మకాలతో పోల్చితే 22 శాతం మేరకు ఐఫోన్ అమ్మకాలు తగ్గినట్టు ట్రెండ్‌సెట్ పేర్కొంది. నాలుగో స్థానానికి ఒక్కసారిగా ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో యాపిల్ సంస్థ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసినికి సంబంధించిన అమ్మకాల్లో 19 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 16.1 శాతం అమ్మకాలతో షావోమీ, ఒప్పోలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాటి తర్వాత 13.7 శాతం మార్కెట్‌తో యాపిల్ నాలుగో స్థానానికి పరిమితమైంది. 11.1 శాతం వాటాతో వివో ఐదో స్థానంలో ఉంది. వివో సంస్థ అమ్మకాల్లో సైతం 18 శాతం తగ్గుదల నమోదైంది. ఐఫోన్ 13పైనే భారం యాపిల్ సంస్థ ఈ నెలాఖరు కల్లా సరికొత్త మోడల్ ఐఫోన్ 13ను రిలీజ్ చేయబోంది. ఇప్పటికే ఐఫోన్ 13 ఫీచర్లకు సంబంధించి మార్కెట్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిమ్‌తో పని లేకుండా లో ఎర్త్ ఆర్బిట్ టెక్నాలజీపై ఐఫోన 13 పని చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఐఫోన్ 13కి మరింత క్రేజ్ తెచ్చేందుకు యాపిల్ వాచ్ 7 సిరీస్‌ను సైతం రిలీజ్ వచ్చంటూ కథనాలు వస్తున్నాయి. మొత్తంగా పడిపోయిన మార్కెట్ షేర్‌ను దక్కించుకునేందుకు ఐఫోన్ 13పైనే ఆ సంస్థ భారం వేసింది. చదవండి: గూగుల్ సెర్చ్‌లో తొలి పదం.. ఆసక్తికరమైన విషయం -
ఇక.. పేపర్ రెపరెపలు!!
న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌పై ప్రస్తుతం వ్యక్తమవుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. అందులోనూ ఒక్కసారి మాత్రమే వినియోగించడానికి పనికివచ్చే ప్లాస్టిక్పైనయితే మరీను!!. ఇది పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది కనక దీన్ని నిషేధించాలనే డిమాండ్లు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వాలు సైతం ఈ దిశగా ఆలోచించడం మొదలెట్టాయి. ఈ పరిణామాలన్నీ పేపర్ పరిశ్రమకు కలిసొస్తాయనేది నిపుణుల మాట. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ మార్కెట్ ప్రస్తుతం దేశీయంగా రూ.80,000 కోట్ల స్థాయిలో ఉందని.. కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిషేధిస్తే 2025 నాటికి ఇందులో 25 శాతం వాటాను పేపర్ పరిశ్రమ సొంతం చేసుకుంటుందని ఓ అధ్యయన నివేదిక పేర్కొంది. లండన్ కేంద్రంగా పనిచేసే హైవ్ గ్రూపు అనుబంధ సంస్థ హైవ్ ఇండియా నిర్వహించిన పేపరెక్స్ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. ఒక్కసారి మాత్రమే వినియోగించడానికి పనికొచ్చే ప్లాస్టిక్‌ను 2022 నాటికి దేశంలో పూర్తిగా నిషేధించాలన్నది ప్రధాని మోదీ సంకల్పం. ప్లాస్టిక్‌తో హాని ఎక్కువే... ‘‘2017–18లో భారత్‌లో సగటున ప్రతిరోజూ 26,000 టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగయింది. ఇందులో కేవలం 60 శాతమే రీసైకిల్ చేయగా (పునర్వినియోగానికి అనువుగా మార్చడం), మిగిలినది నేలపైనే ఉండిపోయింది. దేశంలో ప్లాస్టిక్ వినియోగంలో మూడింట ఒక వంతు వాటా ప్యాకేజింగ్ పరిశ్రమది. ప్యాకేజింగ్ ప్లాస్టిక్‌లో 70% చాలా స్వల్ప వ్యవధిలోనే చెత్తగా మారిపోతోంది. ప్లాస్టిక్ చెత్తను నేలపైనే వదిలేస్తే అది ఇతర జీవులకు హానికరంగా మారుతోంది. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ కవర్లు, స్టైరోఫోమ్ కంటెయినర్లు మట్టిలో కలసి పోవడానికి 1,000 ఏళ్లకుపైనే పడుతుంది’’ అని హైవ్ గ్రూపు నివేదిక వివరించింది. భారత్‌లో ప్లాస్టిక్ వినియోగం తలసరి 11 కిలోలు. అంతర్జాతీయ సగటు 28 కిలోలతో పోలిస్తే ఇది సగం కంటే తక్కువేనని నివేదిక వెల్లడించింది. పేపర్ పర్యావరణ అనుకూలం.. ప్లాస్టిక్ స్థానంలో పేపర్ వాడటమనేది పర్యావరణ అనుకూలమని, ఇది సులభంగా మట్టిలో కలిసిపోతుందని ఈ అధ్యయనం గుర్తు చేసింది. ‘‘పేపర్ పరిశ్రమలు తమ ఉత్పత్తి కోసం చెట్లను నరికేస్తాయని, నీరు, ఇంధనాన్ని అధికంగా ఖర్చు చేస్తాయనేది వాస్తవం కాదు. దాదాపు పేపర్ పరిశ్రమలన్నీ తమ సొంత అడవుల నుంచో, రైతుల ద్వారా సేకరించిన చెట్ల నుంచో పేపర్ తయారు చేస్తున్నారు. వీరు పేపర్ కోసం నరికే చెట్ల కంటే నాటే చెట్లే ఎక్కువ. కొత్తగా తయారవుతున్న పేపర్లో మూడింట ఒక వంతు చెత్త శుద్ధీ కరణ ద్వారానే వస్తోంది. భారత్‌లో పేపర్ కంపెనీలకు 46 శాతం ముడి సరుకు తాము సేకరించిన పేపర్ నుంచే వస్తోంది. మిగిలిన ముడి సరుకులో 27 శాతం వ్యవసాయ వ్యర్థాలైన బగాసే, స్ట్రా రూపంలో... 27 శాతం చెట్ల కలప రూపంలో ఉంటోంది’’ అని ఈ అధ్యయనం వాస్తవాలను తేటతెల్లం చేసింది. పేపర్ అన్నది అక్షరాస్యతను, పరిశుభ్రతను పెంచడంతో పాటు బగాసేను వినియోగించడం ద్వారా కాలుష్యం తగ్గుతోందని వివరించింది. ఒక టన్ను పేపర్‌కు 2.1 టన్నుల కలప అవసరమని, అటవీ కలపను పేపర్ తయారీకి వినియోగించడం లేదని వెల్లడించింది. పేపర్‌కే ఖర్చు తక్కువ... ‘‘పేపర్‌ను రీసైకిల్ చేయటానికి కిలోకు రూ.32 ఖర్చవుతోంది. ఇందులో రూ.20 పాతవి సేకరించడానికి, రూ.12 రీసైకిల్‌కు కాగా... కిలో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయాలంటే సేకరణ ఖర్చు రూ.22–35, రీసైకిల్‌కు రూ.30–36 అవుతోంది. రవాణాకు కూడా టన్ను పేపర్‌కు కిలోమీటర్‌కు రూ.4.5 అయితే.. ప్లాస్టిక్‌కు రూ.6.2 అవుతోంది’’ అంటూ నివేదిక వివరించింది. ఇంధన వినియోగం కూడా పేపర్‌కు చాలా తక్కువని, 55–60 శాతం ఇంధనాన్ని ఆదా చేయొచ్చునని హైవ్ ఇండియా డైరెక్టర్ సంజీవ్ బాత్రా చెప్పారు. -
సత్తా చాటిన రిలయన్స్ జియో
సాక్షి, హైదరాబాద్ : జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రెవెన్యూ మార్కెట్ వాటా (ఆర్ఎంఎస్)ను మరింత పటిష్టం చేసుకుంది. ముఖ్యమైన మెట్రో నగరాల్లో, గ్రామీణ ప్రాంతాలలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఫలితంగా ఈ అంశంలో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని భారతి ఎయిర్టెల్ షాక్ ఇచ్చి టాప్‌లోకి దూసుకు వచ్చింది. ఈ మేరకు బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఈ నివేదికను వెల్లడించింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ డేటా ప్రకారం ముకేశ్ అంబానీ నేతృత్వంలొని జియో సెప్టెంబర్ త్రైమాసికంలో బలమైన 348 బేసిస్ పాయింట్లు (బీపీఎస్)తో ఆర్ఎంఎస్ 35 శాతానికి చేరుకోగా, భారతి ఎయిర్టెల్ (టాటా టెలిసర్వీస్‌తో సహా) 32.1 శాతం ఆర్‌ఎంఎస్‌తో ఈ త్రైమాసికంలో 70 బీపీఎస్‌లు సాధించింది. అయితే మొదటి స్థానంలో ఉన్నవొడాఫోన్ ఐడియా సెప్టెంబరు త్రైమాసికంలో 66 బీపీఎస్, 27.2 శాతం క్షీణతను నమోదు చేసింది. మొత్తం 22 ప్రధాన మార్కెట్లతో 20 సర్కిల్స్‌లో మార్కెట్ వాటాను కోల్పోయింది తెలంగాణలో కూడా, జియో 37శాతం రెవెన్యూ మార్కెట్ వాటాతో తన నాయకత్వస్థానాన్ని జియో మరింత బలోపేతం చేసుకుంది. ఎయిర్టెల్ 36.5శాతం, వొడాఫోన్ ఐడియా 20శాతం మార్కెట్ వాటాతో సరిపెట్టుకున్నాయి. చందాదారుల సంఖ్య విషయానికొస్తే, జూలై-సెప్టెంబర్ కాలంలో జియో 24 మిలియన్ల కస్టమర్లను చేర్చుకుంది. ఈ త్రైమాసికం ముగింపునాటికి జియో 4జీ యూజర్ బేస్ 355.2 మిలియన్లకు చేరుకుంది. కాగా జూన్ క్వార్టర్లో జియో ఆర్ఎంఎస్ 31.7 శాతంగా ఉండగా, ఎయిర్టెల్ ఆర్ఎంఎస్ 30 శాతంగా ఉంది. -
టాప్ గేర్‌లో మారుతి సియాజ్
న్యూఢిల్లీ: ప్రీమియం సెడాన్ విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) సియాజ్ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో 24,000 కార్ల విక్రయం నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్యాటగిరీలో 28.8 శాతం మార్కెట్ వాటాను కలిగిఉన్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ వెల్లడించారు. 2014లో విడుదలైన సెడాన్.. ఇప్పటివరకు 2.34 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. ఆగస్టులో విడుదలైన వెర్షన్ బుకింగ్స్ 10,000గా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. -
గ్లోబల్‌గా కూడా జియోదే రాజ్యం..!
రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తూ తీసుకొచ్చిన జియోఫోన్ ఇటు భారత్‌లోనే కాక, అటు ప్రపంచవ్యాప్తంగా తన పేరును మారుమ్రోగించుకుంటోంది. 2018 తొలి త్రైమాసికంలో గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో రిలయన్స్ జియోఫోనే అగ్రస్థానంలో నిలిచింది. 15 శాతం షేరుతో రిలయన్స్ జియోఫోన్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. జియోఫోన్ అనంతరం నోకియా హెచ్ఎండీ, ఇంటెల్, శాంసంగ్, టెక్నో కంపెనీలు నిలిచినట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. రిలయన్స్ జియోఫోన్ బలమైన షిప్మెంట్లతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో వార్షికంగా 38 శాతం వృద్ధి సాధించినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో నోకియా హెచ్ఎండీ 14 శాతం మార్కెట్ షేరును సంపాదించుకోగా, ఇంటెల్ 13 శాతం, శాంసంగ్ 6 శాతం, టెక్నో 6 శాతం మార్కెట్ షేరును పొందినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. ప్రతేడాది 50 కోట్ల ఫీచర్ ఫోన్లు విక్రయమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల ఫీచర్ ఫోన్లు అవసరం ఉందని ఈ మార్కెట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. ఓ వైపు మొబైల్ మార్కెట్లో స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్నప్పటికీ, ఫీచర్ ఫోన్లు మాత్రం తన సత్తా చాటుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది స్మార్ట్ఫోన్ల కంటే ఫీచర్ ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారు. 2018 తొలి త్రైమాసికంలో భారత్ ఒక్క దేశమే మొత్తం ఫీచర్ ఫోన్ షిప్మెంట్లలో సుమారు 43 శాతం స్థానాన్ని సంపాదించుకుంది. కొంతమంది ఫీచర్ ఫోన్ కొనుగోలుదారులు డిజిటల్, ఎకనామిక్, అక్షరాస్యత వంటి విషయాల్లో వెనుకబడి ఉండటం, ఖరీదైన స్మార్ట్ఫోన్లను, వాటి డేటా ప్లాన్లను అందిపుచ్చుకునే స్థాయి లేకపోవడమే ఫీచర్ ఫోన్ వృద్ధికి సహకరిస్తుందని రీసెర్చ్ సంస్థ తెలిపింది. మొబైల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫీచర్ ఫోన్ సెగ్మెంట్‌కు భారీ అవకాశాలున్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. -
జియో దుమ్మురేపుతోంది...
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తూ... మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో, అంతకంటే శరవేగంగా మార్కెట్ షేరును తన సొంతం చేసుకుంటోంది. కేవలం 16 నెలల్లోనే దేశీయ మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది. ఆర్థిక సంవత్సరం 2017-18 డిసెంబర్ క్వార్టర్లో రిలయన్స్ జియో మార్కెట్ షేరు 19.7 శాతానికి విస్తరించినట్టు వెల్లడైంది. ఇది ఐడియా సెల్యులార్ లిమిటెడ్ కంటే అత్యధికం. రిలయన్స్ జియోకు చెక్ పెట్టడానికే ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు జతకట్టబోతుండగా... వారికి మరింత షాకిస్తూ ఐడియా సెల్యులార్ కంటే అత్యధికంగా మార్కెట్ షేరు రిలయన్స్ జియో తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం రిలయన్స్ జియో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించాలంటే కేవలం 90 బేసిస్ పాయింట్లే అవసరమని బ్లూమ్‌బర్గ్ క్వింట్ రిపోర్టు చేసింది. గత క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో రిలయన్స్ జియో రెవెన్యూ మార్కెట్ షేరు 584 బేసిస్ పాయింట్లు పెరిగిందని తెలిసింది. సబ్‌స్క్రైబర్ బేస్ కూడా 16 కోట్లను తాకింది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో జియో 23 బిలియన్ డాలర్లను మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టనుందని టెలికాంటాక్ రిపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో మరింత వేగంగా మార్కెట్లో దూసుకుపోతుందని తెలిపింది. -
దూసుకెళ్తున్న పతంజలి మార్కెట్ షేరు
ముంబై : పతంజలి దంత్ కాంతి మార్కెట్ షేరు శరవేగంగా దూసుకెళ్తోంది. ఎప్పటినుంచో మార్కెట్లో పాతుకుపోయిన హిందూస్తాన్ యూనీలివర్ పెప్సోడెంట్, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ వంటి వాటికి చెక్ పెడుతూ.. పతంజలి మార్కెట్ షేరు ఒక్క ఏడాదిలోనే మూడింతలు పెంచుకుంది. బాంబా రాందేవ్‌కు చెందిన ఈ బ్రాండు జూన్ క్వార్టర్ ముగిసేసరికి 6.2 మార్కెట్ షేరును సొంతం చేసుకుంది. దీంతో దేశంలోనే నాలుగో అతిపెద్ద టూపేస్ట్ కంపెనీగా అవతరించింది. గతేడాది దీనికి 2.2 శాతం మాత్రమే మార్కెట్ షేరు ఉంది. అయితే పతంజలి మార్కెట్లో దూసుకెళ్తున్నప్పటికీ, కోల్గేట్ మాత్రం తన ఆధిపత్య స్థానాన్ని కోల్పోలేదు. ఇప్పటికే సగం మార్కెట్‌ను అంటే 52.7 శాతాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. కానీ 120 బేసిస్ పాయింట్లను మాత్రం కోల్గేట్ కోల్పోయింది. ఇదే క్రమంలో హిందూస్తాన్ యూనీలివర్ షేరు 240 బేసిస్ పాయింట్లు క్షీణించి 17.6 శాతానికి పడిపోయింది. పతంజలితో పాటు హెర్బల్ ఉత్పత్తుల బ్రాండు డాబర్ కూడా మార్కెట్లో మంచి స్థానాన్నే సంపాదించుకుంది. ఈ బ్రాండు మార్కెట్ షేరు కూడా 20 బేసిస్ పాయింట్లు పెరిగి 12.1 శాతంగా నమోదైంది. ఆయుర్వేద ఉత్పత్తులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతుండటంతో చాలా కంపెనీలు హెర్బల్ వేరియంట్లలో టూత్‌పేస్ట్‌లను అందించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ ఉత్పత్తులైతే, సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతున్నాయో అవి ప్రస్తుతం మొత్తం టూత్‌పేస్ట్ మార్కెట్లో ఐదవంతు మార్కెట్ షేరును ఆక్రమించుకున్నాయి. దంత్ కాంతి బ్రాండులోనే కొత్త వేరియంట్లను తీసుకొచ్చేందుకు తాము ప్లాన్ చేస్తున్నామని పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అధికారిక ప్రతినిధి ఎస్కే టిజారవాలా చెప్పారు. అలోవీరా, ఫ్రెష్ యాక్టివ్ జెల్, రెడ్ టూత్‌పేస్ట్‌లలో కూడా కొత్త వేరియంట్లను తీసుకొచ్చి, తమకున్న మార్కెట్ షేరును మరింత పెంచుకోనున్నామని తెలిపారు. తమ కొత్త ఉత్పత్తులన్నింటికీ ఆయుర్వేద పద్ధతులు వాడుతామని, కానీ దాని వెనుకాల ఉన్న సైన్సును అర్థం చేసుకోకుండా.. బహుళ జాతీయ కంపెనీలు వాటిని కాపీ కొడుతున్నాయని చెప్పారు. దంత్ కాంతికి కౌంటర్‌గా కోల్గేట్ కూడా ఏడాది క్రితమే తన తొలి ఆయుర్వేద బ్రాండును తీసుకొచ్చింది. హెచ్‌యూఎల్ కూడా ఆయుర్వేద పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌లను లాంచ్ చేస్తోంది. కానీ వాటికంటే శరవేగంగా పతంజలి ఉత్పత్తులే మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. -
ప్రత్యర్థుల గట్టిపోటీ: రిలయన్స్ ఢమాల్
న్యూఢిల్లీ : రిలయన్స్ ... ఇటు జియోతో టెలికాం మార్కెట్ లో సంచలనాలు సృష్టించడమే కాకుండా.. ఎల్వైఎఫ్ డివైజ్ లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోనూ టాప్-5లో ఒకటిగా తన చక్రం తిప్పింది. సూపర్ హిట్ తో లాంచ్ అయిన రిలయన్స్ రిటైల్ ఎల్వైఎఫ్ డివైజ్ ల ప్రస్తుత పరిస్థితి దారుణంగా మారుతోంది. గతేడాది ఎంత వేగంగా అయితే దూసుకెళ్లాయో అంతే వేగంతో ఈ ఏడాది తమ మార్కెట్ షేరును కోల్పోయాయి. 4జీ ఫోన్ల ప్రత్యర్థులు చైనీస్ కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ షేరును కోల్పోతున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఇదేకాలంలో 7 శాతం ఎక్కువ నమోదైన రిలయన్స్ ఎల్వైఎఫ్ మార్కెట్ షేరు, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్ లో 3 శాతం కిందకి పడిపోయినట్టు అనాలిస్టులు అంచనావేస్తున్నారు. ఈ ఫోన్ల సరుకు రవాణా కూడా తగ్గిపోయినట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్, సైబర్ మీడియా రీసెర్చ్ చెబుతోంది. రిలయన్స్ జియో తిరుగులేకుండా దూసుకెళ్తున్న క్రమంలో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ-ఎనాబుల్ స్మార్ట్ ఫోన్లను ఎల్వైఎఫ్ బ్రాండులో ఈ కంపెనీ ప్రవేశపెట్టింది. జియో ప్రీవ్యూ ఆఫర్ కూడా తొలుత వీటికే ఆఫర్ చేయడంతో, భారీగా డిమాండ్ ఏర్పడి, భారీ ఎత్తున్న సరుకు రవాణా జరిగినట్టు తెలిసింది. 2016లో రిలయన్స్ జియో ప్రీవ్యూ ఆఫర్ కేవలం ఎల్వైఎఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఇచ్చారని, కానీ ప్రస్తుతం జియో అన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండులకు భాగస్వామిగా వ్యవహరిస్తుందని కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ అనాలిస్టు శోభిత్ శ్రీవాత్సవ చెప్పారు. అంతేకాక ప్రస్తుతం అందరూ ప్లేయర్స్ 4జీ ఫోన్లను ఆఫర్ చేయనప్పటికీ, వారి పోర్టుఫోలియోలో ఇది ఒకభాగమైందని ఐడీసీ ఇండియా సీనియర్ అనాలిస్టు నవ్కేందర్ సింగ్ పేర్కొన్నారు. అయితే పడిపోతున్న తమ స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేరుపై స్పందించడానికి రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలు నిరాకరించాయి. రూ.2,999 నుంచి రూ.30,000 ధరల మధ్యలో రిలయన్స్ 4జీ డివైజ్ లను గతేడాది తీసుకొచ్చింది. 2016లో 7.6 మిలియన్ స్మార్ట్ ఫోన్ల సరుకు రవాణా జరిగింది. ప్రస్తుతం రూ.999 నుంచి రూ.1,500 మధ్యలో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసేందుకు జియో సన్నాహాలు చేస్తోంది. -
దూసుకుపోతున్న జియో
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో దేశీయ టెలికాం రంగంలో సునామీలా దూసుకుపోతోంది. ఇప్పటికే ఉచిత ఆఫర్లతో మేజర్ టెలికం కంపెనీల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జియో టెలికాం మార్కెట్ లో వినియోగదారుల పరంగా 23శాతం మార్కెట్ షేర్ ను సొంతం చేసుకుంది. మొబైల్ కమ్యూనికేషన్ యాప్ ట్రూ కాలర్ కు చెందిన ట్రూ ఇన్సైట్ క్యూ 4 నివేదికలో ఈ వివరాలను బుధవారం వెల్లడించింది. గత ఆరునెలల గణాంకాలను పరిశీలించిన మీదట ఈ వివరాలను ప్రకటించినట్ టుతెలిపింది. 2016 వేసవి తరువాత బాగా పెరిగిన జియో వినియోగదారుల సంఖ్య ఏడాది చివరికి మరింత దూసుకుపోయిందని రిపోర్ట్ చేసింది. దీని ప్రకారం భారతీయ టెలికం మార్కెట్ లో రెండవ స్థానంలోకి దూసుకు వచ్చింది. ప్రధానంగా ఉచిత డ్యాటా, వాయిస్ కాలింగ్ సేవల లాంచింగ్ తో 2016 అర్థభాగంలో బాగా విస్తరించిందని నివేదించింది. ఉచిత సేవలు ప్రారంభించిన మూడు నెలల్లో నవంబర్ లో 16.2 మిలియన్లుగా ఉన్న ఖాతాదారుల సంఖ్య తాజాగా 51.87 మిలియన్లకు చేరింది. 2016 నవంబర్ చివరినాటికి ట్రాయ్ అంచనాల ప్రకారం టెలికాం చందాదారుల సంఖ్య 1.2 బిలియన్లను తాకింది 30 సెకన్లలోపు జియో యూజర్స్ కాల్స్, వోడాఫోన్ 41 సెంకండ్లలో కాల్ చేస్తున్నట్టు గుర్తించింది. జియో ద్వారా పెరిగిన సబ్ స్క్రైబర్ల తో కలిపి మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 2017 చివరి నాటికి 500 మిలియన్లకు పైగా వినియోగదారులు పెరగనున్నారని ట్రాయ్ భావిస్తోంది. ముఖ్యంగా ఈ పెరుగుదలలో ప్రధాన వాటా రిలయన్స్ జియో ఇన్పోకాం దే కానుందట. అలాగే ట్రాయ్ నవంబర్ గణాంకాల ప్రకారం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా ముందంజలో ఉందని తెలిపింది. ఆతరువాత ఐడియా 2.52 మిలియన్ల కొత్తగా వినియోగదారులు, భారతి ఎయిర్ టెల్ 1.08, వోడాఫోన్ 890.794 కొత్త చందాదారులు జోడించుకుందట. కాగా జియో ఉచిత సేవలు తాజా న్యూ ఇయర్ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. -
నగదుంటే మొదట వాటిని కొనేయండి!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై దలాల్ స్ట్రీట్‌లోని విశ్లేషకులందరూ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతుంటే, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టరు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మాత్రం బుల్ ఆశలు రేకెత్తిస్తున్నారు. 'నగదు రద్దు అనేది చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ మీ దగ్గర నగదుంటే, వెళ్లి ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ కొనుగోలు చేయండి' అంటూ పిలుపునిచ్చారు. నిఫ్టీ 50 మళ్లీ తన స్థానాన్ని పునరుద్ధరించుకుంటుందని, కిందకి పడిపోవడం కేవలం పరిమితమేనని చెబుతున్నారు. నిఫ్టీ 8200కి ఎగుస్తుందని పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు షాక్ నుంచి మార్కెట్లు చాలా త్వరగా సాధారణ స్థితికి వస్తాయని ఝున్‌ఝున్‌వాలా అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా పెద్ద నోట్ల రద్దు, అంతర్జాతీయంగా అనూహ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం వంటి వాటివల్ల ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అంతేకాక ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడం వల్ల కూడా విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయాయని అన్నారు. కానీ పెద్ద నోట్ల రద్దు చరిత్రను సృష్టిస్తుందని తెలియగానే, ఎఫ్ఐఐల ట్రెండ్ రివర్స్ అయిందన్నారు. సానుకూలమైన కేంద్ర బడ్జెట్ మార్కెట్లు పైకి ఎగియడానికి దోహదం చేస్తుందని ఝున్‌ఝున్‌వాలా ఆశిస్తున్నారు. వచ్చే బడ్జెట్లో ఎలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుందని తాను భావించడం లేదన్నారు. పీఎస్‌యూ బ్యాంకుల స్థానాన్ని ప్రైవేట్ రంగ షేర్లు లాగేసుకుంటాయని, ప్రజలు సొరుగుల్లో దాచిన నగదును బ్యాంకుల్లోకి మార్చే సమయం ఆసన్నమైందన్నారు. గత ఆరేళ్లుగా చెత్త పనితీరును కనబరుస్తున్న ఫార్మా రంగంలో కొనుగోలు మద్దతు లభించిందన్నారు. తను కలిగి ఉన్న షేర్లలో ఇండిగో బేరిస్ ట్రెండ్‌ను చూస్తుందనుకోవడం లేదని, పెద్ద నోట్ల రద్దు టైటాన్‌ను మరింత పాజిటివ్‌గా మారుతుందని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. -
క్యూ2లో 60 శాతం మార్కెట్ వాటా
• రూ.10 వేల లోపుండే కన్జూమర్ డ్యూరబుల్స్‌లో.. • తొలిసారి 0 శాతం వడ్డీకి రుణాలు • హోమ్ క్రెడిట్ ఇండియా సీఎంఓ థామస్ హృడికా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) హోమ్ క్రెడిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2016 రెండో త్రైమాసికంలో 60 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. హైదరాబాద్‌లో రూ.10 వేలలోపు కన్జూమర్ డ్యూరబుల్ రుణాల విభాగంలో ఈ ఘనత సాధించినట్లు హోమ్ క్రెడిట్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ థామస్ హృదికా గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారి కస్టమర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై 0% వడ్డీకి రుణాలను ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఇందుకోసం జియోని, ఇంటెక్స్, లావా, మైక్రోమ్యాక్స్, ఒప్పో వంటి అన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. రెండేళ్ల క్రితం నగరంలో కార్యకలాపాలను ప్రారంభించిన హోమ్ క్రెడిట్‌కు ప్రస్తుతం 250 పీఓఎస్‌లు ఉన్నాయని, ఈ ఏడాది చివరికి 400కు విస్తరిస్తామన్నారు. సెల్ఫోన్లు, గృహోపకరణాలు, ద్విచక్రవాహనాల కొనుగోలుదారులకు కేవలం 5 నిమిషాల్లోనే రుణాలు పొందేలా టెక్నాలజీని అభివృద్ధి చేశామని... ఆయా స్టోర్లలోనే ఫైనాన్సింగ్ సేవలను అందించడం తమ ప్రత్యేకతని తెలియజేశారు. మనదేశంతో పాటు యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా వంటి 10 దేశాల్లో సేవలందిస్తోంది. -
కొత్త ఫోన్లపై శాంసంగ్ ఫోకస్
భారత్.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు అతి పెద్ద మార్కెట్. స్మార్ట్ ఫోన్ల కంపెనీల్లో రారాజుగా ఉన్న అటు శాంసంగ్ నుంచి అన్ని కంపెనీ చూపు భారత్ వైపే. దీంతో తన రారాజు స్థానాన్ని కొనసాగించడంతో పాటు, మార్కెట్ షేరును మరింత దోచేయడానికి భారత్ లో కొత్త కొత్త ఫోన్ల ఆవిష్కరణలపై శామ్ సంగ్ దృష్టిసారించేందుకు సిద్ధమైంది. వినూత్న లక్షణాలతో, తన స్థానాన్ని స్థిరంగా కొనసాగిస్తూ.. మార్కెట్ షేరును మరింత సొంతచేసుకోనుందని కంపెనీకి చెందిన టాప్ అధికారులు చెప్పారు. వివిధ ధరల్లో అన్ని విభాగాల్లో స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించే దృష్టిని కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇన్నోవేషన్ అనేది ప్రధానమైన అంశంగా.. వినూత్న లక్షణాలతో కొత్త ప్రొడక్ట్ లను భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్టు శాంసంగ్ వైస్ ప్రెసిడెంట్(ప్రొడక్ట్ మార్కెటింగ్) మను శర్మ తెలిపారు. 2015 జనవరిలో 35శాతం ఉన్న మార్కెట్ షేరును ప్రస్తుతం 48.3శాతానికి పెంచుకున్నామని ప్రకటించారు. కొత్త స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణతో గతేడాది నుంచి 10 శాతానికి పైగా మార్కెట్ షేరును దక్కించున్నామని వెల్లడించారు. 4జీ మార్కెట్లో శామ్ సంగ్ మార్కెట్ షేరు 60శాతానికి పైగానే ఉందని, స్మార్ట్, ఫీచర్ వంటి అన్నిరకాల ఫోన్లలో శాంసంగ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ లో కూడా 30శాతం మార్కెట్ షేరును కలిగిఉంది. టర్బో స్పీడ్ టెక్నాలజీ(టీఎస్టీ), స్మార్ట్ గ్లో, తర్వాతి తరం కలర్ ఎల్ఈడీ నోటిఫికేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లతో శామ్ సంగ్ నుంచి కొత్త ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నట్టు కంపెనీ తెలిపింది. టీఎస్టీ టెక్నాలజీ డివైజ్ ల పనితీరును మరింత మెరుగుపరుస్తుందని, డబుల్ ర్యామ్ డివైజ్ లకంటే 40శాతం వేగంగా నేటివ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోగలుగుతారని శాంసంగ్ పేర్కొంది. -
పండుగల నాటికి మరో రెండు మోడళ్లు
* మార్కెట్ వాటాను కొనసాగిస్తాం * మారుతి సుజుకి ఈడీ ఆర్.ఎస్.కల్సి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి పండుగల నాటికి మరో రెండు మోడళ్లను ప్రవేశపెడుతోంది. వీటిలో ఒకటి ఇగ్నిస్ క్రాస్ఓవర్ కాగా, మరొకటి బూస్టర్‌జెట్ ఇంజన్‌తో కూడిన బాలెనో ఆర్ఎస్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మరొకటి. భారత ప్యాసింజర్ విపణిలో మే నెలలో కంపెనీ 48.5 శాతం వాటాను దక్కించుకుందని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ ఈడీ ఆర్.ఎస్.కల్సి సోమవారం తెలిపారు. బాలెనో, బ్రెజ్జా మోడళ్లు ఉత్తమ పనితీరు కనబరుస్తున్నాయని, వెయిటింగ్ పీరియడ్ ఆరు నెలల దాకా ఉందని వివరించారు. కంపెనీ తన మార్కెట్ వాటాను రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాబూ ఆర్కేఎస్ మోటార్ కుషాయిగూడలో ఏర్పాటు చేసిన షోరూంను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమ వృద్ధి ఈ ఏడాది 6-8 శాతం ఉండొచ్చన్నారు.కొత్తగా ప్రారంభించిన షోరూంతో కలిపి సాబూ ఆర్కేఎస్ మోటార్‌కు అయిదు మారుతి సుజుకి ఔట్లెట్లు ఉన్నాయి. ఒకటి నెక్సా, మూడు మారుతి ట్రూ వాల్యూ, ఏడు వర్క్‌షాప్స్, రెండు డ్రైవింగ్ స్కూళ్లను నిర్వహిస్తున్నట్టు సాబూ ఆర్కేఎస్ మోటార్ సీఎండీ వినయ్ సాబూ తెలిపారు. 20 ఏళ్ల ప్రస్థానంలో తమ సంస్థ లక్ష మందికిపైగా కస్టమర్లను సొంతం చేసుకుందని కంపెనీ డెరైక్టర్ తనయ్ సాబూ పేర్కొన్నారు. కార్యక్రమంలో మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ ఈడీ టి.హషిమోటో పాల్గొన్నారు. -
ఐఫోన్‌కు కలిసి రాని కాలం
ఐఫోన్... ఓ బ్రాండ్, ఓ ఇమేజ్ అంటూ వినియోగదారుల మదిలో తెగ ఆశలు కల్పించిన యాపిల్ కంపెనీకి 2016 నిరాశపరుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఐఫోన్ ఎస్ఈ మోడల్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. గతవారం ఐఫోన్ ఎస్ఈ అమ్మకాలు మొత్తం ఐఫోన్ మోడల్ ఫోన్లలో 0.1 శాతం మాత్రమేనని లోకలిస్టిక్ సర్వేలు వెల్లడించాయి. పాత ఐఫోన్ మోడళ్ల కంటే వీటి అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాయి. పాత మోడళ్లకు కొన్ని లేటెస్ట్ ఫీచర్లను కలిపిన యాపిల్, ఐఫోన్ ఎస్ఈని 399 డాలర్లతో (రూ.26,557) మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కాని ఆ ఫోన్ విడుదలైనప్పటి నుంచి ఐఫోన్ అమ్మకాలు ఏ మాత్రం పెరగలేదు. ఐఫోన్ 7ఎస్ మోడల్ విడుదల చేసినా కూడా అది ఈ ఫోన్ అమ్మకాలను పెద్దగా కాపాడగలిగే పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి. -
డెబిట్ కార్డ్స్ మార్కెట్లో రూపే వాటా 38 శాతం
ముంబై: రూపే కార్డ్స్ మార్కెట్ వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. దేశంలో జారీ అయిన రూపే డెబిట్ కార్డుల సంఖ్య జనవరి నాటికి 24.7 కోట్లుగా ఉంది. జారీ అయిన మొత్తం 64.5 కోట్ల డెబిట్ కార్డుల్లో దీని వాటా 38 శాతం. రూపే కార్డ్స్ మార్కెట్ వాటా పెరుగుదలకు కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం బాగా దోహదపడింది. రూపే కార్డుల జారీ ఎక్కువగా జన్ ధన్ ఖాతాలకే జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో జేఎం ఫైనాన్షియల్ ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. రూపే కార్డుల మార్కెట్ వాటా ఏటీఎం లావాదేవీల వారీగా చూస్తే 20.4 శాతంగా, పాయింట్ ఆఫ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ ప్రకారం చూస్తే 4.1 శాతంగా ఉంది. ఇక ఆన్లైన్ లావాదేవీల్లో రూపే వాటా 1.6 శాతం. కాగా సంస్థ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూపే క్రెడిట్ కార్డులను కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. -
కోటి దాటిన సీడీఎస్ఎల్ డీమ్యాట్ అకౌంట్లు
న్యూఢిల్లీ: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా(సీడీఎస్ఎల్)లో ఉన్న డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య ఆగస్టు చివరినాటికి కోటిని దాటింది. డీమ్యాట్ అకౌంట్ల విషయంలో నిలకడైన వృద్ధిని సాధిస్తున్నామని సీడీఎస్ఎల్ తెలిపింది. మొత్తం డీమ్యాట్ అకౌంట్లలో తమ వాటా 42 శాతమని తెలిపింది. పదేళ్లలో తమ మార్కెట్ వాటాలో 54% వృద్ధి సాధించామని సీడీఎస్ఎల్ చైర్మన్ ఎన్.రంగాచారి చెప్పారు. కస్టడీ చార్జీలు లేకపోవడం, డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చే సెక్యూరిటీలపై చార్జీలు విధించకపోవడం, టారిఫ్‌లను తగ్గించడం, సేవల్లో నాణ్యత తమ మార్కెట్ మెరుగుదలకు కారణమన్నారు. -
భారత్‌లోకి ‘చైనా యాపిల్’!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన షియోమి కంపెనీ భారత్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు భారత్‌లో అందిస్తోంది. వచ్చేవారం నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమవుతాయని షియోమి వెబ్సైట్ పేర్కొంది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ల విక్రయాలు జరిగే అవకాశాలున్నాయి. 86 సెకన్లలో లక్ష ఫోన్ల విక్రయాలు ఈ కంపెనీ ఎంఐయూఐ వీ5 పేరుతో ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ను కస్టమైజ్ చేసింది. ఎంఐయూఐ వీ5 ఓఎస్‌పై పనిచేసే ఈ ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల ఫుల్ హెచ్డీ 1080పి ఎల్సీడీ టచ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 800 2.3 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, అడ్రెనో 330 450 మెగా హెర్ట్జ్ జీపీయూ, 2 జీబీ ర్యామ్, ఈఎంఎంసీ 4.5 ఫ్లాష్ మెమరీ, 16 జీబీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3050 ఎంఏహెచ్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తులకు చైనాలో ఎంత క్రేజ్ ఉందంటే, ఆన్లైన్లో ఎంఐ 3 ఫోన్లు 86 సెకన్లలోనే లక్ష అమ్ముడు కావడం విశేషం. ఆన్లైన్లోనే అమ్మకాలు షియోమి కంపెనీ ప్రపంచంలోనే ఆరవ, చైనాలో మూడో అతి పెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీ. 2010లో ఈ కంపెనీని లీ జున్ ప్రారంభించారు. బీజింగ్ కేం ద్రంగా పనిచేసే ఈ కంపెనీ అనతికాలంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఈ సంస్థ ఇప్పటికే 1.7 కోట్ల హ్యాండ్సెట్లను విక్రయించింది. ఎంఐ 3, రెడ్మి, ఎంఐ వై-ఫై, ఎంఐ బాక్స్ తదితర హ్యాండ్సెట్లను అందిస్తోంది. ఈ కంపెనీ ఆన్లైన్లోనే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. రిటైల్ స్టోర్స్‌లో ఎక్కడా తన ఫోన్లను విక్రయించదు. ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో 1 శాతమే మార్కెటింగ్‌కు కేటాయిస్తోంది(శామ్సంగ్ కేటాయింపు 5.1%). ఇలా ఆదా చేసిన సొమ్ములతో నాణ్యమైన విడిభాగాలను కొనుగోలు చేసి అత్యంత ఆధునిక ఫీచర్లున్న ఫోన్లను తక్కువ ధరకే అందిస్తోంది. షియోమి కంపెనీ భారత కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ చూస్తారు. ఈ మేరకు షియోమి కం పెనీ ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. హువాయి, జెడ్‌టీఈ, లెనొవొ, జియోని, అప్పో వంటి ఇతర చైనా కంపెనీలు ఇప్పటికే భారత్‌లో స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నాయి. -
డాట్సన్ మళ్లీ వచ్చెన్..
న్యూఢిల్లీ: జపాన్ వాహన దిగ్గజం, నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌ను మరలా అంతర్జాతీయ మార్కెట్లోకి తెచ్చింది. డాట్సన్ బ్రాండ్‌లో ఎంట్రీ లెవల్ కార్, డాట్సన్ గోను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్ తర్వాత ఇండోనేషియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ కార్లను నిస్సాన్ కంపెనీ విడుదల చేయనున్నది. ఈ కారు ధరలు రూ.3.12 లక్షల నుంచి రూ.3.70 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత డాట్సన్ బ్రాండ్‌ను నిస్సాన్ కంపెనీ మార్కెట్లోకి తెస్తోంది. నిస్సాన్ కంపెనీ 1980ల్లో డాట్సన్ బ్రాండ్ కార్లను విక్రయించడం ఆపేసింది. అప్పటికి 80 ఏళ్లుగా 190 దేశాల్లో 2 కోట్లకు పైగా డాట్సన్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ డాట్సన్ గో కారు రాకతో చిన్న కార్ల సెగ్మెంట్లో పోటీ తీవ్రం కానున్నదని నిపుణులంటున్నారు. ఈ కారు మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో 800(రూ.2.37లక్షలు-రూ.3.52 లక్షలు), ఆల్టో కే10(రూ.3.15 లక్షలు-రూ.3.31 లక్షలు), హ్యుందాయ్ ఈఆన్(రూ.2.83 లక్షలు-రూ.3.85 లక్షలు)లకు గట్టి పోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లలో మూడు మోడళ్లు.. భారత కార్ల మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్లోకి డాట్సన్ బ్రాండ్‌తో ప్రవేశిస్తున్నామని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో కెనిచిరో యోముర చెప్పారు. నిస్సాన్ కంపెనీ మొత్తం భవిష్యత్తు అమ్మకాల్లో డాట్సన్ అమ్మకాలు సగం నుంచి మూడో వంతు వరకూ ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. రెండేళ్లలో మూడు డాట్సన్ మోడళ్లను అందించనున్నామని, త్వరలో రెండో మోడల్ డాట్సన్ గో ప్లస్‌ను తేనున్నామని పేర్కొన్నారు. భారత్, రష్యా, బ్రెజిల్ వంటి అధిక వృద్ధి ఉన్న దేశాల్లో తొలిసారిగా కార్లను కొనుగోలు చేసే వినియోగదారుల కారణంగా కొత్త కార్లకు డిమాండ్ పెరుగుతోందని డాట్సన్ గ్లోబల్ ప్రోగ్రామ్ డెరైక్టర్ అశ్విని గుప్తా చెప్పారు. అందుకే తొలిసారిగా కార్లు కొనే వినియోగదారులు లక్ష్యంగా ఈ కారును అందిస్తున్నామని వివరించారు. కారు ప్రత్యేకతలు... ఐదు డోర్ల ఫ్రంట్ వీల్ డ్రైవ్ డాట్సన్ గో కారులో 1.2 లీటర్ల ఇంజిన్, 5 గేర్లు(మాన్యువల్), టిల్ట్ ఎడ్జెస్ట్‌మెంట్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోలు, మొబైల్ డాకింగ్ స్టేషన్, 4 ఏసీ వెంట్లు, ఫాలో మి హెడ్‌ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. పెట్రోల్ మోడల్ డాట్సన్ గో కారు డి, ఏ, టీ... మూడు వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. నిస్సాన్ మైక్రా ఇంజిన్నే దీంట్లోనూ వాడారు. 0-100 కి.మీ వేగాన్ని 15-16 సెకన్లలో అందుకోగల ఈ కారు 20.64 కిమీ మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది. ఈ సెగ్మెంట్ హ్యాచ్‌బాక్ కార్లలో విశాలమైన స్పేస్ (బూట్ స్పేస్ 296 లీటర్లు)ఉన్న కారు ఇదని కంపెనీ పేర్కొంది. ముందు సీట్లు కలిసి ఉండడం వల్ల స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఏబీఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు మాత్రం లేవు. -
రుణం వచ్చేలా వృద్ధులకు పాలసీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేవలం పెన్షన్ పథకాలే కాకుండా పదవీ విరమణ తర్వాత బీమా రక్షణతో పాటు, ఆర్థిక అవసరాలను తీర్చేలా వృద్ధులకు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెస్తోంది బజాజ్ అలయంజ్. ఇప్పటి వరకు వయసుపై బడిన వారికి మార్కెట్లో సరైన బీమా పథకం లేదని, ఆ లోటును భర్తీ చేసేలా త్వరలోనే కొత్త పథకం ప్రవేశపెడుతున్నామంటున్న బజాజ్ అలయంజ్ లైఫ్ ప్రొడక్ట్ హెడ్ రితురాజ్ భట్టాచార్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. కొత్త నిబంధనలు వచ్చాక అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందా? ఈ మార్పులతో ప్రీమియం రేట్లు ఏమైనా పెరిగాయా? మార్పులు జరిగినప్పుడు కొంత ఒడిదుడుకులు ఉండటం సహజం. కొత్త నిబంధనలు వచ్చి నెల రోజులు మాత్రమే అయింది. కాబట్టి అప్పుడే అమ్మకాల గురించి వ్యాఖ్యానించటం కష్టం. మార్పులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం మేం కొత్త పథకాలపై ఏజెంట్లకు అవగాహన కల్పించే పనిలో ఉన్నాం. ఇదంతా పూర్తయి మామూలు పరిస్థితి రావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. మా పథకాల పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్చి కొత్త తరహా పథకాలను ప్రవేశపెట్టడానికి ఈ నిబంధనల మార్పును చక్కగా వినియోగించుకుంటున్నాం. కొత్త నిబంధనలతో బీమా రక్షణ పెరిగింది. ఆ మేరకు ప్రీమియం ధరల్లో కొంత మార్పు ఉండచ్చు కాని ప్రీమియం ధరల్లో భారీ మార్పులేమీ రాలేదు. బజాజ్ అలయంజ్ ఎటువంటి ఉత్పత్తులపై దృష్టిపెడుతోంది? ప్రస్తుతం ఎన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం 8 వ్యక్తిగత బీమా పథకాలు, మరో 8 గ్రూపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలోకి చేరి తొలిసారిగా బీమా తీసుకునే వారికోసం, అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా బీమా రక్షణతో పాటు వారి అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండే పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ముఖ్యంగా జీవించే కాలం పెరుగుతుండటంతో 60 ఏళ్ల పైబడిన వారికి ఉపయోగపడేలా, అవసరమైతే బీమా పథకంపై రుణం తీసుకునే అవకాశం ఉండే హోల్‌లైఫ్ పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ఇంతకాలం బీమారంగం వీరి అవసరాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విభాగంపై మేం ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. వచ్చే నెలలోనే ఇటువంటి పాలసీని ప్రవేశపెట్టనున్నాం. మొత్తం మీద నెలకు 3 పథకాలు చొప్పున ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. టర్మ్, యులిప్, ఎండోమెంట్ అన్ని పథకాలు ఉండే విధంగా బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియోపై దృష్టిసారిస్తున్నాం. కేవలం ఆన్లైన్లో తీసుకునేలా ఏమైనా కొత్త బీమా పథకాలను ప్రవేశపెడుతున్నారా? ప్రత్యేకంగా ఎటువంటి ఆన్లైన్ పథకాలనూ ప్రవేశపెట్టడం లేదు. కాని అన్ని పథకాలనూ ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా తీసుకునే పాలసీలపై ఏజెంట్లకు కమీషన్లు చెల్లించాల్సి ఉండదు కాబట్టి ఆ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. కాని ప్రస్తుతం సరళిని చూస్తే పాలసీ వివరాలను తెలుసుకోవడానికి ఆన్లైన్ ఉపయోగించి, ఆఫ్‌లైన్‌లో పాలసీలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. పాలసీ తీసుకునే సమయంలో ఏజెంట్ సహాయం కావాలనుకోవడం దీనికి ప్రధాన కారణంగా గమనించాం. అలాగే రెన్యువల్ ప్రీమియంలు ఆన్లైన్ ద్వారా చెల్లించే వారి సంఖ్యలో 30 శాతానికిపైగా వృద్ధి నమోదవుతోంది. యులిప్ ఫండ్స్ మార్చుకోవడం, చిరునామా మార్పు వంటి సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నాం. బ్యాంకులు కేవలం ఒక బీమా కంపెనీ పథకాలనే కాకుండా అన్ని బీమా కంపెనీలు పథకాలూ అమ్మేలా ఐఆర్డీఏ విడుదల చేసిన మార్గదర్శకాల సంగతి? మొత్తం వ్యాపారంలో 55 శాతం వరకు బ్యాంకుల నుంచే వస్తోంది. దేశవ్యాప్తంగా 100కిపైగా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. బ్యాంకులను బ్రోకర్లుగా మారిస్తే మా వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. వ్యాపారం సన్నగిల్లడంతో కొన్ని బీమా కంపెనీలు శాఖల సం ఖ్యను తగ్గించుకుంటున్నాయి? బజాజ్ అలయంజ్ పరిస్థితేంటి? గతంలో ఒకే పట్టణంలో నాలుగైదు శాఖలను ఏర్పాటు చేసిన బీమా కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా వాటిని విలీనం చేస్తున్నాయి. శాఖలను పునర్ వ్యవస్థీకరించడం తప్ప పూర్తిగా మూసేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 773 శాఖలు ఉన్నాయి. తగినన్ని శాఖలు ఉండటంతో కొత్తగా ఎటువంటి విస్తరణ కార్యక్రమాల యోచన లేదు.