చైనా నుంచి కొనుగోళ్ల వెల్లువ
సుంకాన్ని పెంచాలన్న ఐపీఎంఏ
న్యూఢిల్లీ: పేపర్, పేపర్‌బోర్డ్ దిగుమతులు 2024–25 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 9,92,000 టన్నులకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 3.5 శాతం పెరిగాయని ఇండియన్ పేపర్ మాన్యూఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) తెలిపింది. చైనా నుండి ఎగుమతులు గణనీయంగా అధికం కావడమే ఇందుకు కారణమని అసోసియేషన్ వెల్లడించింది.
దేశంలో తగినంత ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో చైనా నుండి కాగితం, పేపర్‌బోర్డ్ దిగుమతులు 44 శాతం దూసుకెళ్లాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం అధిక ఎగుమతులు కారణంగా 2023–24లో ఆసియాన్ దేశాల నుండి ఈ ఉత్పత్తుల దిగుమతులు 34 శాతం పెరిగి 19.3 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలతో జరిగిన ప్రీ–బడ్జెట్ సమావేశాలలో అసోసియేషన్ తన గళాన్ని వినిపించింది. కాగితం, పేపర్‌బోర్డ్ దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 10 నుండి 25 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది.
క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమ..
రెండు కోవిడ్ సంవత్సరాల్లో కొంత నియంత్రణ తర్వాత.. భారత్‌కు కాగితం సరఫరా పెరుగుతూనే ఉందని ఐపీఎంఏ ప్రెసిడెంట్ పవన్ అగర్వాల్ తెలిపారు. ‘దేశీయ తయారీ పరిశ్రమ వృద్ధిని దిగుమతులు దెబ్బతీస్తున్నాయి. దీంతో ఇక్కడి ప్లాంట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. పరిశ్రమ నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతోంది. చైనా, చిలీ, ఇటీవల ఇండోనేíÙయా నుండి పెరుగుతున్న దిగుమతుల దృష్ట్యా వర్జిన్ ఫైబర్ పేపర్‌బోర్డ్‌ను దేశీయంగా తయారు చేస్తున్న కంపెనీలకు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ దేశాల నుంచి భారత్‌కు సరఫరా 2020–21 నుండి మూడు రెట్లు ఎక్కువయ్యాయి. దేశీయ కాగితపు పరిశ్రమ ఇప్పటికే సామర్థ్యాలను పెంపొందించడానికి గణనీయంగా మూలధన పెట్టుబడులు పెట్టినప్పటికీ, వాటి ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. దోపిడీ దిగుమతులు పెరగడం వల్ల లాభదాయత ప్రభావితమైంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment