Paper industry
-
పేపర్ పరిశ్రమకు దిగుమతుల దెబ్బ
న్యూఢిల్లీ: పేపర్, పేపర్‌బోర్డ్ దిగుమతులు 2024–25 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 9,92,000 టన్నులకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 3.5 శాతం పెరిగాయని ఇండియన్ పేపర్ మాన్యూఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) తెలిపింది. చైనా నుండి ఎగుమతులు గణనీయంగా అధికం కావడమే ఇందుకు కారణమని అసోసియేషన్ వెల్లడించింది. దేశంలో తగినంత ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో చైనా నుండి కాగితం, పేపర్‌బోర్డ్ దిగుమతులు 44 శాతం దూసుకెళ్లాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం అధిక ఎగుమతులు కారణంగా 2023–24లో ఆసియాన్ దేశాల నుండి ఈ ఉత్పత్తుల దిగుమతులు 34 శాతం పెరిగి 19.3 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలతో జరిగిన ప్రీ–బడ్జెట్ సమావేశాలలో అసోసియేషన్ తన గళాన్ని వినిపించింది. కాగితం, పేపర్‌బోర్డ్ దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 10 నుండి 25 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమ.. రెండు కోవిడ్ సంవత్సరాల్లో కొంత నియంత్రణ తర్వాత.. భారత్‌కు కాగితం సరఫరా పెరుగుతూనే ఉందని ఐపీఎంఏ ప్రెసిడెంట్ పవన్ అగర్వాల్ తెలిపారు. ‘దేశీయ తయారీ పరిశ్రమ వృద్ధిని దిగుమతులు దెబ్బతీస్తున్నాయి. దీంతో ఇక్కడి ప్లాంట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. పరిశ్రమ నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతోంది. చైనా, చిలీ, ఇటీవల ఇండోనేíÙయా నుండి పెరుగుతున్న దిగుమతుల దృష్ట్యా వర్జిన్ ఫైబర్ పేపర్‌బోర్డ్‌ను దేశీయంగా తయారు చేస్తున్న కంపెనీలకు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ దేశాల నుంచి భారత్‌కు సరఫరా 2020–21 నుండి మూడు రెట్లు ఎక్కువయ్యాయి. దేశీయ కాగితపు పరిశ్రమ ఇప్పటికే సామర్థ్యాలను పెంపొందించడానికి గణనీయంగా మూలధన పెట్టుబడులు పెట్టినప్పటికీ, వాటి ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. దోపిడీ దిగుమతులు పెరగడం వల్ల లాభదాయత ప్రభావితమైంది’ అని వివరించారు. -
రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్..!
కోవిడ్-19 దెబ్బకు విద్యార్థులు పూర్తిగా ఆన్లైన్ చదువులకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా ఉదృతి తగ్గడంతో స్కూళ్లు ఒపెన్ అయ్యాయి. నెలరోజులుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఇంటి బడ్జెట్ భారీగా పెరిగింది. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. కాగా ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ విద్యార్థుల చదువుపై పడనున్నట్లు సమాచారం. విద్యార్థుల చదువులు మరింత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. భారీగా పెరగనున్న పుస్తకాల ధరలు..! రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్, కోల్ ధరలు భారీగా పెరిగాయి. ధరల పెరుగుదల ఒక్కింతా పేపర్ పరిశ్రమలకు కూడా శాపంగా మారింది. దీంతో విద్యార్థుల పుస్తకాలు, నోట్ బుక్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముడి పదార్థాల ధరలు పెరగటంతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ) వేస్ట్ కటింగ్స్ ఎగుమతులపై నిషేధం విధించటంతో నోట్‌బుక్స్ ధరల పెరిగే అవకాశం ఉందని పేపర్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. పేపర్ కొరత కారణంగా రానున్న రోజుల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ తగ్గిపోయి వచ్చే విద్యా సంవత్సరంలో వాటికి కొరత ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మే నుంచి ధరల బాదుడు..! పేపర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇప్పటికే తమ డీలర్లకు నోట్ పుస్తకాల ధరలను పెంచుతున్నట్లు సంకేతాలిచ్చాయి. పుస్తకాలు, నోట్ బుక్స్ ధరలు మే నుంచి పెరగనున్నాయి. ఇప్పటికే పెంచిన ధరలతో నోట్‌బుక్స్‌ను సరఫరా చేస్తామని డీలర్లకు సదరు కంపెనీలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.కోవిడ్ కంటే ముందు కేజీ పేపర్ ధర రూ.55 ఉండగా ప్రస్తుతం రూ.100కి చేరింది. పేపర్ తయారీలో ఉపయోగించే అన్ని రకాలైన ముడి పదార్ధాల ధరలు పెరగటంతో తాము ధరలు పెంచక తప్పటం లేదని అఖిల భారత పేపర్ ట్రేడర్స్ సమాఖ్య ప్రెసిడెంట్ దీపక్ మిట్టల్ తెలిపారు. నిషేధం విధించిన ఈయూ..! పేపర్ వేస్ట్ కటింగ్స్‌పై ఈయూ దేశాలు నిషేధం విధించటంతో పేపర్ పరిశ్రమపై భారీ ప్రభావం చూపనుంది. కాగా నిషేధంపై చర్చించేందుకు ఈయూ దేశాలు ఏప్రిల్ 14న భేటీ కానుండగా...దీనిపై సానుకూల నిర్ణయం తీసుకున్నా ధరలు దిగిరావటానికి చాలా సమయం పట్టే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తగ్గిపోయిన పాత పేపర్లు..! ప్యాకేజింగ్‌పై ఎఫెక్ట్..! కోవిడ్ కారణంగా వార్తాపత్రికలు, జర్నల్స్‌కు ప్రజలు దూరంగా ఉండిపోయారు. దీంతో పాత పేపర్ల రీసర్క్యులేషన్ 35 శాతం మేర తగ్గిపోయింది. ఇప్పుడిదే దిగ్గజ ఎఫ్ఎంసీజీ, ఈ కామర్స్ సంస్థలకు ప్యాకేజింగ్ విషయంలో భారీ నష్టం జరగనుంది. కార్డ్బోర్డ్ తయారీలో పాత పేపర్లే కీలకం. కార్డ్ బోర్డ్ ప్యాకేజింగ్ విషయంలో ఈ సంస్థలను తీవ్రంగా వేధించనున్నాయి. చదవండి: ఎలన్‌మస్క్ సంచలన నిర్ణయం..! సోషల్ మీడియాపై గురి..! -
ఆస్ట్రేలియాకు ఫేస్బుక్ షాక్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ షాకిచ్చింది. ఫేస్బుక్ సంస్థకు మీడియా ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూలో(ఆదాయం) చెల్లించాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని ఫేస్బుక్ తిరస్కరించింది. అయితే, మీడియా ద్వారా సేకరిస్తున్న సమాచారం వల్ల తమకు వాణిజ్య పరంగా ఎలాంటి ఉపయోగం లేదని, కావాలంటే మీడియా సమాచారాన్ని ఫేస్బుక్ ఫ్లాట్ఫార్మ్లో ఉపయోగించమని సంస్థ తెలిపింది. అయితే గూగుల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు మీడియా సమాచారాన్ని ఉపయోగించినందుకు ప్రకటనల ద్వారా వచ్చే లాభాలలో కొంత మీడియాకు చెల్లించే విధంగా కృషి చేయాలని ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ)ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్, గూగుల్‌లకు ఉన్న బ్రాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రకటనల ద్వారా ఆదాయాన్ని ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంలో ఆసీస్ దిగ్గజ మీడియా సంస్థలైన రూపెర్ట్ ముర్డోచ్, న్యూస్ కార్ప్ లాంటి సంస్థల ప్రోద్బలం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా గత కొంత కాలంగా ఆన్లైన్ ప్రకటనల ద్వారా మీడియా సమాచారాన్ని వాడుకొని ఫేస్బుక్ సంస్థ లాభాలను అర్జిస్తుందని ఇటీవల రూపెర్ట్ ముర్డోచ్, న్యూస్ కార్ప్ సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో పత్రికా రంగాన్ని కాపాడాలంటే వాటికి వచ్చే నష్టాలను అధ్యయనం చేసి, పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. (చదవండి: జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్‌కు షాక్) -
ఇక.. పేపర్ రెపరెపలు!!
న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌పై ప్రస్తుతం వ్యక్తమవుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. అందులోనూ ఒక్కసారి మాత్రమే వినియోగించడానికి పనికివచ్చే ప్లాస్టిక్పైనయితే మరీను!!. ఇది పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది కనక దీన్ని నిషేధించాలనే డిమాండ్లు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వాలు సైతం ఈ దిశగా ఆలోచించడం మొదలెట్టాయి. ఈ పరిణామాలన్నీ పేపర్ పరిశ్రమకు కలిసొస్తాయనేది నిపుణుల మాట. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ మార్కెట్ ప్రస్తుతం దేశీయంగా రూ.80,000 కోట్ల స్థాయిలో ఉందని.. కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిషేధిస్తే 2025 నాటికి ఇందులో 25 శాతం వాటాను పేపర్ పరిశ్రమ సొంతం చేసుకుంటుందని ఓ అధ్యయన నివేదిక పేర్కొంది. లండన్ కేంద్రంగా పనిచేసే హైవ్ గ్రూపు అనుబంధ సంస్థ హైవ్ ఇండియా నిర్వహించిన పేపరెక్స్ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. ఒక్కసారి మాత్రమే వినియోగించడానికి పనికొచ్చే ప్లాస్టిక్‌ను 2022 నాటికి దేశంలో పూర్తిగా నిషేధించాలన్నది ప్రధాని మోదీ సంకల్పం. ప్లాస్టిక్‌తో హాని ఎక్కువే... ‘‘2017–18లో భారత్‌లో సగటున ప్రతిరోజూ 26,000 టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగయింది. ఇందులో కేవలం 60 శాతమే రీసైకిల్ చేయగా (పునర్వినియోగానికి అనువుగా మార్చడం), మిగిలినది నేలపైనే ఉండిపోయింది. దేశంలో ప్లాస్టిక్ వినియోగంలో మూడింట ఒక వంతు వాటా ప్యాకేజింగ్ పరిశ్రమది. ప్యాకేజింగ్ ప్లాస్టిక్‌లో 70% చాలా స్వల్ప వ్యవధిలోనే చెత్తగా మారిపోతోంది. ప్లాస్టిక్ చెత్తను నేలపైనే వదిలేస్తే అది ఇతర జీవులకు హానికరంగా మారుతోంది. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ కవర్లు, స్టైరోఫోమ్ కంటెయినర్లు మట్టిలో కలసి పోవడానికి 1,000 ఏళ్లకుపైనే పడుతుంది’’ అని హైవ్ గ్రూపు నివేదిక వివరించింది. భారత్‌లో ప్లాస్టిక్ వినియోగం తలసరి 11 కిలోలు. అంతర్జాతీయ సగటు 28 కిలోలతో పోలిస్తే ఇది సగం కంటే తక్కువేనని నివేదిక వెల్లడించింది. పేపర్ పర్యావరణ అనుకూలం.. ప్లాస్టిక్ స్థానంలో పేపర్ వాడటమనేది పర్యావరణ అనుకూలమని, ఇది సులభంగా మట్టిలో కలిసిపోతుందని ఈ అధ్యయనం గుర్తు చేసింది. ‘‘పేపర్ పరిశ్రమలు తమ ఉత్పత్తి కోసం చెట్లను నరికేస్తాయని, నీరు, ఇంధనాన్ని అధికంగా ఖర్చు చేస్తాయనేది వాస్తవం కాదు. దాదాపు పేపర్ పరిశ్రమలన్నీ తమ సొంత అడవుల నుంచో, రైతుల ద్వారా సేకరించిన చెట్ల నుంచో పేపర్ తయారు చేస్తున్నారు. వీరు పేపర్ కోసం నరికే చెట్ల కంటే నాటే చెట్లే ఎక్కువ. కొత్తగా తయారవుతున్న పేపర్లో మూడింట ఒక వంతు చెత్త శుద్ధీ కరణ ద్వారానే వస్తోంది. భారత్‌లో పేపర్ కంపెనీలకు 46 శాతం ముడి సరుకు తాము సేకరించిన పేపర్ నుంచే వస్తోంది. మిగిలిన ముడి సరుకులో 27 శాతం వ్యవసాయ వ్యర్థాలైన బగాసే, స్ట్రా రూపంలో... 27 శాతం చెట్ల కలప రూపంలో ఉంటోంది’’ అని ఈ అధ్యయనం వాస్తవాలను తేటతెల్లం చేసింది. పేపర్ అన్నది అక్షరాస్యతను, పరిశుభ్రతను పెంచడంతో పాటు బగాసేను వినియోగించడం ద్వారా కాలుష్యం తగ్గుతోందని వివరించింది. ఒక టన్ను పేపర్‌కు 2.1 టన్నుల కలప అవసరమని, అటవీ కలపను పేపర్ తయారీకి వినియోగించడం లేదని వెల్లడించింది. పేపర్‌కే ఖర్చు తక్కువ... ‘‘పేపర్‌ను రీసైకిల్ చేయటానికి కిలోకు రూ.32 ఖర్చవుతోంది. ఇందులో రూ.20 పాతవి సేకరించడానికి, రూ.12 రీసైకిల్‌కు కాగా... కిలో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయాలంటే సేకరణ ఖర్చు రూ.22–35, రీసైకిల్‌కు రూ.30–36 అవుతోంది. రవాణాకు కూడా టన్ను పేపర్‌కు కిలోమీటర్‌కు రూ.4.5 అయితే.. ప్లాస్టిక్‌కు రూ.6.2 అవుతోంది’’ అంటూ నివేదిక వివరించింది. ఇంధన వినియోగం కూడా పేపర్‌కు చాలా తక్కువని, 55–60 శాతం ఇంధనాన్ని ఆదా చేయొచ్చునని హైవ్ ఇండియా డైరెక్టర్ సంజీవ్ బాత్రా చెప్పారు. -
కాగిత పరిశ్రమకు ఈ–వాణిజ్యం దన్ను..
న్యూఢిల్లీ: కాగిత పరిశ్రమ అభివృద్ధికి ఈ–వాణిజ్యం కొత్త బాటలు వేస్తోందని పేపర్‌ఎక్స్ ప్రదర్శనలో పాల్గొన్న సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కాలుష్యం కారణంగా చైనాలో చిన్నస్థాయి ప్యాకేజింగ్ సంస్థలపై నిషేధం విధించడంతో ఈ–వాణిజ్య కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్ ఎండీ ఆర్ఎన్ అగర్వాల్అన్నారు. రీసైక్లింగ్ ప్యాకేజింగ్‌లో ఏటా డిమాండ్ 9.5 శాతం పెరుగుతోందని సెంచురీ పేపర్ సీఈఓ ఎంజేపీ నరైన్ తెలిపారు. పేపర్ రీసైక్లింగ్‌కు అవకాశం ఉండటంతో అభివృద్ధి చెందిన దేశాలు కాగితాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాయని ఐటీఈ ఇండియా డైరెక్టర్ సంజీవ్ బాత్రా తెలిపారు. -
పేపర్ పరిశ్రమల అంతర్జాతీయ సమ్మేళనం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం డిజిటల్‌మయమైనా పేపర్ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని కేంద్ర సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో ప్రపంచంలోని 22 దేశాల నుంచి ప్రముఖ సంస్థలు పాల్గొని పేపర్ తయారీలో ఆయా సంస్థలు అనుసరిస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించేలా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఈ సదస్సును కేంద్ర మంత్రులు హర్షవర్దన్, సీఆర్ చౌదరీ, విజయ్ గోయల్, ఐటీఈటీ డైరెక్టర్ గగన్ సహాని, కేంద్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి వందనా కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పేపర్ తయారీలో చెట్ల వాడకాన్ని తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి సీఆర్ చౌదరీ సూచించారు. -
నష్టాలొచ్చినా కాగితం ధర పెంచలేం..
దిగుమతులే ఇందుకు కారణం - సుంకం విధించాలని ప్రభుత్వాన్ని కోరాం - పేపర్‌టెక్ సదస్సులో వక్తలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాగితం పరిశ్రమ కష్టాల కడలి ఈదుతోంది. ముడిపదార్థాల వ్యయం రెట్టింపు అయింది. అటు కలప కొరత పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఇక్కడి కంపెనీలు పేపర్ ధర పెంచాయి. దక్షిణాసియా దేశాలతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. దిగుమతులపై ఎటువంటి పన్నులేదు. దీనికితోడు 5-7 శాతం ధర తక్కువ. ఇంకేముంది ఇక్కడి వ్యాపారులు పేపర్‌ను ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసుకుంటున్నారు. మొత్తం వినియోగంలో దిగుమతైన పేపర్ వాటా 20%. ఈ పరిస్థితుల్లో నష్టాలొచ్చినా ప్రస్తుతం ధర పెంచలేకపోతున్నామని ఇండియన్ పేపర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఐటీసీ పేపర్‌బోర్డ్స్ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ సింగ్ తెలిపారు. బుధవారం ప్రారంభమైన పేపర్‌టెక్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. దిగుమతులపై సుం కం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. పరిశ్రమకు 20 లక్షల ఎకరాలు.. కలపను ఇప్పటికీ దేశీయ పేపర్ పరిశ్రమ దిగుమతి చేసుకుంటోంది. దీనిని నివారించాలంటే అదనంగా 20 లక్షల ఎకరాల్లో కలప పండించాల్సిందేనని శేషసాయి పేపర్ చైర్మన్ ఎన్.గోపాలరత్నం వెల్లడించారు. అవసరమైన భూముల కోసం అటవీ చట్టాలను సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ప్రభుత్వం ఈ దిశగా సానుకూలంగా ఉంది అని తెలిపారు. పట్టణీకరణ మూలంగా పేపర్ వినియోగం పెరుగుతోందని, ఈ ఏడాది వృద్ధి రేటు 5-6 శాతం ఉంటుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల కారణంగా ముద్రణ కాగితం వాడకం నాలుగేళ్లలో 20 శాతం తగ్గిందని పేపర్‌టెక్ 2015 చైర్మన్ కేఎస్ కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. కాగా, భారతీయ ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 80 శాతం మాత్రమే ఉంది. 90-95 శాతం ఉంటేనే కంపెనీలు నిలదొక్కుకుంటాయని వక్తలు చెప్పారు. -
3,500 కోట్లతో కాగితపు పరిశ్రమ
తెలంగాణలో ఏర్పాటుకు ఐటీసీ సంసిద్ధత సీఎంతో పారిశ్రామిక వేత్తల భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో హిందుజా చైర్మన్ అశోక్ హిందుజా, మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణి, ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రదీప్ దొబాలే, డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్‌సింగ్ తదితరులు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయాధార పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు స్థాపించేందుకు, తెలంగాణలో దాదాపు లక్ష ఎకరాల్లో సర్వి చెట్లు పెంచేందుకు ఐటీసీ తన సంసిద్ధతను వ్యక్తంచేసింది. రూ. 3,500 కోట్ల పెట్టుబడితో కాగితపు పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని సమకూర్చేందుకు కేసీఆర్ సంసిద్ధత వ్యక్తంచేశారు. తెలంగాణలో మైక్రోసాఫ్ట్ కార్యక్రమాలను మరింత విస్తరించాలనుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా ఛైర్మన్ భాస్కర్ ప్రామాణి ప్రకటించారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో ఆయన కేసీఆర్‌ను కలిశారు. ఒప్పందం ప్రకారం తమకు రావాల్సిన విద్యుత్‌ను సరఫరా చేయాలని ముఖ్యమంత్రి హిందుజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందుజాను కోరారు. త్వరలో తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని ఆయన పారిశ్రామిక వేత్తలకు చెప్పారు. -
పేపర్‌కు చిక్కు‘ముడి’
పెరుగుతున్న ముడిపదార్థాల వ్యయం చిక్కులు తెస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కాగితం ధర మరింత పెరిగే అవకాశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాగితం పరిశ్రమకు పుట్టెడు కష్టాలు వచ్చిపడుతున్నాయి. రెండేళ్లుగా ముడి పదార్థాల వ్యయం రెండింతలవడం, కలప కొరతతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. విద్యుత్ చార్జీలు కూడా తడిసి మోపెడవుతున్నాయి. వెరసి పేపర్ ధర పెంచడంతో దిగుమతులు పెరిగేందుకు పరిస్థితులే అవకాశం కల్పిస్తున్నాయి. దక్షిణాసియా దేశాలతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. ఈ దేశాల నుంచి కొన్ని రకాల పేపర్ విరివిగా భారత్‌కు దిగుమతి అవుతోంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కాగితంతో పోలిస్తే దక్షిణాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని రకాల డ్యూటీ ఫ్రీ(పన్నులు లేని) కాగితం ధర టన్నుకు రూ.3 వేల దాకా తక్కువగా ఉంటోందని పేపర్‌టెక్ 2014 చైర్మన్, శేషసాయి పేపర్, బోర్డ్స్ ఎండీ కేఎస్ కాశీ విశ్వనాథన్ శుక్రవారమిక్కడ తెలిపారు. సీఐఐ పేపర్‌టెక్ సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పెరగనున్న కాగితం ధర.. ప్రస్తుత పరిస్థితుల్లో కాగితం ధర పెంచక తప్పదని విశ్వనాథన్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 15 శాతం దాకా ధర పెరిగిందని చెప్పారు. వ్యయాలు పెరిగినప్పుడల్లా ఆ భారాన్ని కస్టమర్లపై మోపడం లేదని తెలిపారు. సాధ్యమైనంత వరకు అంతర్గత వ్యయాలను తగ్గించుకోవడంపైనే దృష్టిసారిస్తున్నామని చెప్పారు. దేశీయంగా కలప ధరను నియంత్రించగలిగామన్నారు. వార్తాపత్రికలే బెటర్.. ప్రింట్ మీడియాతో పోలిస్తే ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రాచుర్యం పెరుగుతోందని ఐటీసీ పేపర్ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, పేపర్‌టెక్ కో చైర్ సంజయ్ సింగ్ తెలిపారు. అయితే ఎలక్ట్రానిక్ విధానంలో విద్యుత్ ఎక్కువగా ఖర్చు అవుతుందని చెప్పారు. కాగా, దేశీయ పేపర్ పరిశ్రమ పరిమాణం రూ.40,000 కోట్లుంది. 1.2-1.3 కోట్ల టన్నుల పేపర్ ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమ ఈ ఏడాది 7-8 శాతం వద్ధి ఆశిస్తోంది. కార్యక్రమంలో సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ సురేశ్ ఆర్ చిట్టూరి తదితరులు పాల్గొన్నారు.