పేపర్‌కు చిక్కు‘ముడి’
పెరుగుతున్న ముడిపదార్థాల వ్యయం
చిక్కులు తెస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు
కాగితం ధర మరింత పెరిగే అవకాశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాగితం పరిశ్రమకు పుట్టెడు కష్టాలు వచ్చిపడుతున్నాయి. రెండేళ్లుగా ముడి పదార్థాల వ్యయం రెండింతలవడం, కలప కొరతతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. విద్యుత్ చార్జీలు కూడా తడిసి మోపెడవుతున్నాయి. వెరసి పేపర్ ధర పెంచడంతో దిగుమతులు పెరిగేందుకు పరిస్థితులే అవకాశం కల్పిస్తున్నాయి. దక్షిణాసియా దేశాలతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి.
ఈ దేశాల నుంచి కొన్ని రకాల పేపర్ విరివిగా భారత్‌కు దిగుమతి అవుతోంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కాగితంతో పోలిస్తే దక్షిణాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని రకాల డ్యూటీ ఫ్రీ(పన్నులు లేని) కాగితం ధర టన్నుకు రూ.3 వేల దాకా తక్కువగా ఉంటోందని పేపర్‌టెక్ 2014 చైర్మన్, శేషసాయి పేపర్, బోర్డ్స్ ఎండీ కేఎస్ కాశీ విశ్వనాథన్ శుక్రవారమిక్కడ తెలిపారు. సీఐఐ పేపర్‌టెక్ సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
పెరగనున్న కాగితం ధర..
ప్రస్తుత పరిస్థితుల్లో కాగితం ధర పెంచక తప్పదని విశ్వనాథన్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 15 శాతం దాకా ధర పెరిగిందని చెప్పారు. వ్యయాలు పెరిగినప్పుడల్లా ఆ భారాన్ని కస్టమర్లపై మోపడం లేదని తెలిపారు. సాధ్యమైనంత వరకు అంతర్గత వ్యయాలను తగ్గించుకోవడంపైనే దృష్టిసారిస్తున్నామని చెప్పారు. దేశీయంగా కలప ధరను నియంత్రించగలిగామన్నారు.
వార్తాపత్రికలే బెటర్..
ప్రింట్ మీడియాతో పోలిస్తే ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రాచుర్యం పెరుగుతోందని ఐటీసీ పేపర్ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, పేపర్‌టెక్ కో చైర్ సంజయ్ సింగ్ తెలిపారు. అయితే ఎలక్ట్రానిక్ విధానంలో విద్యుత్ ఎక్కువగా ఖర్చు అవుతుందని చెప్పారు. కాగా, దేశీయ పేపర్ పరిశ్రమ పరిమాణం రూ.40,000 కోట్లుంది. 1.2-1.3 కోట్ల టన్నుల పేపర్ ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమ ఈ ఏడాది 7-8 శాతం వద్ధి ఆశిస్తోంది. కార్యక్రమంలో సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ సురేశ్ ఆర్ చిట్టూరి తదితరులు పాల్గొన్నారు.