పండుగల నాటికి మరో రెండు మోడళ్లు
* మార్కెట్ వాటాను కొనసాగిస్తాం
* మారుతి సుజుకి ఈడీ ఆర్.ఎస్.కల్సి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి పండుగల నాటికి మరో రెండు మోడళ్లను ప్రవేశపెడుతోంది. వీటిలో ఒకటి ఇగ్నిస్ క్రాస్‌ఓవర్ కాగా, మరొకటి బూస్టర్‌జెట్ ఇంజన్‌తో కూడిన బాలెనో ఆర్‌ఎస్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మరొకటి. భారత ప్యాసింజర్ విపణిలో మే నెలలో కంపెనీ 48.5 శాతం వాటాను దక్కించుకుందని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ ఈడీ ఆర్.ఎస్.కల్సి సోమవారం తెలిపారు.
బాలెనో, బ్రెజ్జా మోడళ్లు ఉత్తమ పనితీరు కనబరుస్తున్నాయని, వెయిటింగ్ పీరియడ్ ఆరు నెలల దాకా ఉందని వివరించారు. కంపెనీ తన మార్కెట్ వాటాను రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాబూ ఆర్‌కేఎస్ మోటార్ కుషాయిగూడలో ఏర్పాటు చేసిన షోరూంను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమ వృద్ధి ఈ ఏడాది 6-8 శాతం ఉండొచ్చన్నారు.కొత్తగా ప్రారంభించిన షోరూంతో కలిపి సాబూ ఆర్‌కేఎస్ మోటార్‌కు అయిదు మారుతి సుజుకి ఔట్‌లెట్లు ఉన్నాయి.
ఒకటి నెక్సా, మూడు మారుతి ట్రూ వాల్యూ, ఏడు వర్క్‌షాప్స్, రెండు డ్రైవింగ్ స్కూళ్లను నిర్వహిస్తున్నట్టు సాబూ ఆర్‌కేఎస్ మోటార్ సీఎండీ వినయ్ సాబూ తెలిపారు. 20 ఏళ్ల ప్రస్థానంలో తమ సంస్థ లక్ష మందికిపైగా కస్టమర్లను సొంతం చేసుకుందని కంపెనీ డెరైక్టర్ తనయ్ సాబూ పేర్కొన్నారు. కార్యక్రమంలో మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ ఈడీ టి.హషిమోటో పాల్గొన్నారు.