న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌పై ప్రస్తుతం వ్యక్తమవుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. అందులోనూ ఒక్కసారి మాత్రమే వినియోగించడానికి పనికివచ్చే ప్లాస్టిక్‌పైనయితే మరీను!!. ఇది పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది కనక దీన్ని నిషేధించాలనే డిమాండ్లు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వాలు సైతం ఈ దిశగా ఆలోచించడం మొదలెట్టాయి. ఈ పరిణామాలన్నీ పేపర్ పరిశ్రమకు కలిసొస్తాయనేది నిపుణుల మాట.
ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ మార్కెట్ ప్రస్తుతం దేశీయంగా రూ.80,000 కోట్ల స్థాయిలో ఉందని.. కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిషేధిస్తే 2025 నాటికి ఇందులో 25 శాతం వాటాను పేపర్ పరిశ్రమ సొంతం చేసుకుంటుందని ఓ అధ్యయన నివేదిక పేర్కొంది. లండన్ కేంద్రంగా పనిచేసే హైవ్ గ్రూపు అనుబంధ సంస్థ హైవ్ ఇండియా నిర్వహించిన పేపరెక్స్ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. ఒక్కసారి మాత్రమే వినియోగించడానికి పనికొచ్చే ప్లాస్టిక్‌ను 2022 నాటికి దేశంలో పూర్తిగా నిషేధించాలన్నది ప్రధాని మోదీ సంకల్పం.
ప్లాస్టిక్‌తో హాని ఎక్కువే...
‘‘2017–18లో భారత్‌లో సగటున ప్రతిరోజూ 26,000 టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగయింది. ఇందులో కేవలం 60 శాతమే రీసైకిల్ చేయగా (పునర్వినియోగానికి అనువుగా మార్చడం), మిగిలినది నేలపైనే ఉండిపోయింది. దేశంలో ప్లాస్టిక్ వినియోగంలో మూడింట ఒక వంతు వాటా ప్యాకేజింగ్ పరిశ్రమది. ప్యాకేజింగ్ ప్లాస్టిక్‌లో 70% చాలా స్వల్ప వ్యవధిలోనే చెత్తగా మారిపోతోంది. ప్లాస్టిక్ చెత్తను నేలపైనే వదిలేస్తే అది ఇతర జీవులకు హానికరంగా మారుతోంది. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ కవర్లు, స్టైరోఫోమ్ కంటెయినర్లు మట్టిలో కలసి పోవడానికి 1,000 ఏళ్లకుపైనే పడుతుంది’’ అని హైవ్ గ్రూపు నివేదిక వివరించింది. భారత్‌లో ప్లాస్టిక్ వినియోగం తలసరి 11 కిలోలు. అంతర్జాతీయ సగటు 28 కిలోలతో పోలిస్తే ఇది సగం కంటే తక్కువేనని నివేదిక వెల్లడించింది.
పేపర్ పర్యావరణ అనుకూలం..
ప్లాస్టిక్ స్థానంలో పేపర్ వాడటమనేది పర్యావరణ అనుకూలమని, ఇది సులభంగా మట్టిలో కలిసిపోతుందని ఈ అధ్యయనం గుర్తు చేసింది. ‘‘పేపర్ పరిశ్రమలు తమ ఉత్పత్తి కోసం చెట్లను నరికేస్తాయని, నీరు, ఇంధనాన్ని అధికంగా ఖర్చు చేస్తాయనేది వాస్తవం కాదు. దాదాపు పేపర్ పరిశ్రమలన్నీ తమ సొంత అడవుల నుంచో, రైతుల ద్వారా సేకరించిన చెట్ల నుంచో పేపర్ తయారు చేస్తున్నారు. వీరు పేపర్ కోసం నరికే చెట్ల కంటే నాటే చెట్లే ఎక్కువ.
కొత్తగా తయారవుతున్న పేపర్‌లో మూడింట ఒక వంతు చెత్త శుద్ధీ కరణ ద్వారానే వస్తోంది. భారత్‌లో పేపర్ కంపెనీలకు 46 శాతం ముడి సరుకు తాము సేకరించిన పేపర్ నుంచే వస్తోంది. మిగిలిన ముడి సరుకులో 27 శాతం వ్యవసాయ వ్యర్థాలైన బగాసే, స్ట్రా రూపంలో... 27 శాతం చెట్ల కలప రూపంలో ఉంటోంది’’ అని ఈ అధ్యయనం వాస్తవాలను తేటతెల్లం చేసింది. పేపర్ అన్నది అక్షరాస్యతను, పరిశుభ్రతను పెంచడంతో పాటు బగాసేను వినియోగించడం ద్వారా కాలుష్యం తగ్గుతోందని వివరించింది. ఒక టన్ను పేపర్‌కు 2.1 టన్నుల కలప అవసరమని, అటవీ కలపను పేపర్ తయారీకి వినియోగించడం లేదని వెల్లడించింది.
పేపర్‌కే ఖర్చు తక్కువ...
‘‘పేపర్‌ను రీసైకిల్ చేయటానికి కిలోకు రూ.32 ఖర్చవుతోంది. ఇందులో రూ.20 పాతవి సేకరించడానికి, రూ.12 రీసైకిల్‌కు కాగా... కిలో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయాలంటే సేకరణ ఖర్చు రూ.22–35, రీసైకిల్‌కు రూ.30–36 అవుతోంది. రవాణాకు కూడా టన్ను పేపర్‌కు కిలోమీటర్‌కు రూ.4.5 అయితే.. ప్లాస్టిక్‌కు రూ.6.2 అవుతోంది’’ అంటూ నివేదిక వివరించింది. ఇంధన వినియోగం కూడా పేపర్‌కు చాలా తక్కువని, 55–60 శాతం ఇంధనాన్ని ఆదా చేయొచ్చునని హైవ్ ఇండియా డైరెక్టర్ సంజీవ్ బాత్రా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment