న్యూఢిల్లీ: చైనాలో డిమాండ్ పడిపోవడంతో ఆ దేశం నుంచి ఉక్కు దిగుమతులు దేశాన్ని ముంచెత్తుతున్నాయంటూ కేంద్ర ఉక్కు శాఖ మాజీ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా తెలిపారు. ‘‘ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల పరంగా చూస్తే దిగుమతులు పెద్ద సమస్యగా ఉంది. చైనాలో వినియోగం పడిపోవడం మన మార్కెట్‌ను కుదిపేస్తోంది’’అని సిన్హా పేర్కొన్నారు.
‘ఇండియన్ ఐరన్ ఓర్, పెల్లెట్’ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెరిగిపోతున్న దిగుమతులతో స్థానిక ఉక్కు ఉత్పత్తుల ధరలపై, స్టీల్ తయారీ సంస్థల లాభాలపై ప్రభావం పడుతుందన్నారు. ‘‘చైనా నుంచి అనుచితంగా దిగుమతులు వచ్చి పడుతున్నాయి. దీని పట్ల భారత ప్రభుత్వం సకాలంలో స్పందించాలి’’ అని అన్నారు. చైనా తదితర దేశాల నుంచి ముంచెత్తుతున్న చౌక స్టీల్ దిగుమతులను అడ్డుకోవాలంటూ పరిశ్రమ ఇప్పటికే ఎన్నో పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం గమనార్హం.
ప్రపంచ ఉక్కు ఎగుమతుల కేంద్రంగా భారత్ మారాలన్న లక్ష్యానికి విరుద్ధంగా.. మన దేశం నికర దిగుమతుల దేశంగా మారుతుండడం పట్ల పరిశ్రమ ఆందోళనను వ్యక్తం చేసింది. దిగుమతులపై సంకాల విధింపునకు ఏడాది, ఏడాదిన్నర సమయం తీసుకుంటే, అది దేశీ పరిశ్రమకు మేలు చేయబోదని సిన్హా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment