దూసుకెళ్తున్న పతంజలి మార్కెట్‌ షేరు | Market share of Baba Ramdev's Patanjali toothpaste trebles in one year | Sakshi
Sakshi News home page

పతంజలి 'దంత్‌ కాంతి' ధూంధాం

Published Tue, Aug 1 2017 9:16 AM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

దూసుకెళ్తున్న పతంజలి మార్కెట్‌ షేరు

దూసుకెళ్తున్న పతంజలి మార్కెట్‌ షేరు

ముంబై : పతంజలి దంత్‌ కాంతి మార్కెట్‌ షేరు శరవేగంగా దూసుకెళ్తోంది. ఎప్పటినుంచో మార్కెట్‌లో పాతుకుపోయిన హిందూస్తాన్‌ యూనీలివర్‌ పెప్సోడెంట్‌, కోల్‌గేట్‌ యాక్టివ్‌ సాల్ట్‌ వంటి వాటికి చెక్‌ పెడుతూ.. పతంజలి మార్కెట్‌ షేరు ఒక్క ఏడాదిలోనే మూడింతలు పెంచుకుంది. బాంబా రాందేవ్‌కు చెందిన ఈ బ్రాండు జూన్‌ క్వార్టర్‌ ముగిసేసరికి 6.2 మార్కెట్‌ షేరును సొంతం చేసుకుంది. దీంతో దేశంలోనే నాలుగో అతిపెద్ద టూపేస్ట్‌ కంపెనీగా అవతరించింది. గతేడాది దీనికి 2.2 శాతం మాత్రమే మార్కెట్‌ షేరు ఉంది.
 
అయితే పతంజలి మార్కెట్‌లో దూసుకెళ్తున్నప్పటికీ, కోల్గేట్‌ మాత్రం తన ఆధిపత్య స్థానాన్ని కోల్పోలేదు. ఇప్పటికే సగం మార్కెట్‌ను అంటే 52.7 శాతాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. కానీ 120 బేసిస్‌ పాయింట్లను మాత్రం కోల్గేట్‌ కోల్పోయింది. ఇదే క్రమంలో హిందూస్తాన్‌ యూనీలివర్‌ షేరు 240 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 17.6 శాతానికి పడిపోయింది. పతంజలితో పాటు హెర్బల్‌ ఉత్పత్తుల బ్రాండు డాబర్‌ కూడా మార్కెట్‌లో మంచి స్థానాన్నే సంపాదించుకుంది. ఈ బ్రాండు మార్కెట్‌ షేరు కూడా 20 బేసిస్‌ పాయింట్లు పెరిగి 12.1 శాతంగా నమోదైంది. 
 
ఆయుర్వేద ఉత్పత్తులకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ పెరుగుతుండటంతో చాలా కంపెనీలు హెర్బల్‌ వేరియంట్లలో టూత్‌పేస్ట్‌లను అందించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ ఉత్పత్తులైతే, సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతున్నాయో అవి ప్రస్తుతం మొత్తం టూత్‌పేస్ట్‌ మార్కెట్‌లో ఐదవంతు మార్కెట్‌ షేరును ఆక్రమించుకున్నాయి. దంత్‌ కాంతి బ్రాండులోనే కొత్త వేరియంట్లను తీసుకొచ్చేందుకు తాము ప్లాన్‌ చేస్తున్నామని పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అధికారిక ప్రతినిధి ఎస్‌కే టిజారవాలా చెప్పారు.
 
అలోవీరా, ఫ్రెష్‌ యాక్టివ్‌ జెల్‌, రెడ్‌ టూత్‌పేస్ట్‌లలో కూడా కొత్త వేరియంట్లను తీసుకొచ్చి, తమకున్న మార్కెట్‌ షేరును మరింత పెంచుకోనున్నామని తెలిపారు.  తమ కొత్త ఉత్పత్తులన్నింటికీ ఆయుర్వేద పద్ధతులు వాడుతామని, కానీ దాని వెనుకాల ఉన్న సైన్సును అర్థం చేసుకోకుండా.. బహుళ జాతీయ కంపెనీలు వాటిని కాపీ కొడుతున్నాయని చెప్పారు. దంత్‌ కాంతికి కౌంటర్‌గా కోల్గేట్‌ కూడా ఏడాది క్రితమే తన తొలి ఆయుర్వేద బ్రాండును తీసుకొచ్చింది. హెచ్‌యూఎల్‌ కూడా ఆయుర్వేద పర్సనల్‌ కేర్‌ ప్రొడక్ట్‌లను లాంచ్‌ చేస్తోంది. కానీ వాటికంటే శరవేగంగా పతంజలి ఉత్పత్తులే మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement